కాంగ్రెస్, టీడీపీలకు జలసమాధి తప్పదు | hareesh rao fires on tdp ,congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలకు జలసమాధి తప్పదు

Published Sun, Apr 3 2016 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీలకు జలసమాధి తప్పదు - Sakshi

కాంగ్రెస్, టీడీపీలకు జలసమాధి తప్పదు

ప్రాజెక్టులు పూర్తయితే ఆ పార్టీలకు భవిష్యత్తు ఉండదు
ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం
కోటి ఎకరాలకు నీరివ్వడం వారికిష్టం లేదా?
సభనుంచి పారిపోయిన ఘనత వారిది
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న  ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్, టీడీపీ నేతల రాజకీయ భవిష్య త్తు జల సమాధి కాకతప్పదని రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమకు భవిష్యత్తు లేదనే భయంతోనే కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క నిరాశ, నిస్పృహలతో కూడిన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీటి రంగంపై కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ప్రశంసించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ను ఆయన మెచ్చుకున్నారన్నారు. వాస్తవాలు ఇలావుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం దిగజారుడు రాజకీయాలకు దిగడం బాధాకరమన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కు 1,330 టీఎంసీల నీటి వాడకానికి హక్కు ఉన్నా కేవలం 300 టీఎంసీలే వాడినట్లు చెప్పారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ ద్వారా ప్రాణహిత నీటి లభ్యత తక్కువగా ఉంటుందని సీఎన్‌సీ స్పష్టం చేసిందన్నారు. రీడిజైనింగ్‌తో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రాణహిత, గోదావరి, ఇంద్రావతి వంటి వాటితోపాటే 48 వాగులు, వంకల ద్వారా నీటి లభ్యత కలుగుతుందన్నారు.

అందుకే అక్కడ బ్యారేజీ నిర్మించాలనుకోవడం తప్పా? అని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి వద్ద 13 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా అదే ప్రభుత్వ ప్రతిపాదిత మేడిగడ్డ వద్ద 200 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు. ఏడేళ్లు కేంద్రంలో, మహారాష్ర్ట, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఒప్పందాలపై ముందడుగు వేయలేక పోయిందో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కాలయాపన ద్వారా మోసం చేసిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

 కృష్ణా నీటి వాడకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించే జీఓను తెలంగాణ సర్కార్ రద్దు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలుపడం విడ్డూరంగా ఉందని మం త్రి హరీశ్ అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణానికి 11 ఏళ్లు అయిందని, వాటి మోటార్లు రెండు నెలలు కూడా సరిగ్గా పనిచేయడం లేదన్నారు. అలాంటి మోటార్లను 300 రోజులు పనిచేసేలా రీఇంజనీరింగ్ చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిలోని నీటి వాడకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియాలన్నారు. ఈపీసీ విధానాన్ని రద్దుచేసి ఆ శాఖను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, పాత పద్ధతే కొనసాగాలని దోపిడీ విధానానికి వత్తాసు పలకడం మంచిదికాదన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలోచించాలన్నారు. ప్రాజెక్ట్‌లపై కేసీఆర్ ప్రజెంటేషన్ నిర్వహించే సమయంలో ప్రతిపక్షాలు సభలో లేకపోవడాన్ని హరీశ్ విమర్శించారు. సభనుంచి పారిపోయిన ఘనత వారికే దక్కుతుందన్నారు.

 రెండు రోజులపాటు ప్రాజెక్టులపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నా.. సభలో ప్రశ్నించకుండా పారిపోయి ప్రెస్‌మీట్ల ద్వారా విమర్శలు చేయడం సరికాదన్నారు. వరంగల్, హైదరాబాద్‌తోపాటు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా.. కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదని, భవిష్యత్తులో ఆ పార్టీలకు ప్రతిపక్ష హోదాకూడా దక్కదని హరీశ్ జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement