మహాభారత యుద్ధాన్ని కోరకండి
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకున్న దశలో అడ్డుకోవడం రాజ్యాంగ ద్రోహమని గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ‘‘చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలేవీ ఉండవు. అలా కాకుండా మరో మహాభారత యుద్ధాన్ని మాత్రం కోరుకోవద్దు. మరో యుద్ధమే జరిగితే దుర్యోధనుడి తొడలు విరుగుతాయి’’ అని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో ఆదివారం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటాన్ని అన్యాయానికి, దోపిడీకి, అసమానతలకు వ్యతిరేకంగా సాగుతున్న విముక్తి పోరాటంగా అభివర్ణించారు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించకపోతే మున్ముం దు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
‘‘ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో సంపాదించుకున్న ఆస్తులను ప్రజలపరం చేసే దిశగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. లెక్కలన్నీ తేలాల్సిందే. నిజాం కాలం నాటి సర్ఫె ఖాస్ భూములు, 440 చెరువులు, కుంటలతో పాటు వక్ఫ్, దేవాలయ భూముల లెక్కలు వెలికితీయాలి. అయితే ఇది ప్రతీకార వాంఛ మాత్రం కాదు. పునర్నిర్మాణంలో భాగమంతే’’ అని తెలిపారు. తెలుగుజాతి, తెలుగుతల్లి అనే పదా లు ఎక్కడా లేవని, సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఎక్కడా ఈ తెలుగుజాతి ప్రస్తావన లేదని వివరించారు. తెలుగుదేశం, తెలుగునాడు అన్న మాటలు వాడారే తప్ప ఎక్కడా జాతి అని వాడలేదన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతం విడిపోతే దక్షిణ పాకిస్థాన్ అవుతుందని 1969 ఉద్యమంలో ఎవరో విమర్శించారు. తెలుగుతల్లి పిల్లలం అనే మాటలోనే ముసలం ఉందని కాళోజీ అప్పుడే హెచ్చరించారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న జాతి సమైక్యత, ప్రాదేశిక సమగ్రత అనే మాటల్లో జాతి అంటే భారతజాతి మాత్రమే. భారతదేశంలో ఉన్నవారంతా భారత పౌరులు. తెలుగు పౌరులూ, తమిళ పౌరులూ ఉండరు. భాషకో జాతి అన్న భావనే ప్రమాదకరమైనది. భాషాభిమానం దురభిమానంగా మారకూడదని సూచించారు.
తమిళ భాషాభిమానం వెర్రితలలు వేసి, ద్రవిడ ఉద్యమ కాలంలో తాము ఈ దేశంలోనే ఉండబోమనే వరకు వెళ్లింది. దేశ పౌరులు సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిందేనంటూ అప్పుడే ఏడో రాజ్యాంగ సవరణ వచ్చింది’’ అని గుర్తు చేశారు. తెలుగుజాతి అన్న పదం ఆధిపత్య భావజాలం నుంచి వచ్చిందని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రచయితలు సోక్రటీస్ వారసులని ప్రశంసించారు. తాము ప్రశ్నించడమేగాక, ప్రశ్నించే హక్కు మీకూ ఉందని ప్రజలకు నేర్పించారంటూ అభినందించారు. చివరివరకు దోపిడీని ప్రశ్నించిన కాళోజీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలి మెల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపీ, సూరెపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎన్.శేఖర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రవాస తెలంగాణ రచయితల సదస్సు జరిగింది. మైసూరు తెలుగు సమితి అధ్యక్షుడు సి.ఎన్.రెడ్డి అధ్యక్షత వహించారు. ముంబై, షోలాపూర్, భీవండి, సూరత్ నుంచి వచ్చిన రచయితలు పాల్గొన్నారు. 12 పుస్తకాలు, రెండు సీడీలను ఆవిష్కరించారు.