‘చర్చకు రాలేదు..రచ్చకు వచ్చారు’
- శాసనసభలో కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు మండిపాటు
- బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి
- కర్నాటకలో ఆరు గంటలే మేం తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తున్నాం
హైదరాబాద్‌సిటీ: శాసనసభలో కాంగ్రెస్ తీరుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. "మేం చర్చకు రాలేదు రచ్చకు వచ్చాం" అన్నట్టుగా కాంగ్రెస్ సభలో ప్రవర్తించిందని మంత్రి విమర్శించారు. మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ గా చేసిన మల్లు భట్టి విక్రమార్కకు అసెంబ్లీ నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు. స్పీకర్ మైక్ ఇస్తామన్న తీసుకోకుండా వారు తమ ఉద్దేశం ఏమిటో చాటారని అన్నారు. ఇప్పటికే సాగు నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ 38 కేసులు వేసిందని వివరించారు.
ఈ రోజు అసెంబ్లీ మండలి ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ కేసులు రద్దయితాయని కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. తాజా చట్టంతో భూములు కోల్పోయిన వారికి మంచి పరిహారం వస్తుందన్నారు. పోలెపల్లి సెజ్‌లో ఎకరానికి ఇచ్చిన పరిహారం 60 వేలు మాత్రమేనని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని కేంద్రంతో పోట్లాడి తెలంగాణాకు న్యాయం చేయాలని సూచించారు. దత్తాత్రేయ గురించి మాట్లాడుతూ నువ్వు మాట్లాడాల్సింది నిజామాబాద్‌లో కాదు ...ఢిల్లీలో మాట్లాడాలని కోరారు.
ముదిగొండలో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పాలన కాదా ? అని ప్రశ్నించారు. మీరు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పలేదా ? సూటిగా అడిగారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఆరు గంటల కరెంట్ ఇస్తున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు. ఏం చేసినా కాంగ్రెస్‌ను రైతులు నమ్మే పరిస్థితి లేదని, పారిశుధ్య కార్మికుడి నుంచి పారిశ్రామిక వేత్త దాకా అందరి బాగోగులు పట్టించుకుంటున్న ప్రభుత్వం మాది చెప్పుకొచ్చారు.