‘ఢోకా’లేని ‘టీకా’ ఇదే అయితే..?! | ABK Prasad Article On Corona Virus Vaccine | Sakshi
Sakshi News home page

‘ఢోకా’లేని ‘టీకా’ ఇదే అయితే..?!

Published Tue, Jan 19 2021 12:19 AM | Last Updated on Tue, Jan 19 2021 3:21 AM

ABK Prasad Article On Corona Virus Vaccine - Sakshi

‘‘రానున్న 28 రోజులు కీలకం. ఎందు కంటే, ఇంకా అంకెకు రాని కరోనా హంతక క్రిమి వ్యాధి (వైరస్‌) నివారణకు మొదలైన కొత్త టీకాల (వ్యాక్సిన్లు) వల్ల వాటిని వేయించుకునే వారి శరీరంలో అనేక మార్పులు రావొచ్చు. అందుకే తొలి టీకావల్ల (కోవిషీల్డ్‌ లేదా కోవా గ్జిన్‌) నాలుగు రోజులపాటు ఈ ప్రయోగానికి గురైనవారు జాగ్రత్తగా ఉండాలి. మద్యం తీసు కోరాదు, బీడీలు, సిగరెట్లు తాగకూడదు. పోషకాహారం తప్పనిసరి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలనుబట్టి, టీకా వేయించుకున్న వారికి 12 రోజుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు వృద్ధి కావడం ప్రారంభమవుతుంది. రెండో డోసు ఇంజెక్షన్‌ తర్వాత రెండు వారాల్లో పూర్తి రక్షణ కలగొచ్చు. అయితే మొదటి డోసుతో వికటించి ఎలర్జీ వచ్చే పక్షంలో ఇక రెండో డోసు ప్రారంభించరు’’. – వైద్య, ఆరోగ్య శాఖల మార్గదర్శకాలు, పత్రికా వార్తలు 

అంటే ఈ కార్యక్రమం అంతా ఒక కొలిక్కి వచ్చి శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధకశక్తిని పెంచే యాంటీబాడీలు తయారు కావడా నికి పట్టే మొత్తం కాలపరిమితిని నిపుణులు 42 రోజులుగా పేర్కొంటు న్నారు. మనకు కేంద్ర పాలకులు ప్రతిఒక్కరూ కోవిడ్‌–19 (కరోనా) రాక్షసిని మట్టుపెట్టాలంటే వాడవలసిన టీకాలు, అధికారికంగా అను మతించిన వ్యాక్సిన్‌లు రెండింటిలో (కోవిషీల్డ్, కోవాగ్జిన్‌) ఏ కంపెనీది వాడాలి, ఏది వాడకూడదన్న వివక్షను కేంద్ర పాలకులు సూచించక పోవడంవల్ల టీకాల కోసం ఎదురుతెన్నులు కాస్తున్న ప్రజా బాహు ళ్యంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఫలితంగా కేంద్ర పాలకుల ప్రకటనల్ని నమ్ముకుని రంగంలో దిగాలనుకున్న రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో 3 లక్షలమందికి తొలి రోజు టీకాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య 2 లక్షలమందికి కుదించుకుపోయింది. ఆరోగ్య సంరక్షణ సేవలో అగ్రభాగాన ఉండే పెద్ద, చిన్న సిబ్బందికి ముందు ఈ రెండు వ్యాక్సిన్‌లలో ఏదో ఒకదాన్ని ఆసాంతం వాడాలిగానీ, మధ్యలో రెండో వ్యాక్సిన్‌ వాడరాదన్నది అధికారిక నిర్ణయం. 

కాగా, పూటకొక విరుద్ధమైన రకరకాల వార్తలు వెలువడుతున్న సమయంలో, టీకా తీసుకునే వారెవరూ ‘మద్యంగానీ, బీడీలు, సిగ రెట్లుగానీ ముట్టరాదన్న’ అధికారిక నిర్ణయానికి భిన్నంగా మన దేశం లోనే విస్తృత స్థాయిలో ‘భారత శాస్త్ర, పారిశ్రామిక మండలి’ సంస్థ 10,000 మంది ఉద్యోగులపై నిర్వహించిన తొలి సర్వేక్షణ ‘కోవిడ్‌–19’ ప్రభావంపై జరిపిన సర్వే ప్రకారం ఈ ఉద్యోగుల్లో 10 శాతం మంది కరోనా వైరస్‌ సోకిన వారే. అయితే శరీరంలో వైరస్‌ ప్రభావాన్ని ఎదు ర్కొని నిలబడగల రోగ నిరోధక శక్తి ఆ వ్యక్తుల్లో ఆరు నెలలకు పైగా గణనీయంగా నిలబడే ఉందని రుజువైంది. అయితే అలాంటి వ్యాధి గల ఉద్యోగుల్లో నిలదొక్కుకోవడానికి అసలు కారణం– వారు మందు ‘భాయీ’లు కావడం, పొగత్రాగేవారు కావడమేనని, ఈ రెండు లక్షణాలు వారికి ‘రక్షణ’గా నిలవడమే కారణంగా కనపడిందని ఆ సర్వే ధ్రువపరిచింది. పాన్‌–ఇండియా స్థాయిలో సాగిన ఈ సాధికార సర్వే ఫలితాలు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలకు సాధికారికంగానే నిర్వ హించి, ప్రకటించిన ప్రమాణాలకు (చుట్ట, బీడీ, సిగరెట్టు తాగరాదు) విరుద్ధంగా ఉండటం చూస్తే రోగ నిర్ధారణ ప్రమాణాలకే నిర్దిష్టమైన సాధికారత ఇంకా సిద్ధించలేదని రుజువవుతోంది. 

ఇదిలా ఉండగా, కరోనా తలెత్తి కాటువేయడం మొదలైన క్షణం నుంచి, వేలు, లక్షల సంఖ్యలో ప్రపంచవ్యాపితంగానే దేశాల ఎల్లలు దాటి మరీ మహాబీభత్సం సృష్టిస్తున్న సమయంలోనే.. పెట్టుబడిదారీ సమాజ వ్యవస్థల్లో చావుబతుకుల్లో ఉన్న రోగ పీడితులను మరింత పీడించుకు తినడానికి అనేక మందుల కంపెనీలు, బడాబడా ఔషధ కంపెనీలు వందలాదిగా రకరకాల ఔషధాలతో పోటీలు పడసాగాయి. అలాంటి పోటీల్లో భాగంగానే తమ ప్రయోగాలు ఇంకా సునిశితమై, నిగ్గు తేలకముందే ఇండియాపై కరోనా పేరిట ఈ కంపెనీలు రెక్కలు చాచుకుని వాలాయి.

ఈ లాభాల వేటలో భాగంగానే ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌తో విదేశీ కంపెనీ ఆస్ట్రా జెనెకా, భారతదేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌తో కలిసి రంగంలోకి దిగితే, ప్రాథమిక ప్రయోగ దశలన్నీ (మూడు దశలు) పూర్తి కాకుండానే పోటీ కోసం రంగంలోకి దిగిన భారత కంపెనీ– భారత బయోటెక్‌ రూపొందించిన అసంపూర్ణ ‘కోవా గ్జిన్‌’ టీకా. ఆ మాటకొస్తే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రయోగానికి మూలం విదేశీ కంపెనీయే. అది తయారు చేసిన ‘కోవిషీల్డ్‌’ ప్రయోగం తర్వాత ఆ ఇంజెక్షన్‌ తీసుకున్న వ్యక్తి ఒకరు కంపెనీపై రూ. 5 కోట్లకు నష్ట పరిహార దావా వేసిన సంగతి తెలిసిందే. ఇక భారత బయోటెక్‌ పూర్తిగా ‘దేశవాళీ’ సంస్థే కాబట్టి దాని ‘కోవాగ్జిన్‌’ టీకాను పూర్తిగా విశ్వసిద్దామా అంటే, అది మూడోదశ పరీక్షల్ని పక్కకునెట్టి మధ్యలోనే ‘లాభలబ్ధి’ సూత్రాన్ని నమ్ముకుని రంగంలోకి దిగింది. 

ఇక మన పాలకులంటారూ, ‘ఆత్మనిర్భర భారత్‌’ (స్వయం పోషక) ఆర్థిక వ్యవస్థ నిర్మాణం నినాదంతో ప్రారంభమై విదేశీ పెట్టుబడి సంస్థలన్నీ ‘వాస్కోడీగామాలై’ భారతదేశంలో వాలి, పరిశ్రమలు పెట్టమని తొలి అయిదేళ్ల పాలనలోనే ఆహ్వానించి, తివా చీలు పరిచారు. ఈ ధోరణిలోనే భారత బయోటెక్‌ (దేశీయ) మందుల కంపెనీకి పెద్దపీట వేసింది కేంద్రం. కాస్త ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిచూస్తే, ఒకప్పుడు ‘శాంతా బయోటెక్‌’ ఔషధ తయారీ సంస్థ కాలేయ (లివర్‌) వ్యాధి నివారణకు ‘హెపటైటిస్‌–29’ అనే వ్యాక్సిన్‌ను జయప్రదంగా ఆవిష్కరిస్తున్న ఘడియలలో దానిపై పోటీగా అదే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ప్రయత్నించి ‘భారత బయోటెక్‌’ విఫలమైన ఉదాహరణ మరవరానిది.

‘దేశవాళీ, దేశవాళీ’ అని మన కోసం ‘హోరెత్తే’ ప్రకటనలు గుప్పించే పాలకులు ప్రయోగ దశలు పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీని రంగంలోకి ఎందుకు, ఏ ప్రయోజనం ఆశించి దించారో తెలియదు. ఒకవేళ భారత బయోటెక్‌ దేశీయ కంపెనీయే అని ముచ్చటపడినా, విదేశీ కంపెనీలు ‘ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా’లు రూపొందించిన ‘కోవిషీల్డ్‌’కన్నా, ప్రయోగ దశను పూర్తి చేయడంలోనే విఫలమైన భారత బయోటెక్‌వారి ‘కోవాగ్జిన్‌’కు ఎక్కువ రేటు పెట్టడంలో పాలకుల ఆంతర్యం బోధపడకుండా ఉంది. పైగా, విదేశీ వ్యాక్సిన్‌ కంపెనీ ఆక్స్‌ఫర్డ్, తమ ‘కోవిషీల్డ్‌’ టీకా వేయిం చుకోదలచిన వారి నుంచి స్వచ్ఛందంగా అంగీకారపత్రాన్ని కోరలేదు. కానీ, ప్రయోగ దశలన్నీ పూర్తి చేయలేని భారత బయోటెక్‌ ‘కోవాగ్జిన్‌’ తీసుకునేవారు అందుకు విధిగా తమ ‘అంగీకార పత్రం’ రాసివ్వాలని పట్టుపట్టడంలో ఆంతర్యం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. ఈ సంద ర్భంగా ఒక బలమైన అనుమానం ‘టీకా’ వాడదలచుకున్న వారిలో వచ్చే అవకాశం ఉంది. 

ఈరోజు దాకా, ‘ఈ క్షణం దాకా విదేశాల నుంచి మన దేశం వరకూ ‘కరోనా’ వైరస్‌ రూపరూపాలు అనుక్షణం మార్చుకుంటున్న దశలో మారుతున్న రూపాలను ఇంకా అర్థం చేసుకొని వ్యవహరిం చాల్సిన సంక్షోభ దశలో మన శాస్త్రవేత్తలు, నిబంధనలను పాటించా ల్సిన అధికారులు చాలా జాగరూకులై మెలగాల్సి ఉంటుందని భారత మెడికల్‌ రీసెర్చి కౌన్సిల్‌లో అంటురోగాల శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్‌ సమీరన్‌ పాండే (16.1.2021) పదేపదే హెచ్చరించారు. అంతే గాదు, ఇన్‌ఫ్లూయెంజా రూపంలో ఉన్న వైరస్‌ క్రిమి తన జన్యు కణా లలోని ఒక జన్యువు స్థానంలో  రూపం మారిన మరొక జన్యువుకు స్థానమిస్తోంది. దీన్నే శాస్త్ర పరిభాషలో నాటకంలో మాదిరి దృశ్యాన్ని మార్చుకోవడం అంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ పద్ధతిలోనే పూర్తిగా భిన్నమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు ‘నేడు ప్రపంచమంతటా వ్యాపిస్తూ, భారీ స్థాయిలో వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయ’ని కూడా సమీరన్‌ పాండే మొత్తుకుంటున్నారు. బహుశా ఇకమీదట భవి ష్యత్తులో కరోనా వైరస్‌ అందరికీ సాధారణంగా ఎదురయ్యే జలుబు ‘సర్ది’ రూపంలో ఉండవచ్చునని శాస్త్ర విజ్ఞాన విశేషాలపై సాధికార పత్రిక ‘సైన్స్‌’ (జనవరి 13) తాజా సంచిక వెల్లడించింది.

అన్నింటికన్నా మించి ప్రస్తుత దశలో కరోనా నివారణకు వివిధ పరీక్షలు, ప్రయోగాలు నిర్వహిస్తున్న వేళ– మరొక అపవాదును లేదా విషమ పరిణామాన్ని పాలకులతో సహా మనమందరం మోయక తప్పదు. అదేమిటంటే.. వ్యాక్సిన్‌  ప్రయోగం సామర్థ్యాన్ని నిరూపిం చడం కోసం చేసిన తొలి ప్రయోగాలు మూడూ నిరుపేదలపైనే జరిగాయి. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు, మరొకరు సెక్యూరిటీ గార్డు. భోపాల్‌ గ్యాస్‌ కంపెనీలో జరిగిన ఘోరమైన ప్రమాదంలో చనిపోయినవారు చనిపోగా, గత 30 ఏళ్లుగా కోలుకోలేని స్థితిలో ఉన్న కొందరు క్షతగాత్రులపైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరపడం. ఇంత టితో ప్రస్తుత ‘డ్రామా’ ముగియలేదు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ విన్యాసం పూర్తయిన వెంటనే వ్యాక్సినేషన్‌ వివరాలకు చెందిన ‘డేటా’ను కాస్తా వెంటనే తొలగించేయాలని ప్రభుత్వానికి భారత ఎన్నికల కమిషన్‌ ఎందుకు సూచించవలసి వచ్చిందో (15.1.21) తెలియడం లేదు. ఈ డేటాను తొలగించాలని ఆరోగ్య శాఖాధికారులనూ కోరిందట.

ఎందుకంటే, కొత్త వ్యాక్సిన్‌లవల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బయటపడుతున్న కేసులు తొలుత డజన్ల సంఖ్యలో ఉండగా, ఇప్పుడవి వందల సంఖ్యలో బయటపడుతున్నాయని వార్తలు. బహుశా అందుకే 19వ శతాబ్ది మహోన్నత జీవ శాస్త్రవేత్త, వైరస్‌ల పుట్టుపూర్వాలు బయటపెట్టిన విజ్ఞానవేత్త లూయీ పాశ్చర్‌ అన్నట్టు ‘జీవితం అంటే క్రిమి, క్రిమి అంటేనే జీవితం. మరోమాటలో చెప్పాలంటే మానవ జీవితాన్ని శాసించే ఆఖరిమాట క్రిములదే సుమా! అవి వస్తాయి, పోతాయి. ఎలాగంటే పచ్చపచ్చని పైరుపంటల్ని తుపానులు ఊడ్చేసినట్టే పచ్చని జీవితాల్ని కూడా వైరస్‌లు అప్పుడప్పుడూ దెబ్బతీస్తుంటాయి.’ అయితే, ఆధునిక సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ధిక్కరించి వైరస్‌లు శాశ్వతంగా బతికి బట్టకట్టలేవు’ అని అట్లాంటా డైరెక్టర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెన్సర్, (1976 నవంబర్‌ 24), భరోసా కల్పించాడు. అందుకే శ్వాస ఉన్నంతవరకే జీవితంపై ఆశ ఉంటుం దన్న సామెత పుట్టింది!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement