మల్లన్న ప్యాకేజీ నం.1
♦ ఇంతటి పరిహారం దేశంలో ఎక్కడా లేదు
♦ ప్రతిపక్షాల వాళ్లు బాగోతంగాళ్లు
♦ ఇయ్యాల వస్తరు.. రేపు పోతరు
♦ భూసేకరణ జరిగి తీరుతది
♦ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు
‘భూనిర్వాసితులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. అదే సమయంలో వాళ్లకి నష్టం జరగకుండా ప్రాజెక్టుల కోసం భూ సేకరణ తప్పదు. అదెలా అనేది రైతులే తేల్చుకోవాల’ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తేల్చి చెప్పారు. కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే భగీరథ ప్రయత్నం జరుగుతుందన్నారు. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దేశంలోనే నంబర్ వన్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కావాలనే ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారు.
వాళ్లు ఒక్కరోజు బాగోతంగాళ్లు.. ఇయ్యాల వస్తరు.. రేపు పోతరు.. అని మంత్రి మండిపడ్డారు. బుధవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం నుంచి బయలు దేరిన మంత్రి హరీశ్‌రావు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు 400 పైగా కిలో మీటర్ల మేర ప్రయాణించి మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు. మార్గమధ్యలో తన వాహనంలోనే ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డ్ఢి: ‘మొత్తానికైతే భూ సేకరణ తప్పదు. ప్రాజెక్టులను అడ్డుకోవాలనే దుగ్ధతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజలను రెచ్చ గొడుతున్నాయి. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఈ మధ్యన వచ్చి ధర్నా చేశారు. ఆయన్ను నేనేమి అడుగుతున్నానంటే.. అదే రాజీవ్ రహదారికి కుడి పక్కన ఆయన నియోజకవర్గమైన జనగామ ఉంది. పదేళ్లు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నరు. అక్కడ దేవాదుల ప్రాజెక్టు కట్టిండ్రు. 2004 నుంచి 2014 వరకు పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గమైన జనగామలో 3,073 ఎకరాలు సేకరించిండ్రు. 10 పేదళ్ల కాలంలో 204 అవార్డుల ద్వారా కొన్నాడు.
రైతుల వారీగా నా దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కింద భూనిర్వాసితులకు లక్ష్మయ్య ఇచ్చింది రూ. 80 వేల నుంచి రూ.1.30 లక్షలు మాత్రమే. ఆయను ఇప్పుడు ఇక్కడకొచ్చి రూ.30 లక్షలు ఇవ్వమంటోండు. ఇంటికో ఉద్యోగం ఇయ్యాలే అంటుండు. మరి నువ్వేందుకు ఇయ్యలేదు లక్ష్మయ్య గారు..?. ఇంటికో ఉద్యోగం ఇయ్యంగ నిన్నెవరన్న వద్దన్నరా..?. రూ.30 లక్షలు ఇయ్యంగ నిన్నెవరన్న వద్దన్నరా..?, రూ.3 లక్షలు ఇయ్యలేనోనివి రూ.30 లక్షలు ఇయ్యమని అడిగే హక్కు నీకు ఉందా?. అంటే వాళ్లకు ప్రాజెక్టు కావాలని కాదు. ప్రజలను రెచ్చగొట్టి కన్‌ఫ్యూజ్ చేయలే. ప్రాజెక్టులు కట్టకుండ అడ్డుకోవాలే. గిదే వాళ్ల ఆలోచన. పొన్నాల లక్ష్మయ్య రూ.30 అడిగిండు కాదా అని తెల్లారి సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం వచ్చిండు. లక్ష్మయ్య కంటే నేనేమన్న తక్కువా అని ఆయన రూ.40 లక్షలు అని పోయిండు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ బిడ్డలుగా ఆలోచించుకోవాలి..
‘మనం తెలంగాణ బిడ్డలుగాఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు మన ముందున్న పరిష్కారం నీళ్లు ఒక్కటే. లాభసాటి వ్యవసాయం కావాలంటే గోదావరి నీళ్లు తేవాల్సిందే. నీళ్లకోసం ప్రాజెక్టులు కట్టాలి. ప్రాజెక్టుల కోసం భూ సేకరణ తప్పదు. నేను వాళ్లకు 5 రకాల ప్రయోజనాలు చెప్పిన. వాస్తవానికి గ్రామ ప్రజాప్రతినిధులను, పెద్దలను పిలిపించి నేనే స్వయంగా మాట్లాడిన. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార్లను, స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని కలుపుకొని దాదాపు ఐదు గంటలు మాట్లాడిన. వాస్తవాలన్నీ వారికి చెప్పిన. 123 జీఓ తప్పని సరి కాదు. 123 జీఓ వద్దంటే 2013 చట్టం ప్రకారం పరిహారమిస్తామని చెప్పినం. అంతిమ నిర్ణయం రైతులదే అని చాలా స్పష్టంగా చెప్పాం’ అని హరీశ్ వెల్లడించారు.
మాకున్న ప్రేమ వారికుందా..?
‘నిజంగా చెప్పాలంటే... నాకు, ఎమ్మెల్యే, సీఎంకున్న ప్రేమ ఈ వచ్చిపోయే నాయకులకు ఉంటదా..?. వాళ్లది రాజకీయ ఆరాటం.. మాది పేగు బంధం.. బతుకు సంబంధం. ఒక్కరోజు బాగోతంగాళ్లు వాళ్లు. ఇయ్యాల వస్తరు, రేపు పోతరు. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో టెంటు వేస్తే వీళ్లు వచ్చి ఒకటే రెచ్చగొట్టుడు. 120 రోజుల తరువాత జరిగింది ఏందీ?. మళ్లీ నా వాళ్ల దగ్గరకు నేనే పోయిన. అన్ని విషయాలు చెప్పి ఒప్పించిన. ముందుగా ఈ రాజకీయ పార్టీలు వచ్చి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి’ అని మంత్రి అన్నారు.
ఇదే మంచి ప్యాకేజీ...
‘ముంపు బాధితులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఆలోచన. వాళ్ల బాధలను ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటది. వాళ్లను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఇస్తున్న ప్యాకేజీ దేశంలోనే నెంబర్ వన్. ఎకరానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే భూమిలో బోరు, బావి, చెట్లుచేమ, పైపు లైన్లు ఇలా ఏమి ఉంటే వాటికి కూడా అదనంగా పరిహారం కట్టిస్తున్నాం. ఈ లెక్కన చూసుకుంటే సగటున ఎకరానికి రూ.7.5 నుంచి రూ.8 లక్షల చొప్పున నష్టపరిహారం వస్తుంది. ఈ డబ్బు కూడా 15 రోజుల్లో వాళ్ల చేతుల్లో పెడుతున్నాం. గతంలో భూ నిర్వాసితులు కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగే వాళ్లు. తండ్రి చనిపోతే కొడుకులు డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరిగిండ్రు. అలాంటి ఇబ్బందు రావొద్దని జీఓ 123 తీసుకొచ్చినం. ఇది మ్యూచివల్ కాన్‌సెంట్ అవార్డు. రైతు ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది. 2013 భూసేకరణ చట్టం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.
రిజర్వాయర్ మీద ఆదాయం వారికే...
‘ ముంపునకు గురవుతున్న గ్రామాలకు మత్స్యకార సొ సైటీ ఒకటి ఏర్పాటు చే స్తాం. రిజర్వాయర్‌లో చేపల మీద వచ్చే ఆదా యం పూర్తిగా ఆ కుటుంబాలకే దక్కేలా చట్టం చేస్తామని చెప్పాం. 50 టీఎంసీల నీళ్లు అంటే ఏడాదికి రూ. కోట్లాది విలువైన మత్స్య సంపద వస్తుంది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఒక అడుగు ముందుకేసి ప్రత్యేకంగా వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూం ఇళ్ల విలువను వారికి చెల్లించే విధంగా సహకారం అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాల్లో దాదాపు 50 శాతం పథకాలను ముంపు గ్రామాల కుటుంబాలకే ఇస్తామని హామీ ఇచ్చాం’ మంత్రి చెప్పారు.