మీ వల్లే ప్రాజెక్టులు ఆలస్యం
► కాంగ్రెస్, టీడీపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
► కుహనా మేధావులు వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు
► ఇక పది రోజులకోసారి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తా
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుపడకుండా ఉండి ఉంటే ఈపాటికే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులతో కలíసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలను, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన కొంత మంది నాయకులు ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. కోర్టులో కేసులు వేయడం.. భూ సేకరణ జరగకుండా అడ్డుకోవడంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారిని కొంత మంది కుహనా మేధావులు ఎందుకు నిలదీయడం లేదన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వేగవంతంగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు.
ఒక్క కల్వకుర్తికి గతేడాది రూ.650 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించామని మంత్రి గుర్తు చేశారు. ఇక పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తామన్నారు. ఇక పదిరోజులకు ఒకసారి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వస్తానన్నారు. డిండి ప్రాజెక్టుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఆ ప్రాజెక్టుకు వెళ్లేది కేవలం అర టీఎంసీ అని, పాలమూరు ప్రాజెక్టుకు రెండు టీఎంసీలని మంత్రి వివరించారు.