- పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సవాల్
- మా పార్టీ వాళ్లకే మంత్రి పదవులిస్తున్నారు: ఎర్రబెల్లి, ఎల్. రమణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘తెలుగుదేశం పార్టీని చూస్తుంటే కేసీఆర్‌కు వణుకు పుడుతోంది. అందుకోసమే మంత్రి పదవులు ఎరవేసి మా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం జరిగిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకి నాయకులు కరువయ్యారని, అందుకోసమే టీడీపీ ప్రతినిధులను పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నాయకులు పోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదని, తెలుగుదేశం సంస్థాగతంగా బలమైన పార్టీ అని అన్నారు. ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా కొత్త నాయకులను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. తెలంగాణను, తమ హయాంలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. పార్టీ మారడం కాదు.. దమ్ముంటే గెలిచి చూపండి’ అని చంద్రబాబు సవాల్ విసిరారు.
రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన పార్టీని వదిలివెళ్లిన ఎమ్మెల్యేలకు పుట్టగతులుండవని విమర్శిం చారు. రెండు ప్రాంతాలూ తనకు సమానమేనని, కరెంట్, నీటి అంశాలపై చేర్చించేందుకు సిద్ధమేనన్నారు. కేసీఆర్‌కు తాను శిక్షణ ఇస్తే.. ఆయన నాకు క్లాసులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీడీపీ జెండాపై గెలిచిన వాళ్లు.. గులాబీ గూటికి వెళ్లి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బలమైన కార్యకర్తలున్న టీడీపీ మరింత బలపడడం ఖాయమన్నారు. పార్టీకి పూర్వవైభవం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారం తధ్యమని అన్నారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షనేత ఎర్రబెల్లి దరయాకర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలన్నారు. అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. టీడీపీ నేతలకు పదవుల పందేరం వేసి టీఆర్‌ఎస్ ప్రతినిధులకు కేసీఆర్ మొండిచెయ్యి చూపిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానంద, గాంధీ, మాధవరం కృష్ణారావు, సీనియర్ నాయకులు సుభాష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మారడం కాదు.. గెలవండి
Published Tue, Apr 28 2015 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM
Advertisement
Advertisement