బీసీ డిక్లరేషన్ వంచనపై నోరు విప్పని టీడీపీ నేతలు
* బ్రహ్మాండంగా చేశామని ఆర్.కృష్ణయ్యతో చెప్పించిన వైనం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రధాన అంశాలను అమలు చేయకుండా సదరు వర్గాలను వంచించడంపై ఏదో చెప్పబోయి మరేదో చెబుతూ ఆ పార్టీ నాయకత్వం నీళ్లు నమిలింది. ఈ అంశంలో ఎదురైన విమర్శలపై పెదవి విప్పి వివరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా పార్టీలో చేరిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్..కృష్ణయ్యతో బీసీల ప్రయోజనాల కోసం టీడీపీ బ్రహ్మాండంగా పని చేసిందని చెప్పించి మమ అనిపించారు.
శుక్రవారం సాక్షి పత్రికలో ‘బీసీలకు బురిడీ’ శీర్షికతో ప్రచురితమైన వార్తపై టీడీపీ నేతలు భుజాలు తడుముకున్నారు. ఆర్.కృష్ణయ్య మినహా మరెవరూ దీనిపై నోరు విప్పలేదు. 2012 జూలై 9న చంద్రబాబు పార్టీ పరంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఆ హామీని చంద్రబాబు నిలుపుకోలేదు. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 40, తెలంగాణలో 18 సీట్లను మాత్రమే వారికి కేటాయించి చేతులు దులుపుకున్నారు.
ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని తెలంగాణలో సీఎం చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన గెలుపునకు చంద్రబాబు సహా పార్టీ నేత లెవరూ మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. దీనిపై పార్టీలో, ఇంటా, బైటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉలిక్కిపడ్డ పార్టీ నేతలు తాము స్పందిస్తే ప్రతికూలత వ్యక్తం అవుతుందని వెనుకంజ వేశారు. పార్టీలో ఆర్. కృష్ణయ్యకు జరిగిన అన్యాయంపై బీసీ సంఘాలు కూడా రుసరుసలాడుతుండటం, బీసీలకు వంద సీట్లు కేటాయించకపోవటంపై ఆగ్రహంగా ఉండటంతో ఈ అంశాన్ని సమర్ధించే ప్రయత్నం చే యలేకపోయారు. కృష్ణయ్యతోనే సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు.
మరోవైపు కృష్ణయ్యకు కేటాయించిన ఎల్బీనగర్ నియోజకర్గం పరిధిలోని ఎనిమిది కార్పొరేటర్ పదవుల్లో ఏడింటిని టీడీపీ గెలుచుకుంది. అయితే వారందరూ కృష్ణయ్య గెలుపునకు ఎం దుకు కృషి చేయలేకపోయారు?, ఆయనకు సీటు కేటాయించిన తరువాత పలువురు ముఖ్య నేతలు ఎందుకు పార్టీని వీడిపోయారో వివరించలేకపోయారు. ఇలావుండగా బీసీలకు ఎన్నికల్లో సీట్లు ముఖ్యం కాదని కృష్ణయ్య అన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు ఒక్కసారి లభిస్తే బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.