కృష్ణా పరీవాహకం మాదే
మేమే హక్కుదారులం: హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కృష్ణా పరీవాహకమంతా మా ప్రాంతంలోనే ఉంది. మేమే హక్కుదారులం. మా నీళ్లు మేం తీసుకోవడానికి ఆంధ్రా నాయకుల అనుమతులు ఎందుకు?’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని దుయ్యబట్టారు. పుట్టిన గడ్డకు, కన్నతల్లికే ద్రోహం చేయాలని చూస్తున్న ఇలాంటి నాయకులను తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. టీడీపీ నాయకులు ప్రాజెక్టులకు అడ్డం పడుతుంటే.. కాంగ్రెసోళ్లు భూ సేకరణ జరగకుండా రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ‘తెలంగాణ టీడీపీ నాయకులు ఆంధ్రాకు పోయి సప్పట్లు కొట్టించుకుంటుండ్రు. ఇక్కడ వాళ్లకు సప్పట్లు కొట్టేటోళ్లు ఎవలూ లేరు. ఎందుకంటే తెలంగాణలోని ఆరు మండలాలను ఆంధ్రలో కలపడం.. లోయర్ సీలేరు ప్రాజెక్టును దక్కకుండా చేసింది చంద్రబాబే. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంటు ఇవ్వకుండా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది ఆయనే’ అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.