సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటిని కూల్చేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి. రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలో చేర్చుకుంటానని చంద్రబాబు చెబుతున్నాడు. స్థానిక సంస్థలకు ఆ సిద్ధాంతాలు వర్తించవా చంద్రబాబు?. ఎందుకు దొడ్డిదారిన వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలను లాక్కుంటున్నారు. కూటమి నేతలకు అధికార దాహం తీరలేదు. ప్రజల గొంతును వినిపించకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. మీకు బలం లేనప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు: మల్లాది విష్ణు
బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి కూటమి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలుపెట్టిన ప్రలోభాలను నేటికీ టీడీపీ కొనసాగిస్తోంది. బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశం ఇవ్వాలని.. భద్రత కల్పించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాం. పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మా కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు భద్రత లేకుండా పోయింది. కూటమి దుష్ట ఆలోచనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
భయపెట్టి దాడులు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది: అవినాష్
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు భయపెడుతున్నారు. భయపెట్టి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది. పార్టీ మారకపోతే రాత్రికి రాత్రి అభ్యర్థుల ఇళ్ల పై జేసీబీలతో దాడులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్స
అలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
రాజకీయ భిక్ష పెట్టిన నాయకులను కాదని కొందరు పార్టీలు మారుతున్నారు. అలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు. కూటమి ప్రభుత్వం భయపెట్టి.. ప్రలోభపెట్టి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. ఒక సింబల్ మీద గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం సరికాదు
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి: ఎమ్మెల్సీ,లేళ్ల అప్పిరెడ్డి
రేపు 10 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. సంఖ్యా పరంగా ఎక్కడా టీడీపీ గెలిచే అవకాశం లేదు. సంఖ్యాపరంగా బలం లేనప్పుడు ప్రలోభాలు పెట్టడం దేనికి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చింది. మీపార్టీ వైపు లొంగకపోతే ఇళ్లు కూలగొడతారా.. దాడులు చేస్తారా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే ఇదేనా చంద్రబాబు?. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి
మీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?: అంబటి రాంబాబు
తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాల పై ఎన్నికల కమిషన్‌ను కలిశాం. శేఖర్ రెడ్డిని మేం డిప్యూటీ మేయర్‌గా ప్రకటించాం. శేఖర్ రెడ్డిని కూటమి నేతలు బెదిరించారు. శేఖర్ రెడ్డి బిల్డింగ్‌ను దుర్మార్గంగా కూల్చేశారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు అనేక మార్లు చెప్పారు. కార్పొరేటర్ల విషయంలో మీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?. మా పార్టీలో గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికి విప్ జారీ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment