ఎర్రబెల్లి జంప్ | tdp mla erraballi join to trs party | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి జంప్

Published Thu, Feb 11 2016 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఎర్రబెల్లి జంప్ - Sakshi

ఎర్రబెల్లి జంప్

గులాబీ గూటికి దయన్న
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ
టీఆర్‌ఎస్‌లో దయూకర్‌రావుకు ప్రాధాన్యతపై చర్చలు

 
వరంగల్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. టీడీపీకి జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ విషయం ఆయన స్వయంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రకటించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ పార్టీని వీడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరుతారని 2014 ఎన్నికల ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఎం కె.చంద్రశేఖరరావును ఒకసారి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అప్పుడే ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమైందని చర్చ  జరిగింది. అరుుతే, టీడీపీలోనే కొనసాగుతానని దయాకర్‌రావు స్పష్టం చేయడంతో ఈ విషయం సద్దుమణిగింది. 2015లో టీడీపీ కొత్త కమిటీలను నియమించింది. అప్పటి వరకు టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న దయాకర్‌రావును ఆ పదవి నుంచి తప్పిం చారు. దీంతోపాటు వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎర్రబెల్లి ప్రత్యర్థి వర్గానికి చెందిన గండ్ర సత్యనారాయణను పార్టీ నియమించింది. రాష్ట్ర కమిటీలోనూ ఎర్రబెల్లి ప్రత్యర్థి వర్గం నేతలకు కీలక పదవులు దక్కాయి.

ఈ పరిణామాలతో ఎర్రబెల్లికి టీడీపీలో ప్రాధాన్యం తగ్గింది. అంతేకాకుండా వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ దయాకర్‌రావుకు పార్టీ ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దయూకర్‌రావు టీడీపీని వీడడంతో జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయూకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత నవంబర్‌లో ధర్మారెడ్డి, తాజాగా ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఫలితంగా టీడీపీ వర్గాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
 
టీడీపీ ఆవిర్భావం నుంచి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎర్రబెల్లి రాజకీయ ప్రయా ణం మొదలైంది. 1983లో టీడీపీ హవాలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దశాబ్దం త ర్వాత టీడీపీ అనుకూల పరిస్థితి ఉన్న 1994లో ఇదే నియోజ కవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999, 2004 లో అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజ యం పాలైనప్పటికీ ఎర్రబెల్లి గెలుపొందడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడంతో తెలంగాణ టీడీపీ నేతల్లో ముఖ్య నేతగా ఎర్రబెల్లి గుర్తింపు పొం దారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వర్ధన్నపేట ఎస్సీకి రిజర్వు అరుుంది. దీంతో 2009లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. తెలంగాణ ప్రాంత కీలక నేతలు పార్టీని వదిలివేయడంతో ఇప్పుడు టీటీడీపీ ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రకటన తర్వాత టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, 2014 ఎన్నికల తర్వాత టీడీపీ శాసనసభాపక్ష నేతగా నియమితులయ్యారు. 33 ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగిన దయూకర్‌రావు ఇప్పుడు టీడీపీని వీడారు.
 
టీడీపీకి స్థానం లేదు
తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న విధానాలను నచ్చి చాలా మంది నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. టీఆర్‌ఎస్ విధానాలకు అనుగుణంగా పని చేసే వారందరితో కలిసిపోతాం. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు చెబుతున్నారు. దీన్ని గుర్తించే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నా.
 - తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
 
టీడీపీలో ఎర్రబెల్లి ప్రస్థానం ఇదీ..
1983లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు వర్ధన్నపేట నుంచి గెలిచారు.
1999లో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
2008 ఉప ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలుపొందారు.
2009లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
పోటీచేసి విజయం సాధించారు.
టీటీడీపీ ఫోరం కన్వీనర్‌గా, పార్టీ తెలంగాణ వర్కింగ్
{పెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2014 ఎన్నికల తర్వాత టీడీపీ శాసనసభాపక్ష నేతగా
నియమితులై ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement