బెదిరించి పోర్టును లాక్కునే ఎత్తులు
అందులో భాగంగానే సీజ్ ది షిప్ ఎపిసోడ్
పవన్ కళ్యాణ్‌ను సరిగా వాడుకోవడం ద్వారా కాకినాడ పోర్టును సైతం కబ్జా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నౌకలో బియ్యం విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి... నేను కనిపెట్టేశాను.. సీజ్ ది షిప్ అంటూ రీల్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నడిపిస్తున్న కథకు ఇరుసుగా మారారు.
ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... కూటమి నేతల అరాచకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకో అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఈ కాకినాడ పోర్టు అంశాన్ని అందుకున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.
అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమే
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు.
చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అరబిందో
ఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు చేయించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే సీఐడీ కేసు కూడా నమోదు చేసేసింది.
వాస్తవానికి కేవీ రావు 2020లో పోర్టులో తన 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు రూ. 494 కోట్లకు అమ్ముకున్నారు. అప్పట్లో ఆ అమ్మకం తనకు ఇష్టం లేనిపక్షంలో ఆనాడే అయన దాన్ని వ్యతిరేకించి అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కేవీ రావు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చారన్నది తెలుస్తోంది.
అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అరబిందో సంస్థ కెవిరావు నుంచి 41 శాతం వాటాలను కొనుగోలు చేసాక పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే మేలని భావించిన అరబిందో సంస్థ భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది.
పోర్టును కారుచౌకగా అమ్మేసింది చంద్రబాబే
వాస్తవానికి 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టారు. నిజం సుగర్స్ వంటి సంస్థలను అమ్మేసింది చంద్రబాబేనన్నది అందరికి తెలిసిందే. అదే క్రమంలో లాభాల్లో ఉన్న ఆ పోర్టును సైతం కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment