అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు.
అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం.
సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు.
నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్‌మెంట్‌ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్‌హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది.
ఆంధ్రప్రదేశ్‌లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్‌బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్‌గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్‌గానే మిగిలిపోయింది.
ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్‌కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది.
కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి.
మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం.
ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి.
ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు.
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ.
కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్‌నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది.
ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్‌తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది.
రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి.
నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం.
1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్‌ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్‌లోకి 19,642 టీఎమ్‌సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్‌సీల నీరు ఆవిరైంది.
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్‌సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు.
పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది.
రోజుకు 6.5 టీఎమ్‌సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్‌మోహన్‌రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు.
బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్‌సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్‌సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్‌మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.
గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు.
రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్‌రన్ నడుస్తున్నది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
నెత్తుటి పారుదల యాగమా ఇది?
Published Sun, Aug 6 2023 12:29 AM | Last Updated on Sun, Aug 6 2023 3:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment