కేసీఆర్కు అమ్ముడుపోయే చరిత్రా ఉంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు రాజకీయ నేతలను కొంటున్నారని మండిపడ్డారు. మంత్రుల పేషీలు బ్రోకర్ కార్యలయాలుగా తయారయ్యాయని ధ్వజమెత్తారు. కేసీఆర్కు కొనే చరిత్రతో పాటు, అమ్ముడుపోయే చరిత్ర కూడా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని ఎర్రబెల్లి హితవు పలికారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ...వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అభ్యర్థులను కేసీఆర్ కొనుగోలు చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నవి కావని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. 16 నెలలుగా టీఆర్ఎస్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాలు కలలుగానే మిగిలిపోతున్నాయని, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. కాగా రంగారెడ్డి, మహబూబ్నగర్లో పోటీ పెడుతున్నామన్నారు. విజయరామారావు పార్టీలోనే ఉంటారని ఆయన అన్నారు.