టీఆర్‌ఎస్ గాలివాటం పార్టీ
ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ కేవలం గాలివాటం పార్టీ అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీటీడీపీ మున్సిపల్, పట్టణ, గ్రామ, మండల స్థాయి సంస్థాగత ఎన్నికల అధికారులకు సోమవారం జరిగిన శిక్షణాతరగతుల్లో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు సంస్థాగత నిర్మాణం, బలం, వ్యవస్థా లేవని రమణ అన్నారు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయపబ్బం గడుపుకోవడం మినహా పరిపాలనపై పట్టులేదన్నారు. టీడీపీ హయాంలో మంత్రి పదవి రాకపోవడంతోనే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను పెట్టుకున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో అప్పులు రూ.60వేల కోట్ల నుంచి రూ.140వేల కోట్లకు పెరిగాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఇప్పటిదాకా 4 బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా దళితులకు, మైనారిటీలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకోసం నిధులను కేటాయించలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో మంత్రి హరీశ్‌రావు చచ్చినపాము వంటివాడని ఆరోపించారు. టీడీపీపై మాట్లాడేస్థాయి, అర్హత మంత్రి కేటీఆర్‌కు లేవన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందన్నారు.