S madhusudhana chary
-
ప్రజా సేవ కోసమే పదవి కోరుతున్నా..
సాక్షి, భూపాలపల్లి అర్బన్: గతంలో పనిచేసిన కొందరూ నాయకులు ప్రజా సమస్యలు విస్మరించి వారి పనులు, వ్యాపారాలు చేసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు.. నాకు అటువంటి ఆలోచన లేదు.. కేవలం ప్రజల సమస్యలను పరిష్కరించడానికే పదవి కావాలని కోరుకుటున్నానని టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ గతంలో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించాడని, ఆయన చేయని అక్రమ దందా లేదన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవడానికే ముప్పతిప్పలు పడ్డ ఆ నాయకుడు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి.. వారి కోసమే నేను పనిచేస్తున్నాను అని స్పీకర్ చెప్పారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా ఇబ్బందులు పడుతూ పల్లె నిద్రలు చేసి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించానని అన్నారు. హమీ మేరకు భూపాలపల్లి జిల్లా చేశాను, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచానని తెలిపారు. మరో సారి అవకాశం కల్పిస్తే ఎంజీఎం తరహాలో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తానని, గణపురాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మరుస్తానని హామీ ఇచ్చారు. -
పేరుకి తగ్గట్టే బంగారుకొండ
రాజకీయ వాసన కూడా పట్టని కుటుంబం నుంచి వచ్చి, సీటీ బస్పు కిటికీలోంచి అసెంబ్లీని చూసిన వ్యక్తి అదే అసెంబ్లీలో అదికూడా తెలంగాణ తొలి స్పీకర్ అవుతాడని ఊహించి ఉండరు సిరికొండ మధుసూధనాచారి. సమాజమే దేవాలయం పేద మానవుడే దేవుడు అన్న ఎన్టీఆర్ నినాదం నచ్చి మొదటిసారి తెలుగుదేశం ద్వారా వెలుగులోకి వచ్చారు. హిందీ, ఉర్దూ భాషల్లో మాట్లాడగల సిరికొండ రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేసీఆర్ బాటలోనే పయనించాడు. స్పీకర్ గా మొదట్లో తడబడ్డా చివరకు తొలితెలంగాణ సభాపతిగా రాణించారు. చిన్నప్పుడు గోలీలు, కర్రాబిల్లా, కబడ్డీ... ఇలా కనబడ్డ ఆటలన్నీ ఆడూతూ, మార్కులు తక్కువ వస్తే నాన్నచేతి కంసాలి గొట్టంతో దెబ్బలు తిని పెరిగిన మనిషి. సొంత ఊరిలో అమ్మనాన్నల విగ్రహాలు స్థాపించి వారిపై గల ప్రేమను తెలిపిన కూమారుడు. అంతే కాకుండా 3 ఎకరాల మేర వారి పేరుతో హరితహారంను ఏర్పాటు. ప్రతి చెట్టుకీ ఒక పేరు. కుటుంబం సభ్యుల మెత్తం 91 మంది ఫ్లెక్సీలు. తరానికి ఒక శిలా ఫలకాలు... ఏడాదికొకసారి కుటుంబంతో హరితహారం సందర్శించే సాధారణ జీవితం గడిపే వ్యక్తి. చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో తండ్రికి ఉన్న గ్రామాల్లో మంచి పేరుని చెడగొట్టకుండా ఉండాలని తనవంత కొన్ని ప్రయత్నాలు చేసిన సిరికొండ. 1970 ప్రాంతంలోనే మానాన్న పెద్ద ఆర్థికవేత్తని, అప్పట్లో రోజు వారి ఖర్చు 10 అయితే 12 సంపాదించే వరకు అన్నం తినడని గొప్పగా చెప్పుకునేవారని, 1980 కాలంలోనే 5 మందిని చదివించాడు అంటే మా నాన్న చాలా గొప్పవారని సిరికొండ తన తండ్రి గురించి చెప్పుకుంటుంటారు. పేరు : సిరికొండ మధుసూధనాచారి తల్లిదండ్రులు : వెంకటలక్ష్మీ, వెంకటనర్సయ్య పుట్టిన తేదీ : సెప్టెంబర్ 26, 1956 ఊరు : వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామం నేపథ్యం : విశ్వ బ్రాహ్మాణ, కుంటుంబం, 4 అన్నదమ్ముళ్లు, 4 అక్కచెల్లెళ్లు కుటుంబం : ఇంటర్ మీడియట్ చదివేటప్పుడే బంధువుల అమ్మాయి ఉమాదేవితో పెళ్లి. సంతానం ముగ్గురు అబ్బాయిలు చదువు : ప్రాథమిక విద్య వరంగల్ ♦ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు, ♦ఎంఏ కాకతీయ యూనివర్పీటీలో, లా, పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు వృత్తి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి స్పీకర్ రాజకీయ జీవితం : ► 1982 లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ ప్రవేశం. తక్కువ సమయంలోనే పార్టీలో కీలకనేతగా ఎదిగారు. 1983లో కొంతకాలం టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు. ► 1985 - 89 వరకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ సభ్యుడు ►1988- 89లో ఫిలిం బోర్డు సెన్సార్ బోర్డు సభ్యుడు ► 1993 లో వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ► 1994 లో సాయంపేట ఎమ్మెల్యేగా గెలుపు ► 1996 లో అన్నా టీడీపీ పార్టీలో చేరిక ►1999 లో సాయంపేట బరిలో ఓటమి. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ► 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరిక ► 2002 లో పొలిట్ బ్యూరోలో సభ్యుడుగా, భూపాలపల్లి ఉద్యమ కమిటీ ఇన్‌చార్జీగా నియమితులవడం ► 2009 లో మహాకూటమి అభ్యర్థిగా భూపాలపల్లి ఎన్నికల్లో ఓటమి ►2014 భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ బీఫ్ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి పై విజయం సాధించారు. హాబీ : కవితలు రాయడం ఆసక్తి. 20 ఏళ్ల వయసు నుంచి కవితలు రాయడం మెదలుపెట్టారు. ఎన్టీఆర్, కేసీఆర్ పై కవితలు రాశారు. - దానవీరశూరకర్ణ సినిమా అంటే ఇష్టం - కొండి దీపిక -
'సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ తదితరులు బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అంశంపై చర్చించారు. పార్లమెంటరీ సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన నేతలు వ్యహరించిన తీరును గుర్తు చేశారు. ఒకపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోపార్టీలో చేరినట్లు అన్ని సాక్ష్యాలు అందజేసినా వారిని సభ్యులుగా కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రిగా కొనసాగుతూ తన రాజీనామాను స్పీకర్ పంపానని, ఆయనే దాన్ని ఆమోదించడం లేదని స్పీకర్‌పై నెపాన్ని నెట్టేస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్యం, పార్టమెంటరీ వ్యవస్థను ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్: ఎర్రబెల్లి అధికార టీ ఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు స్పీకర్, గవర్నర్లను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మాట్లాడితే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లే కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాజీనామాలు చేయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. గతంలో ఇదే హోదాలో పనిచేసిన కేసీఆర్ గానీ, భట్టి విక్రమార్క మొదలైన వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారని గుర్తు చేశారు. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఇక్కడి సౌకర్యాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు. గతంలో జయాబచ్చన్, సోనియాగాంధీ వంటి వారు వేరే హోదాల్లో ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ ఎవరూ టీడీపీలో చేరలేద ని, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక ఒకసారి చంద్రబాబును కలిసినా, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలుగానే కొనసాగుతున్నారని తెలిపారు.