
వలసవాదులతో నిండిన టీఆర్‌ఎస్
టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇతర పార్టీల నుంచి చేరిన వలసవాదులతోనే నిండిపోయిం దని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార పార్టీకి అభ్యర్థులు లేక టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి అప్రజాస్వామికంగా వలసలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం తో టీఆర్‌ఎస్ కుమ్మక్కైందని, ఇరు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం డివిజన్ల స్వరూపాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్నారన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అధికారమే పరమావధిగా రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు.
పాతబస్తీని ఓవైసీ కుటుంబం, కొత్త పట్నాన్ని కేసీఆర్ కటుంబం పంచుకొన్నాయన్నారు. టీఆర్‌ఎస్ నేతలు జీహెచ్‌ఎంసీ నిధులను దారి మళ్లిస్తున్నారని, మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం అంటున్నా హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి ఏమిటో కేటాయించిన నిధులెన్నో చెప్పాలన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చినట్టు, వాటి ముందు ముగ్గులేసినట్టు రంగుల కలలను అరచేతిలో టీఆర్‌ఎస్ నేతలు చూపిస్తున్నారన్నారు.
స్కైవేల ప్రచారం తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్ కంటే తమ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని, 100 సీట్ల లక్ష్యంతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ డిజిటైజేషన్‌ను పూర్తిచేసి స్మార్ట్ సిటీగా చేస్తే అవినీతి లేని నగరం అవుతుందన్నారు.
సోనియాపై కేసు ఎందుకు పెట్టలేదు..
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఎందుకు పరామర్శించలేదన్నారు. ఆత్మహత్యలపై కేసులు సూసైడ్‌నోట్ చుట్టూ తిరుగుతాయని, రోహిత్ విషయంలోనే కొత్త సంప్రదాయాన్ని అనుసురిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రోహిత్ లేఖలో కేంద్రం, దత్తాత్రేయ, బీజేపీ ప్రస్తావన లేదన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ ఉత్తరంపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే వాస్తవాలు తేలిపోతాయన్నారు. ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమర్‌నాథ్, ఐజేయూ నేతలు నరేందర్‌రెడ్డి, కె.విరాహత్ అలీ, యాదగిరి, కోటిరెడ్డి పాల్గొన్నారు.