సాక్షి,హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ఆయన మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లాలో ‘మన బస్తీ – మన బడి ’పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊరు –మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. వీటికి ఎస్టిమేషన్‌లను కూడా సిద్ధం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు..
- ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనేలా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
- వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈవోల పై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
- నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్‌లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తామన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
(చదవండి: అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!)
Comments
Please login to add a commentAdd a comment