సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలకు ఉప్పునూ, చల్లటి ప్రాంతంలో శీతల పానీయాన్నీ అమ్మాలంటుంది పెట్టుబడీదారీ వ్యవస్థ. దానికి లాభాలే ముఖ్యం. ఆ లాభం అనేదాని కోసం అది ఎంతదూరమైనా వెళ్తుంది. ఎంతదూరం అంటే, ఈ భూమ్మీద మనుషులు నిలబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి కాబట్టి, దానికి కూడా పన్ను కట్టమని ఒత్తిడి చేసేంత! ఇది వ్యంగ్యంలా కనబడుతున్నప్పటికీ, ఈ అసమ సమాజంలో పేద మనిషి ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతున్నాడో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే ప్రపంచం మరింత బాగు పడాలంటే, సోషలిస్టు సమాజం తన విస్తృతిని పెంచుకోవాలి. పెట్టుబడిదారీ సమాజం సమానత్వ దృష్టిని అలవర్చుకోవాలి.
ధనిక వర్గ రాజకీయ సామాజిక ఆర్థిక దోపిడీ వ్యవస్థల్లో అమలు జరిగే ఏకైక ప్రామాణిక ఎత్తుగడ ఏమిటంటే, యావత్తు సమాజానికి చెందవలసిన సమష్టి వనరులను కొద్దిమంది ప్రైవేట్ ప్రయోజనాల రక్షణకు వినియోగిం చడం! ప్రజా ప్రయోజనాల ఉమ్మడి రక్షణకు వినియోగ పడాల్సిన దేశ నిధుల్ని ప్రైవేట్ ప్రయోజనాల్ని రక్షించేందుకు దారి మళ్లించి ప్రభుత్వ రంగ పనులు జరక్కుండా కుంటుపరుస్తుంటారు. ఈ దారి ‘మళ్లింపు’ చర్యలనే ప్రజాబాహుళ్యం వ్యతిరేకించాల్సి వస్తోంది. అయినా వర్గ ప్రయోజనాల రక్షణకు కట్టుబడిన పాలకులు ప్రైవేట్ పెట్టుబడులకే పనులు ధారాదత్తం చేస్తారు.
– అమెరికన్ మేధావి, విద్యాధికుడు, తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ
అలాంటి దారిమళ్లింపు ‘నైపుణ్యం’లో భాగంగా ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కొందరు వాడుకునే పరిస్థితి వస్తే! న్యూటన్ భౌతికవాద శాస్త్రం ఆధారంగా, చెట్టుమీద ఉన్న కాయ పైకి ఎగిరి పోకుండా భూమ్మీదనే ఎందుకు పడుతోందన్న ప్రశ్నకు శాస్త్రీయమైన సమాధానాన్ని కనుగొని, భూమి ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తిగా నామకరణం చేసి దాన్ని శాశ్వతంగా స్థిరపరిచాడు. కానీ మనకాలంలో ఈ గురుత్వాకర్షణ శక్తి ధనిక వర్గ సమాజాల్లో ఒకరకంగానూ, సోషలిజం పునాదిగా ఉన్న సమాజాల్లో మరొక విధంగానూ పని చేస్తూంటుంది.
తమిళ మిత్రులు, సుప్రసిద్ధ కథకులైన ముత్తులింగం గారు లిఖించిన ‘ఐదు కాళ్ల మనిషి’ అనే పుస్తకంలో గురుత్వాకర్షణ సుంకం కథా కమామీషు ఉన్నాయి (తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ సౌజన్యంతో.) ఇంత గాథకు అసలు పూర్వ రంగాన్ని తెలుసుకోవడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. బడుగు దేశాల ప్రజలను సంపన్న దేశాలు ఇప్పటికీ ఎంత చులకనగా భావిస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఇది. కోవిడ్ –19 వైరస్ సంహారక వ్యాక్సీన్‌లు మురిగిపోతున్న దశలో, వాటిని బడుగు, వర్ధమాన దేశాల మీద లాభాల వేటలో ఉన్న విదేశీ, ప్రైవేట్ కంపెనీలు రుద్దాయని ఐక్యరాజ్య సమితి శిశు వైద్య నిధుల సంస్థ (14 జనవరి 2022) వెల్లడించింది. ప్రపంచంలోని అనేక పేద దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఐక్యరాజ్య సమితి సమర్థించిన ‘కోవాక్స్’ టీకా పథకంపై ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో 10 శాతం మంది ప్రజలకు కూడా టీకాలు అందకుండా మురిగిపోయాయి! చివరికి ఇండియాలో పరిస్థితి కూడా మెరుగ్గా లేదని రోజుకొక తీరున బయటపడుతున్న పరస్పర విరుద్ధమైన కథనాలు చెప్పకనే చెబుతున్నాయి.
అమెరికాలో విషక్రిముల వ్యాప్తిని కంట్రోల్ చేసే సర్వాధికారాలు మందుల గుత్త వ్యాపారంలో ఉన్న 84 ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అమెరికా పాలక వర్గాలు, వాళ్లు రిపబ్లికన్స్ అయినా, డెమో క్రాట్స్ అయినా ఆ కంపెనీల నిర్ణయం పైననే ఆధారపడే దౌర్భాగ్యం ఉంది. ఆ కంపెనీల శాసనమే ప్రపంచ ఫార్మా కంపెనీల్ని కూడా నడుపుతోందని మరచిపోరాదు. ఈ దుస్థితికి కొనసాగింపు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్న కథలో ‘స్పేస్ షిప్’ వ్యాపారులు అయిన కాడికి కొన్ని గంటల పాటు రోదసీ యాత్రకు ఉత్సాహపడే విద్యా ర్థులు, బోధకులను దండుకుంటుంటారు. రోదసి నుంచి తిరిగి భూమ్మీదకు వారిని సురక్షితంగా దించుతారు. కానీ వారిని సంవత్స రాల తరబడి తీర్చలేని భారీ బకాయిల్లోకి నెట్టే పథకమే గురుత్వా కర్షణ సుంకం అన్నది వారికి తెలియదు. ఈ సరికొత్త సుంకం ఎలా పెరుగుతూ పోతుంది, మరెలా తీర్మానం అవుతుంది లాంటి అంశాల్ని ముత్తులింగం ప్రస్తావిస్తారు. ఒక్కసారి ‘గురుత్వాకర్షణ సుంకం’ కట్టమని మీకు నోటీసుల మీద నోటీసులు వస్తే ఏం చేస్తారన్నది ప్రశ్న! పైగా ఈ విచిత్రమైన ‘గురుత్వాకర్షణ సుంకం’ నోటీసు అందుకునే ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి, వారు పెరిగే బరువును బట్టి కూడా సుంకం ‘పాపపు బండి’లా పెరుగుతూ ఉంటుందట! ఈ సుంకాన్ని వరుసగా ఎనిమిది నెలల పాటు చెల్లించడానికి నిరాకరించిన వ్యక్తికి వేసిన శిక్ష ఎలాంటిదో, దానికి ‘స్పేస్ షిప్’ వ్యాపారులు ఇచ్చిన సమాధానం ఏమిటో మరీ వింతగా ఉంటాయి. ‘‘స్పేస్ షిప్‌లో యాత్రకు వచ్చిన వ్యక్తిని సురక్షితంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దింపేశాం. ఆ వ్యక్తి ఒకసారి భూమి ప్రదక్షిణ చేసి వచ్చాడు కాబట్టి, తాను మనసు మార్చుకుని మీరు చెప్పినట్టే సుంకం కట్టేస్తాని ఒప్పుదలయ్యాడు. అలా మా బాకీని వడ్డీతో సహా కట్టేశాడు.’’ అయితే అతనికి ఓ చిక్కు సమస్య ఎదురైంది. స్పేస్‌షిప్ ప్రయాణం కోసం అయిన ఖర్చు, స్పేస్ సూట్ ఖరీదు, ఇతర ఖర్చులు మొత్తానికి ఇప్పుడు నెలనెలా వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు. అయితే ఇలా అతను మొత్తం 2,196 మాసాలు కడుతూ ఉండాలి. ‘అమ్మో! అన్ని మాసాల పాటా?’ అంటే– ‘అవును, మొత్తం చెల్లించడానికి 183 సంవత్సరాలు పడుతుం’దని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. ‘మనిషి అన్నేళ్లు బతుకుతాడా’ అని ఔత్సాహిక యువకుడంటే – ‘అవన్నీ మాకు తెలీదు గానీ, అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చా’రని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. అలా ఆ యువకుడు రాజీపడి బిల్లులు చెల్లిస్తూండగానే, భూప్రయాణ శాఖ అన్న కొత్త శాఖ నుంచి మరికొన్ని బిల్లులు వచ్చి మీద పడతాయి. వాటి సారాంశం ఏమంటే – భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ దూరాన్ని కూడా లెక్కగట్టి అందుకయ్యే ఖర్చుల్ని కూడా ‘గురుత్వాకర్షణ సుంకం’ కిందనే కట్టమంటారు! అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొందరు లౌకిక వాదులు ఉండబట్టే అందరూ పెద్ద మనుషులేగానీ రొయ్యల బుట్ట ఖాళీ అయిందన్న అర్థంలో సామెత ఒకటి పుట్టుకొచ్చింది! ఇలాంటి గాథలు చదివే ఓపిక ఉండాలే గానీ ‘పురాణవైర గ్రంథమాల’లో కొల్లలు, కొల్లలు.
పశ్చిమ యూరప్ అంతా అంధ యుగాలలో మగ్గుతున్నపుడు– ఈజిప్టు, గ్రీస్, రోమ్ ప్రాచీన సంçస్కృతులు, వాటి నాగరికతలకు ప్రాచ్య దేశాల సంస్కృతికి చాలా దగ్గరి సంబంధాలున్నాయి. సమాజ పరిస్థితుల్ని, ప్రజల దైన్యాన్ని కళ్లారా చూసి కలత చెందిన కొందరు రోమన్ రాచరికాల్లో టైబీరియస్ గ్రాచస్ లాంటి సెనేటర్ ఒకరు. ఇటలీలో ప్రజలపై సంపన్నుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదని భావించిన మరుక్షణమే ఇటాలియన్ కష్టజీవులైన రైతు వ్యవసాయ కార్మికులకు దేశంలోని అదనపు భూమినంతా పంచి, ప్రజా పాలకు నిగా మన్ననలు పొంది, ప్రజావాణిగా ప్రజల చేత సెనేట్‌కు ఏక గ్రీవంగా ఎన్నికయ్యాడు! తన దేశ సంపన్న వర్గాలకు గ్రాచస్ తుది సందేశంలో ఇలా వెలువరించాడు: ‘‘మీ అక్రమ సంపాదనను, సౌభా గ్యాన్ని, విలాసాల్ని కట్టిపెట్టి ప్రజలకిచ్చి, జీవితాల్ని సార్థకం చేసు కోండి. అప్పుడే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అంతేగానీ అరం గుళం నేలైనా ‘ఇది నాది’ అని చెప్పి కాలు మోపుకొనే స్థితి లేదని మీరు (సంపన్న వర్గం) గ్రహించా’’లని దండోరా వేయించాడు. అలాగే రైతాంగం పట్ల మన కృష్ణదేవరాయల లాంటి కారుణ్య ప్రభువులు కూడా ఉంటారు.
చరిత్ర అందించిన ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ‘ప్రపంచ చరిత్ర పాఠాలు’ అన్న ఉద్గ్రంథంలో సుప్రసిద్ధ చరిత్రకారులు విల్ డూరాంట్, ఏరియల్ డూరాంట్ దంపతులు ఇంతవరకు జరిగిన చరిత్రను క్లుప్తంగా ఇలా క్రోఢీకరించి ఉంటారు: ‘‘పెట్టుబడిదారీ విధానం ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెడుతోందో నన్న భీతి వల్ల సోషలిజం స్వేచ్ఛా వాతావరణాన్ని తన పరిధిలో విస్తృతం చేయక తప్పలేదు. అలాగే సోషలిజం వల్ల సమానత్వ దృష్టిని పెంచుకోవలసిన అవసరాన్ని గుర్తించక పెట్టుబడిదారీ వ్యవస్థకు తప్పలేదు’’!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment