సమాజంలోని ఆలోచనాశీలికి తక్కెళ్ల జగ్గడు ప్రతీక. ‘మాలపల్లి’ నవలలోని పాత్ర అయితేనేమి, ఈ కాలాన కూడా అలాంటి ముక్కుసూటి మనిషి ఉండాలి. ఒక స్థానిక కోర్టులో ఏ మొహమాటమూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను ఏకరువు పెడతాడు. నిరుపేదలు మరింత నిరుపేదలు కావడానికి కారణాలను అప్పుడే విశ్లేషించాడు. అయినా సమాజం ఏమైనా మారిందా? వ్యవస్థ మెరుగు పడిందా? జగ్గడి నీతిని ఇప్పుడు వర్తింపజేసినా భూమి బద్దలవుతుందేమో అన్నట్టుగానే ఉంది మన ధోరణి. దాని కోసమైనా మరింతమంది జగ్గళ్లు కావాలి. వ్యవస్థను నిద్ర లేపాలి.
నేడు దేశంలో గానీ, పలు రాష్ట్రాలలో గానీ అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్న వారికి ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలో ‘తక్కెళ్ల జగ్గడు’ గుర్తుకొస్తాడు. ఒక స్థానిక కోర్టులో ఎలాంటి నదురూ బెదురూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను, పేదల దారుణాతి దారుణ పరిస్థితులను జగ్గడు ఏకరువు పెడతాడు. ధనవంతులు తాము ధనవంతులయింది తమ ప్రయోజకత్వం వల్ల కాదు. అందుకు ఎందరో పేదల శ్రమ దోపిడీయే కారణం. దాని ఫలితమే కోట్లాదిమంది నిరుపేదల వుతున్నారు. ఈ దోపిడీ ఏ రూపంలో, ఏ మిష పైన కొనసాగుతుందో కూడా జగ్గడు వందేళ్ళ నాడే సిద్ధాంతీకరించాడు! ‘‘కలియుగంలో రాక్షసులు లేరంటారు గానీ ధనికులే కలియుగ రాక్షసుల’’న్నాడు. ఎలా అన్న ప్రశ్నకు, అప్పటికే దోపిడీ సమాజ వ్యవస్థ అనుసరించే చిట్కాలు, మాయోపాయాలూ ఎలా ఉంటాయో వివరిస్తాడు.
‘‘భాగ్యవంతులు బీదల్ని దోచుకుంటే దానిపేరు వ్యవహారం, బీదలు తమ హక్కును తీసుకుంటే అది చౌర్యం. బీదల దగ్గర నుంచి మోసం చేసి కొంటే ఆకర్షించిన ధనాన్ని మరల బీదలు లాక్కుంటే మాత్రం అది ఎట్లా తప్పయిందో కోర్టువారు నిర్ధారణ చేయగోరు తున్నాను. ఇలాంటి అక్రమ చట్టాల వారస సంతానంగా వచ్చినవే బీదల నేరాలు. అంటే, భాగ్యవంతులకు ఉపయోగించే నేరం చట్ట సమ్మతమై, వారికి ఉపయోగించనిది నేరమా? అంటే భాగ్య వంతుల ప్రాణానికి విలువ ఎక్కువ! బీదవాని కంటే భాగ్యవంతుడి కుక్క గొప్పది కాబోలు. బీదలోడ్చిన చెమటా, రక్తమూ కరుడు కట్టి ధనికుని భాగ్యం అవుతుంది’’ అని చాటిన వాడు జగ్గడు!
