మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు టీటీడీపీ బృందం విన్నవించింది.
గవర్నర్‌కు టీటీడీపీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు టీటీడీపీ బృందం విన్నవించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎల్.రమణ, రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులూ ఈ కుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు.
మియాపూర్ భూములను పేదలు ఆక్రమించుకోవాలని, వారికి టీటీడీపీ అండగా ఉంటుందని రేవంత్ అన్నారు. కబ్జా భూములు ప్రభుత్వానివేనని బోర్డులెందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కుంభకోణంలో కీలక పాత్రధారులపై ఇప్పటికీ కేసులు నమోదుకాలేదని విమర్శించారు. పాత్రధారుల కుటుంబీకులతో ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, దీంతో ఆయన చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. కుంభకోణంపై సమీక్షించాలని గవర్నర్‌ను కోరామని.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టరును కలసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని రేవంత్ చెప్పారు.