టీ టీడీపీపై దుష్ర్పచారం మానుకోవాలి
భూసేకరణలో 2013 చట్టాన్ని అమలు చేయాలి: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందంటూ టీడీపీపై బురదజల్లడం మానుకోవాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్‌కు సూచించారు. తెలంగాణలో తక్షణం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సోమవారం రమణ విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ పేరుతో పేదల బతుకులతో ఆటలాడవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.
కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలోనే 2013 భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందన్నారు. ఈ చట్టం లేదంటే జీఓ 123లో ఏది కోరుకుంటే దాని ప్రకారం పరిహారం ఇస్తామనడం కేసీఆర్ ద్వంద్వ నీతిని చూపుతోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై రెండేళ్లు అయిన సందర్భంగా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీల పెంపును రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇచ్చారని రావుల ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే టీడీపీ వ్యతిరేకమని, ప్రాజెక్టులకు కాదన్నారు.