తక్కెళ్ల జగ్గడి నీతిని వందేళ్ళ తర్వాత అయినా వర్తింపజేస్తే భూమి బద్దలవకుండా ఉంటుందా? బద్దలయ్యే దశలో ఉంది కాబట్టే, కనీసం గత నలభై ఏళ్ళుగా అనేక సాధికార విచారణ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిపిన సర్వే ఫలితాల దృష్ట్యా కూడా ఎవరిలోనూ జ్ఞానోదయం ఈ క్షణం దాకా కలగడం లేదు. కనుకనే జగ్గడి నీతి పాఠాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవలసి వస్తోంది! చివరికి ప్రతిపక్షాల్ని వేధించడానికి క్రమంగా 2024 నాటికల్లా ‘ఒక దేశం ఒకే ఎన్నిక’... ఆ ఒకే ఎన్నిక ద్వారా క్రమంగా ఏక వ్యక్తి పాలనకు మార్గాన్ని సుగమం చేయడం తిరుగులేని కర్తవ్యంగా పాలకులు నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే బహుశా ‘పెగసస్’ కూపీ ‘స్పైవేర్’ అవసరమైంది! ఇక్కడ విచిత్రమేమంటే ఇలాంటి ‘కూపీ’ పద్ధతులు, కూట రాజకీయాలు, కుట్ర కోణాలకు కేంద్ర పాలకుల కన్నా ముందు జాగ్రత్తల్లో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు!
వర్ధమాన దేశాలపై అమెరికా ఎక్కు పెట్టి ఉంచిన కుట్రలనూ, అనుసరిస్తున్న తప్పుడు విధానాలనూ ప్రాణాలకు తెగించి ఎండ గట్టినవాడు ఎడ్వర్డ్ స్నోడెన్! రెండేళ్ళ ముందే స్నోడెన్ అమెరికా ఎత్తుగడలను గమనించి అమెరికన్ పౌరులకే గాక, వర్ధమాన దేశాల ప్రభుత్వాలను ‘‘మీ డబ్బు, మీ జీవితాలు జాగ్రత్త’’ అని హెచ్చరిం చాడు. రానున్న రోజుల్లో కేంద్రీయ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలు ప్రజల భవిష్యత్తును ‘అతలాకుతలం’ చేస్తాయని ప్రకటించాడు.
ఈ పరిణామాల దృష్ట్యా ఇజ్రాయిల్ ‘పెగసస్’ స్పైవేర్ ద్వారా భారత ప్రతిపక్షాలపైనా, పలు సామాజిక కార్యకర్తల పైనా, పౌర హక్కుల నాయకుల పైనా జాతీయ స్థాయిలో కానరాని నిర్బంధ విధా నాలకు గురి చేయడాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఒకటికి రెండుసార్లు ప్రశ్నించాల్సి వచ్చింది. ‘కొరివితో తల గోక్కు’న్నట్టుగా ‘పెగసస్’ కుంభకోణం ద్వారా పశ్చిమాసియాలో ఆఫ్రికన్ల ప్రయోజనాలను దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్‌తో మనం జట్టు కట్టడం... భారతదేశం పట్ల ఆఫ్రికన్లలో వ్యతిరేక భావాలు ప్రబలడానికి చోటిచ్చినట్లయింది.
‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి కేవలం సాధారణ ‘ఫ్లూ’ లాంటిదనీ, దాని నివారణ పేరిట రకరకాల వ్యాక్సిన్ల ఎగుమతుల వ్యాపార లావాదేవీల్లో ఉన్న దాదాపు 40–80 మందుల కంపెనీల పట్టులో ఉన్న అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీల ప్రయోజనాల రక్షణకు అనుమతించడంతో ‘కోవిడ్–19’కు ఇంతవరకూ ఉపశమనం కలగక పోగా రోజుకొక తీరున కొత్త వేరియంట్లు తామరతంపరగా పుట్టుకు రావడం... ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీల ఉనికినే ప్రశ్నించే స్థితి ఏర్పడటం జరుగుతోంది. ఇందుకు బ్రెజిల్‌లో భారత ప్రభుత్వం అమ్మజూపిన స్థానిక ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీతో పాటు మన పాలకులు కూడా ఇరుక్కుపోవలసి వచ్చింది. ఇలా, మన దేశంలో ఇలాంటి పాలకులు ఎన్ని రకాలుగా 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో కూడా పుట్టుకొచ్చి మన మధ్య మసలు తున్నారంటే– ‘తక్కెళ్ల జగ్గడి’ బోధల అవసరం ఇక ముందు కూడా ఉంటుందనీ విశ్వసించవచ్చు!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment