మాకు పొత్తులు కలిసొస్తాయి
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఎన్నికల్లో టీడీపీ భావసారూప్యత గల పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో తలబడుతుంది. 1983 ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌తో కలిసి పోటీచేశాం. 1984లో ఎన్టీఆర్‌ను గద్దెదించిన తర్వాత జరిగిన ఉద్యమంలో బీజేపీ కలసి వచ్చిం ది. 1985,1989,1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోరాడి విజయాలు అందుకున్నాం. ఇప్పుడు కూడా బీజేపీతో కలసి తెలంగాణలో అధికారంలోకి వస్తాం’ అని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం వల్ల దేశానికి మంచి జరుగుతుందని, ఎన్‌డీఏ ప్రభుత్వంలో సెక్యులరిజం పరిరక్షణకు టీడీపీ వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందని అన్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ శనివారం మీట్ ది మీడియా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎల్.రమణతో పాటు ఇటీవల టీడీపీలో చేరిన బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మోడీ ఆహ్వానం మేరకే టీడీపీ పొత్తులకు తెరలేపిందని రమణ చెప్పారు. 2002లో గోద్రా సంఘటనను దేశమంతా ఖండించిందని, చంద్రబాబు కూడా అదే రీతిన స్పందించారని తెలిపారు.