రూ.12 కోట్ల స్వాహాకు పక్కా స్కెచ్! | Revenue manipulation of records | Sakshi
Sakshi News home page

రూ.12 కోట్ల స్వాహాకు పక్కా స్కెచ్!

Published Tue, Jul 12 2016 2:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Revenue manipulation of records

లేని భూమికి దొడ్డిదారిన పరిహారం పొందేందుకు పన్నాగం
రెవెన్యూ రికార్డులు తారుమారు
అవినీతి బాగోతానికి తెలుగు తమ్ముళ్ల ప్రణాళిక
బయటపెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు
చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు

 

విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి నక్కపల్లి మండలంలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో దొడ్డిదారిన పరిహారం పొందేందుకు అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.    ప్రభుత్వం నుంచి  కోట్లాది రూపాయలు పరిహారం కాజేసేందుకు పన్నాగం పన్నారు. లేని భూమిని ఉన్నట్లు చూపించడం, ప్రభుత్వ భూమికి డీఫారం  పట్టాలు మంజూరు చేయనప్పటికీ మంజూరైనట్లు వెబ్  ల్యాండ్‌లో మార్పుచేయించి కోట్లాది రూపాయల పరిహారం స్వాహాచేసేందుకు ఎత్తుగడ వేశారు. వీరికి అధికారులు సహకరించారు. ఇలా రికార్డులు తారుమారు చేయడానికి   సుమారు రూ.10 లక్షలు చేతులు మారినట్లు    ఆరోపణలు వినిపిస్తున్నాయి.  చివరకు ఈ వ్యహరం బయటకు పొక్కింది. దీనిపై బహిరంగ  విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, నాయ  కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు  తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
 
 
నక్కపల్లి : సుమారు  రూ.12 కోట్ల  విలువైన భూములకు పరిహారం కాజేసేందుకు టీడీపీ నాయకులు పక్కా స్కెచ్ వేశారు.  అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఈ బాగోతానికి బ్రేక్ పడింది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం (వేంపాడు 2) రెవెన్యూ పరిధిలో సర్వేనెం 375 ఎకరాలు ప్రభుత్వ భూమి (కొండప్రాంతం) ఉంది.  ఇక్కడ సుమారు 242 ఎకరాలకు దివంగత నేత వైఎస్ హయంలో 2007లో  డీఫారం పట్టాలు ఇచ్చారు. మిగిలిన విస్తీర్ణం కొండ చివరన  ఉండటంతో పట్టాలు జారీచేయడానికి వీల్లేదని వదిలేశారు.
 భూ సేకరణకు నోటిఫికేషన్ : 2010లో ప్రభుత్వం పీసీపీఐఆర్ కోసం ఏపీఐఐసీ ద్వారా మండలంలో వేంపాడు, అమలాపురం, చందనాడ, రాజయ్యపేట, డీఎల్‌పురం, బుచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో ఐదు వేల ఎకరాలు భూమిని సేకరించేందుకు 4(1) నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ గ్రామాల్లో కొత్తగా ఎవరికీ ప్రభుత్వ భూములకు డీఫారం పట్టాలు ఇవ్వరాదని,  జిరాయితీ భూముల్లో లావేదేవీలు జరపరాదని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది.

2008 నుంచి మండలంలో కొత్తగా ఎవరికీ పట్టాలు మంజూరు చేయలేదు. ఇటీవల వీసీపీఐఆర్ భూసేకరణ ప్రక్రియ మళ్లీ వేగవంతం అయింది.  జిరాయితీ భూములకు ఎకరాకు రూ.18 లక్షలు, డీఫారం పట్టాలు కలిగిన వారికి, ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్నవారికి రూ.12 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మండలంలో చాలా మంది రైతులు తమ జిరాయితీ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.   డీఫారం రైతులు కూడా ఒప్పుకోవడంతో ప్రభుత్వం తొలుత డీఫారం భూములను సర్వే చేసి   లబ్ధిదారులను గుర్తించింది.

మిగులు భూమిపై టీడీపీ నేత కన్ను : ఈ నేపథ్యంలో సర్వే నెం 375లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిపై కొందరి కన్ను పడింది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కీలక పాత్ర పోషించి వీఆర్వో సహాయంతో సుమారు 39 మంది పేరున 53 ఎకరాలకు  రికార్డులు తారుమారు చేశారు. డీఫారం పట్టాలు ఇవ్వకుండానే  ఆన్‌లైన్ (1బి) వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించారు.  ప్రభుత్వం  ఈ భూములు కూడా సేకరిస్తే పరిహారం కింద రూ.6.70 కోట్లు స్వాహా చేసేందుకు పన్నాగం పన్నారు.  ఈ 375 సర్వే నెంబరును 375/1, 3లుగా సబ్‌డివిజన్ చేసినట్లు  రికార్డు తయారు చేశారు. వాస్తవంగా గతంలో ఇదే నెంబరులో 242 ఎకరాలు డీఫారం పట్టాలు ఇచ్చిన సందర్భంలోనే సబ్‌డివిజన్ చేయలేదు.  సబ్‌డివిజన్ చేయాలంటే సర్వే చేసి ఎంతమందికి పట్టాలు ఇచ్చారో  రికార్డు తయారుచేసి ఎఫ్‌ఎంబీల సహాయంతో అసైన్‌మెంట్ కమిటీ ఆమోదానికి పంపాలి. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఆర్డీవో అక్కడ నుంచి కలెక్టర్‌కు పంపి గుర్తించిన లబ్ధిదారులకు డీఫారం పట్టాలు మంజూరుచేసి పాసు పుస్తకాలు జారీ చేయాలి.  ఈ 53 ఎకరాల విషయంలో ఈ  ప్రక్రియ ఎక్కడా జరగలేదు.

నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ : మరో  విశేషమేమిటంటే 2016 జనవరి  నెల వరకు   నమోదు చేసిన అడంగల్‌లో  ఈ సర్వే నెంబర్లో మిగిలిన 53 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. 2016 మార్చిలో మాత్రం ఈ భూమికి సంబంధించి 39 మందికి పట్టాలు ఇచ్చినట్లు, వారు సాగుచేస్తున్నట్లు నమోదు చేయడం గమనార్హం. ఒక రైతు భూమిని ఆన్‌లైన్ చేసే సందర్భంలో ఆది జిరాయితీ భూమి అయితే ఎలా సంక్రమించింది, పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. డీఫారం పట్టా భూమి అయితే ఎప్పుడు ఇచ్చారు.  సబ్‌డివిజన్  చేశారా లేదా,  అసైన్‌మెంట్ కమిటీ,  ఆర్డీవో, కలెక్టర్ ఆమోదం పొందారా లేదా అనేది సమగ్రంగా పరిశీలించిన మీదట సదరు భూమిని రైతుపేరిట అన్‌లైన్‌లో మార్చాలి.  ఈ 53 ఎకరాల విషయంలో స్థానిక అధికారులు ఇవేమీ పరిశీలించకుండా ఆన్‌లైన్‌లో మార్పుచేసి 10328 నుంచి 10362 వరకు ఖాతా నెంబర్లు ఇచ్చి  1బీలు జారీ చేశారు. ఈ తతంగానికి మండల స్థాయి అధికారులు పూర్తిగా సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
సర్వే కోసం ఒత్తిడితో బాగోతం వెలుగులోకి..
 వీటి ఆధారంగా  రైతులు తమ భూములు సర్వే చేయాలని సర్వే సిబ్బందిపై ఒత్తిడి తేవడంతో ఈ బాగోతం వెలుగులోకి  వచ్చింది. ఈ భూములను పరిశీలించడానికి వెళ్లిన  సర్వే సిబ్బందికి కొండ ప్రాంతం పిచ్చిమొక్కలతో కనిపించింది. సాగుచేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. కొంతమంది మాత్రం అక్కడక్కడా తుప్పలు నరికి సాగుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని సర్వేయర్ మూర్తి తెలిపారు. ఇదే నాయకులు మరో అక్రమానికి పాల్పడ్డారు.

 ఇదే గ్రామంలో సర్వే నెం. 353లో సుమారు 8 ఎకరాల భూమికి ముగ్గురికి ( వి.సింహాచలంకు 2 ఎకరాలు,  శ్రీరామచంద్రరాజుకు 3.96 ఎకరాలు, కన్నంరాజుకు 2 ఎకరాల) డీఫారం పట్టాలు ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో మార్చారు.   సర్వేనెం 259 నుంచి 427 వరకు ఉన్న సుమారు 40 ఎకరాల భూమిని కూడా మరో 11 మంది  పేరున డీ  పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేశారు.  మొత్తం మీద సుమారు 98 ఎకరాలకు  రూ.12 కోట్లు పరిహారం కాజేందుకు ఎత్తుగడ వేశారు.
 
ఆధారాలతో సహా వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
ఈ విషయాలను తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు వీసం రామకృష్ణ,  సర్పంచ్ సూరాకాసుల గోవిందు, పారా జోగులు తదితరులు ఆధారాలతో సహా సోమవారం తహసీల్దార్ గంగాధర్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ బాగోతం వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన  వీఆర్వో ప్రమేయం ఉందని తెలిసింది.     ఈ బాగోతంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని  వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తహశీల్దార్‌ను కలిసిన వారిలో కోశెట్టి లోవరాజు, వంకా కృష్ణ, సత్తిబాబు, చిట్టమాని రాంబాబు, రాకాతి సత్తిబాబు తదితరులు ఉన్నారు.
 
విచారణ జరుపుతాం.. తహసీల్దార్
ఈ విషయమై తహసీల్దార్ గంగాధర్‌రావును వివరణ కోరగా పట్టాలు ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో నమోదుచేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి  కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తానన్నారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement