సీజ్‌ ద పోర్ట్‌ | Sakshi Editorial On Election promises | Sakshi
Sakshi News home page

సీజ్‌ ద పోర్ట్‌

Published Sun, Dec 8 2024 4:25 AM | Last Updated on Sun, Dec 8 2024 1:01 PM

Sakshi Editorial On Election promises

జనతంత్రం

ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.

నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.

ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్‌ వారు ఏం చేస్తున్నారో తెలుసా?

ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్‌ ద షిప్‌’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్‌ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం లోడ్‌చేసి ఉన్నాయట! అందులో మన రేషన్‌ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.

ఈ రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్‌ ద షిప్‌’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్‌ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్‌ సినిమా అవసరం లేదు. 

ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్‌ ద షిప్‌’ ఓ డైలాగ్‌ మాత్రమే! సినిమా టైటిల్‌ ‘సీజ్‌ ద పోర్ట్‌’ కావచ్చు!!

నవంబర్‌ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్‌ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్‌నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్‌ 27న కాకినాడ జిల్లా కలెక్టర్‌ యాంకరేజి పోర్టులో లోడింగ్‌ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్‌ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.

మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్‌ ద షిప్‌’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్‌ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!

మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్‌ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.

ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్‌ వాటర్‌ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్‌’ పేరుతో ఉన్న డీప్‌ వాటర్‌ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. డీప్‌ వాటర్‌ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!

నాదెండ్ల మనోహర్‌ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ కలిగిన ఒక మల్టీనేషనల్‌ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్‌లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. 

ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్‌సెన్స్‌ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా!  ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్‌సెన్స్‌ ప్రశ్న!  భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న.
 


ఒక సాధారణ రైస్‌ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్‌సీఎల్‌టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? 

కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?

వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! 

పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్‌ మిల్‌ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్‌ ద పోర్ట్‌’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!

పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్‌ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్‌ జైల్లో నిర్బంధించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. 

భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్‌ భూముల్లో జగన్‌ హయాంలో గోల్‌మాల్‌ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్‌ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement