భేతాళ కథ.. అంతా బాబు కుట్ర! | Chandrababu sketch for massive financial exploitation | Sakshi
Sakshi News home page

భేతాళ కథ.. అంతా బాబు కుట్ర!

Published Thu, Dec 5 2024 4:48 AM | Last Updated on Thu, Dec 5 2024 10:36 AM

Chandrababu sketch for massive financial exploitation

కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం 

ముందుగా పవన్, నాదెండ్లతో బియ్యం హైడ్రామా 

అనంతరం బాబు సన్నిహితుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు 

ఏమీ లేని అంశంలో వెంటనే సీఐడీ అక్రమ కేసు... 

చంద్రబాబు స్క్రిప్ట్  తోనే వాటాలు కొల్లగొట్టే కుట్ర సినిమా  

సహేతుకంగానే వాటాల విలువ నిర్దారణ 

కేవీ రావు సమ్మతితోనే వాటాల విక్రయం.. విక్రయంమొత్తం రూ.494 కోట్లను మరోచోట పెట్టుబడి పెట్టిన వైనం  

నాలుగున్నరేళ్లలో ఏనాడూ, ఎవరికీ ఫిర్యాదు చేయని కేవీ రావు  

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఫిర్యాదు వెనుక బాబు కుతంత్రం.. దాదాపు రూ.500 కోట్లతో కొనుగోలు చేస్తే బెదిరింపు అంటూ కొత్త నిర్వచనం 

నిజంగా బెదిరించి ఉంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా.. వాటాలు ఎందుకు కొంటారు?  

అదీ 41 శాతంతో మైనారిటీ వాటాదారుగా ఎందుకు ఉంటారు?  

51 శాతం వాటాతో మెజార్టీ వాటాదారుగానే ఉంటారు కదా! 

ఇప్పటికీ 59 శాతం వాటాతో నిర్ణయాధికారం కేవీ రావు గుప్పిట్లోనే.. అంతర్జాతీయ సంస్థ అరబిందో గ్రూప్‌పై కూటమి పెద్దల  దుష్ప్రచారం 

నాడు కాకినాడ పోర్టును కేవీ రావుకు కారుచౌకగా కట్టబెట్టింది బాబు ప్రభుత్వమే.. తాజాగా ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు సర్కార్‌ జోక్యం వెనుక భారీ కుట్ర  

ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు కుట్ర బట్టబయలైంది! తన పార్ట్‌నర్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో కాకినాడలో చేయించిన బియ్యం హైడ్రామా వెనుక పన్నాగం బయటపడింది. ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం అంతా చంద్రబాబు కుట్ర సినిమా టీజర్‌ అన్నది స్పష్టమైంది. సీఐడీ అక్రమ కేసులతో బెదిరించి కాకినాడ డీప్‌ వాటర్‌పోర్ట్‌లో వాటాలను కొల్లగొ­ట్టాలన్నదే అసలు కుట్ర అన్నది నిగ్గు తేలింది. 

భారీ ఆర్థిక దోపిడీ ధ్యేయంగా చంద్రబాబు అల్లిన భేతాళ కథ వెనుక  కుట్ర బట్టబయలైంది. పవన్, నాదెండ్ల ద్వారా వీధి నాటకం... అనంతరం తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌ ప్రమోటర్‌ కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు ...సీఐడీ అక్రమ కేసు నమోదు ...ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో పావులు కదిపా­రన్నది స్పష్టమైంది. 

ఎన్నికల హామీల అమలు­లో వైఫల్యం... టీడీపీ కూటమి పెద్దల దోపిడీతో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో డైవర్షన్‌ కుట్రను తెరపైకి తెస్తున్న చంద్రబాబు పన్నాగంలోని తాజా అంకమే ఈ అక్రమ కేసు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టడమే ఏకైక అజెండాగా సాగుతున్న పచ్చ నాటకం ఇదిగో ఇలా ఉంది.  – సాక్షి, అమరావతి

అంతా బాబు కుట్ర స్క్రిప్టే
బియ్యం రాద్ధాంతం డ్రామానే
కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్ట్‌ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ కొద్ది నెలలుగా కాకినాడలో పర్యటిస్తూ చంద్రబాబు పన్నాగానికి రంగం సిద్ధం చేశారు. ఇక కుట్రను వేగవంతం చేయాలని నిర్ణయించిన తరువాత చంద్రబాబు ఇందుకు పవన్‌ కళ్యాణ్‌ను పైలట్‌గా వాడుకున్నారు. 

ఆయన డైరెక్షన్‌లోనే పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ వద్దకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్‌ కెమెరాలతో రికార్డ్‌ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. 

అసలు విషయం ఏమిటంటే... బియ్యం ఎగుమతి చేసే యాంకరేజ్‌ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి కదా! దీన్ని  విస్మరిస్తూ కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టుపై పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేయడం గమనార్హం. 

అరబిందో సంస్థ కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు. అనంతరం ఈ నెల 2న (సోమవారం) పవన్‌ ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమై తాను డ్రామాను ఎలా పండించిందీ వివరించారు. 

కేవీరావు తప్పుడు ఫిర్యాదు... 
వెంటనే సీఐడీ అక్రమ కేసు
తమ కుట్ర సీన్‌ పండిందని భావించిన చంద్రబాబు అసలు పాత్రధారిని తెరపైకి తెచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్‌ వాటర్‌పోర్ట్‌ ప్రమోటర్‌ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన తాపీగా నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... అదే రోజు సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం.
 
అంతా కట్టు కథ... ఇదీ బాబు కుట్ర
కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా కట్టు కథే! పోర్టులో 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు కేవీ రావు 2020లో విక్రయించారు. ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలు విక్రయించబట్టే అరబిందో సంస్థ చెల్లించిన ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. ఆ మొత్తాన్ని మరో  సంస్థలో పెట్టుబడిగా పెట్టారు కూడా. కాకినాడ పోర్ట్‌లో వాటాల విక్రయంపై ఆయనకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా ఆ మొత్తాన్ని తిరస్కరించేవారు.

అప్పుడే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, స్టాక్‌ ఎక్సŠచ్‌ంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ), నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికి ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. 

కానీ ఆయన ఏ దశలోనూ ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. ఆ వాటాల విక్రయం కోసం మంతనాలు, అనంతరం ఒప్పందం, విక్రయం అంతా హైదరాబాద్‌ కేంద్రంగా సాగాయి. 

మరి తెలంగాణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా! హైదరాబాద్‌లో పోలీసులకుగానీ సీఐడీకి గానీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు కుట్రలో కేవీ రావు పాత్రధారన్నది స్పష్టమవుతోంది. 

అంతర్జాతీయస్థాయి సంస్థపై దుష్ప్రచారం
అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన గ్రూప్‌. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్‌ సాధిస్తోంది. అరబిందో సంస్థ ఏటా రూ.3 వేల కోట్ల నికర లాభం చూపుతోంది. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించే అరబిందో సంస్థ పూర్తి స్థాయిలో విశ్లేషించిన అనంతరం సహేతుకంగా, చట్టబద్ధంగానే కొత్త సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. 

అదే రీతిలో కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో కూడా వ్యూహాత్మక పెట్టుబడిగానే 41 శాతం వాటాలను కొనుగోలు చేసింది. పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్‌ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. 

దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్‌ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో  సంస్థకే అవకాశం ఇవ్వాలి. 

ఆ నిబంధన (రైట్‌ టు ఫస్ట్‌ రెఫ్యూజల్‌) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అది పూర్తిగా ఆ సంస్థ వ్యాపార ప్రణాళిక. అరబిందో, కేవీ రావు మధ్య ప్రైవేట్‌ ఒప్పందం. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికిగానీ ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. 

ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే 
కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమే­నన్నది అసలు వాస్తవం. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు  ప్రైవేటుపరం చేశారు. 

ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.

ప్రైవేటు లావాదేవీలకు వక్రభాష్యం... అదే బాబు ప్రభుత్వ పన్నాగం
కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. 

రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. 

ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్‌ విలువ పెరుగుతుంది. మార్కెట్‌ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది?  

పోర్టు విలువపైఅవాస్తవ ప్రచారం 
కాకినాడ పోర్టు వాటాలను తక్కువగా విలువ కట్టారన్న కేవీ రావు ఫిర్యాదులో నిజం లేదు. వాటాల విక్రయం కోసం దాదాపు ఐదేళ్ల క్రితం అరబిందో సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అప్పటి మార్కెట్‌ విలువ వేరు. ప్రస్తుతం ఐదేళ్ల తరువాత మార్కెట్‌ విలువ వేరు. ఆ రెండూ ఒకటే అన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. మరి అదే విధానమైతే... ఈనాడు రామోజీరావు కుటుంబం ఫిల్మ్‌ సిటీ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ శివార్లలో దాదాపు 2 వేల ఎకరాలు కారుచౌకగా కొనుగోలు చేసింది. 

ప్రస్తుతం ఆ భూముల విలువ పెరిగింది కాబట్టి... ఆనాడు భూములు అమ్మిన రైతులు వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తారా? మరి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవీ రావు, అరబిందో సంస్థ మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం విష ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రే.

బెదిరించి ఉంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా..!
ఏకంగా 51 శాతం వాటా దక్కించుకునేవారు 
తనను బెదిరించి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందని కేవీ రావు చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేరిట నిజంగా బెదిరించి ఉంటే అరబిందో సంస్థ వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఫ్రీగానే వాటాలను తీసేసుకునేది.

ఒకవేళ బెదిరించి కొనుగోలు చేయాలన్నా కేవలం 41 శాతం వాటానే ఎందుకు కొనుగోలు చేస్తుంది ? కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది కదా! 41 శాతం వాటా అంటే పోర్టులో మైనారిటీ భాగస్వామే అవుతుంది. అంటే నిర్ణయా­ధికారం ఉండదు. కనీసం 51 శాతం వాటా ఉంటేనే నిర్ణయాధికారం ఉంటుంది. 

కానీ కేవీ రావుకే 59 శాతం వాటా ఉంది. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటి­కీ కేవీరావుకే ఉంది. అందుకే ఆయనే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌ ఎండీగా కొనసాగుతున్నారు. సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement