బీసీనేత ఆర్.కృష్ణయ్యపై దాడి
* నామినేషన్ వేసేందుకు వెళుతుండగా టీడీపీకే చెందిన కొందరు కార్యకర్తల దాడి
* కారు అద్దాలు ధ్వంసం... సురక్షితంగా బయటపడ్డ బీసీ నేత
* ఎల్‌బీనగర్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళుతున్న బీసీ నేత ఆర్.కృష్ణయ్యపై దాడి జరిగింది. బుధవారం ఆయన ఎల్‌బీనగర్ సర్కిల్ కార్యాలయానికి కారులో వస్తుండగా స్థానిక టీడీపీ నాయకుడు సామ రంగారెడ్డి అనుచరులు .. కృష్ణయ్య గో బ్యాక్ అంటూ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో కారుపై దాడిచేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కృష్ణయ్య సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
తర్వాత కృష్ణయ్యకు రక్షణగా ఉండి సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. నామినేషన్ సందర్భంగా కొంత మంది తనపై దాడికి ప్రయత్నించారని, ఇది మొత్తం బీసీలపై జరిగిన దాడిగా చూస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. కృష్ణయ్య కారుపై దాడి సంఘటనమీద ఆయన అనుచరుడు శ్రీనివాస్‌గౌడ్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణయ్య నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకే టీడీపీ నాయకుడు సామరంగారెడ్డి అనుచరులు కొందరు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ నవీన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కృష్ణయ్యపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు జె.శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు జి.కృష్ణ, మల్లేష్, రామ్మూర్తి అన్నారు.
మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే : కృష్ణయ్య
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన టీడీపీ అభ్యర్థిగా ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత కొంత కాలంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో టీడీపీని నమ్ముకుని కొంత మంది పనిచేశారని, తన పట్ల కొంత అసంతృప్తి ఉన్నా రెండు మూడు రోజుల్లో సద్దుమనుగుతుందని తెలిపారు.