బాబుకు ఓటు అడిగే హక్కు లేదు
మంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురంలలో గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. గురువారం పటాన్‌చెరులో చంద్రబాబు రోడ్‌షోకు వచ్చిన జనం చాలా తక్కువగా ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అయితే వచ్చిన వారు కూడా ఓట్లు వేయరన్నారు.
కేసీఆర్ ఇస్తున్న హామీలను, చేస్తున్న పనులను చూసి ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాలు దుష్ర్పచారానికి పాల్పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి రూ.5 భోజనం బాగుందంటే ఇతర కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ పాలన బాగాలేదంటూ విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీలో చంద్రబాబు కృష్ణా జలాలను తెలంగాణకు తీసుకురావడాన్ని అడ్డుకున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటింటికి తాగునీరు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.