కృష్ణానది లోపల కట్టిన అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లిరూరల్: రిజర్వ్ కన్జర్వేటివ్‌లో ఒక చిన్న మొక్క నాటాలన్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని, అలాంటిది టీడీపీ నేతలు ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేస్తూ కృష్ణానదీ తీరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉండవల్లి కరకట్ట వెంట కొత్తగా ఏర్పాటుచేసిన అక్రమ కట్టడాలను ఆర్కే సోమవారం పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఈఈతో ఫోన్‌లో అక్రమ కట్టడాలను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించగా, మొదట అక్రమ కట్టడాలను ఎక్కడా కట్టడం లేదంటూ ఆయన బదులిచ్చారు. ఎక్కడ కడుతున్నారో సర్వే నంబర్‌తో సహా ఆర్కే ఈఈకి తెలియజేయడంతో వాటిని తొలగించామని సమాధానమిచ్చారు. వెంటనే ఎమ్మెల్యే ఆర్కే ‘‘నేను సంఘటనా స్థలంలోనే ఉన్నాను’’ అని చెప్పగా ఈఈ మాట దాటవేసేందుకు ప్రయత్నం చేశారు.
అనంతరం ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నదీ తీర ప్రాంతాల్లో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పినప్పటికీ, టీడీపీకి తొత్తులుగా మారిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కరకట్ట వెంట నివాసం ఉంటున్నారని రైతులను పంట పొలాల్లోంచి ఉత్పత్తులను బయటకు కూడా తీసుకువెళ్లనీయకుండా ఆంక్షలు విధించారని, అయితే కరకట్ట నుంచి నదీ తీర ప్రాంతానికి వందల లారీల మట్టి తోలుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్, టీడీపీ నేత పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో తీరంలో ఈ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు స్థల యజమాని కోటేశ్వరరావు తెలిపారని ఆర్కే చెప్పారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను తొలగించకపోతే, కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని ఆర్కే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment