సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ తదితరులు బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అంశంపై చర్చించారు. పార్లమెంటరీ సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన నేతలు వ్యహరించిన తీరును గుర్తు చేశారు. ఒకపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోపార్టీలో చేరినట్లు అన్ని సాక్ష్యాలు అందజేసినా వారిని సభ్యులుగా కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రిగా కొనసాగుతూ తన రాజీనామాను స్పీకర్ పంపానని, ఆయనే దాన్ని ఆమోదించడం లేదని స్పీకర్‌పై నెపాన్ని నెట్టేస్తున్నారని వివరించారు.
ప్రజాస్వామ్యం, పార్టమెంటరీ వ్యవస్థను ఖూనీ చేస్తున్న టీఆర్‌ఎస్: ఎర్రబెల్లి
అధికార టీ ఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తుందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు స్పీకర్, గవర్నర్‌లను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మాట్లాడితే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లే కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాజీనామాలు చేయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు.
గతంలో ఇదే హోదాలో పనిచేసిన కేసీఆర్ గానీ, భట్టి విక్రమార్క మొదలైన వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారని గుర్తు చేశారు. టీడీఎల్‌పీ ఉపనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఇక్కడి సౌకర్యాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు. గతంలో జయాబచ్చన్, సోనియాగాంధీ వంటి వారు వేరే హోదాల్లో ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ ఎవరూ టీడీపీలో చేరలేద ని, ఎస్‌పీవై రెడ్డి, బుట్టా రేణుక ఒకసారి చంద్రబాబును కలిసినా, ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలుగానే కొనసాగుతున్నారని తెలిపారు.
'సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'
Published Wed, Apr 29 2015 9:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement