
ఎల్ రమణ(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన తన రాజీనామా లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ‘తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 ఏళ్లుగా నా ఎదుగుదలకు సహకరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’అని చంద్రబాబుకు పంపిన ఆ లేఖలో ఎల్.రమణ పేర్కొన్నారు.
తెలంగాణ భవన్ వేదికగా చేరిక
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయిన ఎల్.రమణ అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎల్.రమణ సన్నిహితుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఎల్.రమణ ‘సాక్షి’కి వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముందని, చేరిక తేదీపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment