
కోఠి డీఎంహెచ్‌ఎస్ వద్ద ధర్నా చేస్తున్న ఎల్.రమణను అరెస్టు చేస్తున్న పోలీసులు
• ప్రభుత్వ తీరుపై టీటీడీపీ ధర్నా
• 51 మంది అరెస్ట్.. ఉద్రిక్తత
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో కల్తీ మందులు, సెలైన్లతో పాటు డెంగ్యూ, స్వైన్‌ప్లూ ప్రబలి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టకుండా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విడ్డూరమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతూ టీటీడీపీ మహిళా విభాగం, వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కోఠిలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ ముట్టడి చేపట్టారు. డీఎంఅండ్‌హెచ్‌ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఎల్. రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూన వెంకటేశ్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్, సారంగపాణి, మహిళ విభాగం అధ్యక్షురాలు శోభారాణితో పాటు పెద్ద ఎత్తున టీ డీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలతో కోఠిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘట్ పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు 51 మందిని అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించి.. సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం ఎల్.రమణ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే పేదల చావులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. నిలోఫర్ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు చనిపోయారన్నారు. గాంధీ ఆసుపత్రిలో చిన్నారికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడంతో మృత్యువు కబలించిందని ఆవేదన వ్యక్తం చేశారు.