capitalist system
-
Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి
పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం లిఖిస్తోంది. సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల, వృద్ధి రేటు పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తు సేవల వినియోగం తగ్గిపోతోంది. ఈ స్థితిలో ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు కరెన్సీ ముద్రిస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచుతున్నారు. దీంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. మొత్తం మీద ఒక అనివార్య చక్రబంధంలో పెట్టుబడిదారీ దేశాలు చిక్కుకు పోయాయి. ప్రపంచ పెట్టుడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ వాయిదా వేసిన తన అధికారిక మరణ ప్రకటనను నేడు ముఖాముఖి ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి వ్యవస్థ తాలూకు అంతిమ వైఫల్యం 3, 4 దశాబ్దాల క్రితమే నిర్ధారణ అయిపోయింది. 1979ల తర్వాత పెట్టుబడి దారి ధనిక దేశాలలో ఆయా వ్యవస్థలు ఇక ఎంత మాత్రమూ ప్రజలకు ఉపాధిని కల్పించలేని పరిస్థితులు వేగవంతం అయ్యాయి. దీనికి కారణాలుగా అప్పటికే పెరిగిపోసాగిన యాంత్రీకరణ; ఈ దేశాలలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి గనుక అక్కడి నుంచి పరిశ్రమలు చైనా వంటి చౌక శ్రమ శక్తి లభించే దేశాలకు తరలిపో నారంభించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు అన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా వంటివి తమ పారిశ్రామిక పునాదిని కోల్పోయాయి. అలాగే 1990ల అనంతర సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విప్లవా లతో ఈ దేశాలలోని సేవారంగం కూడా (ఐటీ, బీపీఓ) భారత దేశం వంటి దేశాలకు తరలిపోయింది. ఈ క్రమంలోనే ఆయా ధనిక దేశాలలోని ప్రజలకు ఇక ఎంత మాత్రమూ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలూ, వ్యవస్థలూ ఆ ప్రజలలో అసంతృప్తి జ్వాలలు రగులకుండానూ, వారి కొనుగోలు శక్తి పతనం కాకుండానూ కాపాడుకునేందుకు దశాబ్దాల పాటు క్రెడిట్ కార్డుల వంటి రుణ సదుపాయాలపై ఆధారపడ్డాయి. అలాగే 1990లలో యావత్తూ... సుమారు 2001 వరకూ ఇంటర్నెట్ ఆధారిత హైటెక్ కంపెనీల షేర్ల విలువలలో భారీ వృద్ధి ద్వారా జరిగిన షేర్ మార్కెట్ సూచీల పెరుగుదల పైనా వ్యవస్థలు నడిచాయి. ఇక చివరగా 2003 తర్వాతి కాలంలో... 2008 వరకూ రియల్ ఎస్టేట్ బూమ్‌పై ఆధారపడి ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింది. అంతిమంగా 2008 చివరిలో ఈ రియల్ బుడగ పగిలిపోవడంతో వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వేరే దారిలేక ఈ ధనిక దేశాలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు, ఉద్దీపన రూపంలో కరెన్సీల ముద్రణను మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో ధనిక దేశాలన్నింటిలోనూ ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల రికార్డు స్థాయికి చేరింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం ధనిక దేశాలలో దేశీయంగానే సరుకులూ, సేవల ఉత్పత్తి తాలూకూ పారిశ్రామిక పునాదులు లేకపోవడం. ఫలితంగా ఈ దేశాలలో ముద్రించబడిన డబ్బు, అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న సరుకులు, సేవలకు ఖర్చవుతోంది. అందుకే ద్రవ్యోల్బణం తగ్గడంలేదు. దాంతో ప్రస్తుతం దరిదాపు అన్ని ధనిక దేశాలూ ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్యాంకు వడ్డీ రేట్లను పెంచసాగాయి. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్ల వలన ఆయా దేశాలలో రుణ స్వీకరణ తగ్గిపోతోంది. ఇది వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పతనానికీ... అంటే అంతిమంగా వృద్ధి రేటు పతనానికీ దారితీస్తోంది. అదీ కథ! అంటే ఆర్థిక మాంద్య స్థితిలో ఉద్దీపన కోసం కరెన్సీలు ముద్రిస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని వడ్డీ రేట్లను పెంచితే తక్షణమే ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరుగుతోంది. కొద్ది నెలల క్రితం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరిట అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే తర్వాతి త్రైమాసిక కాలం నుంచీ ఆర్థిక వృద్ధి రేటు అకస్మాత్తుగా పడిపోసాగింది. వ్యవస్థ పరిమితులలో పరిష్కారం సాధ్యంకాని చిక్కుముడిగా... వైరుధ్యంగా ఈ పరిస్థితి తయారయ్యింది. ముందు నుయ్యి... వెనుక గొయ్యి స్థితి ఇది. స్థూలంగానే... ఆయా ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంక్షోభ కాలంలో ఉద్దీపనలు లేదా వాటి ద్వారా ప్రభుత్వమే పూను కొని (ప్రైవేటు పెట్టుబడి దారులకు బదులు) ఉపాధి కల్పన చేసి వ్యవస్థను తిరిగి గట్టెక్కించే అవకాశాలు నేడు సన్నగిల్లి పోయాయి. యాంత్రీకరణ వేగం పెరగడం... విపరీతమైన స్థాయిలో మర మనుషుల వినియోగం పెరగడం వంటి వాటి వలన నేడు ఈ దేశాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఇక ఎంత మాత్రమూ లేకుండా పోతున్నాయి. వాస్తవంలో నేటి ప్రపంచంలో జరిగిన... జరుగుతోన్న హైటెక్ సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాల్సింది. ఎందుకంటే ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి భారీగా ఉత్పత్తిని పెంచి తద్వార జన జీవితాన్ని మరింత సులువైనదిగా, సంపన్నవంతమైనదిగా మార్చ గలగాలి. కానీ ఇప్పుడు జరుగుతోంది... సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల... వృద్ధి రేట్ల పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కారల్ మార్క్స్ పరిభాషలో చెప్పాలంటే... నేడు జరుగుతోంది ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న కొద్దీ అవి ప్రజలకు మేలుచేయక పోగా... వినాశకరకంగా మారడమే. ఈ పరిస్థితికి కారణం నేటి వ్యవస్థ తాలూకు కీలక చలన సూత్రం లాభాల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టడం. అంటే ఇక్కడ... ఈ వ్యవస్థలో నిర్జీవమైన డబ్బును... లాభార్జన ద్వారా... మరింత అధిక డబ్బుగా మార్చడం అనేదే ప్రాథమిక సూత్రం. దీనిలో ప్రాణం ఉన్న మనుషులు... ప్రాణం లేని పెట్టుబడీ, దాని తాలూకు లాభాల కోసం పని చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టుకొని లాభాలు సంపాదించుకోగలిగితే అది పెట్టుబడి దారులకు మహా సంతోషం. అలాగే ఈ పెట్టుబడిదారులు తమ ఈ ఆలోచనా విధానం వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పడిపోయినప్పుడు ఆ స్థితి నుంచి వ్యవస్థను గట్టెక్కించేందుకు ఇక ఎంత మాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టరు. అప్పుడు ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడవలసి రావడమే ప్రతి ఆర్థిక మాంద్య కాలంలోనూ జరిగింది. అయితే 1980ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నయా ఉదారవాద సంస్కరణలు కనీసం ప్రభుత్వాలైనా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా నికరంగా పూనుకోగలగడాన్ని చాలా వరకూ ఆటంక పరుస్తున్నాయి. ఈ సంస్కరణల తాలూకు ఆలోచనా విధానంలో ప్రభుత్వ పాత్ర కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ధనవంతులకు అనుకూలంగా వ్యవహారిస్తేనే దానివలన పెట్టుబడులు పెరిగి ప్రజలకు ఉపాధి లభిస్తుందనేది కీలక విధానంగా ఉండడం. అంటే ఈ ప్రపంచీకరణ విధానాలకు ముందరి... 1980ల ముందరి సంక్షేమ రాజ్య ఆలోచనలైన ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు బాగుండి, వారి ఆర్థిక స్థితి బాగుంటేనే వ్యవస్థలో కొనుగోలు శక్తి... డిమాండ్ స్థిరంగా ఉంటాయనే దానికి తదనంతరం తిలోదకాలిచ్చారు. అలాగే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల కలగలుపు అయిన ఈ ఉదారవాద సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని సిద్ధాంతీకరించాయి. అంటే పూర్తిగా డిమాండ్ సరఫరాలపై ఆధారపడిన మార్కెట్ ఆలోచనా విధానం ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు. అందుచేత ఈ విధానాలను విశ్వసించేవారు ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ పాత్రను తిరస్కరించే గుడ్డితనానికి పోతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం కాగితం కరెన్సీల ముద్రణపై ఆధారపడి తమ మరణ శాసనాలను వాయిదా వేసుకున్న పెట్టుబడిదారీ పాలకులు నేడు ఇక ఎంత మాత్రమూ వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో పడిపోయారు! డి. పాపారావు, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
ఇక ‘గురుత్వాకర్షణ’ సుంకాలు!
సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలకు ఉప్పునూ, చల్లటి ప్రాంతంలో శీతల పానీయాన్నీ అమ్మాలంటుంది పెట్టుబడీదారీ వ్యవస్థ. దానికి లాభాలే ముఖ్యం. ఆ లాభం అనేదాని కోసం అది ఎంతదూరమైనా వెళ్తుంది. ఎంతదూరం అంటే, ఈ భూమ్మీద మనుషులు నిలబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి కాబట్టి, దానికి కూడా పన్ను కట్టమని ఒత్తిడి చేసేంత! ఇది వ్యంగ్యంలా కనబడుతున్నప్పటికీ, ఈ అసమ సమాజంలో పేద మనిషి ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతున్నాడో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే ప్రపంచం మరింత బాగు పడాలంటే, సోషలిస్టు సమాజం తన విస్తృతిని పెంచుకోవాలి. పెట్టుబడిదారీ సమాజం సమానత్వ దృష్టిని అలవర్చుకోవాలి. ధనిక వర్గ రాజకీయ సామాజిక ఆర్థిక దోపిడీ వ్యవస్థల్లో అమలు జరిగే ఏకైక ప్రామాణిక ఎత్తుగడ ఏమిటంటే, యావత్తు సమాజానికి చెందవలసిన సమష్టి వనరులను కొద్దిమంది ప్రైవేట్ ప్రయోజనాల రక్షణకు వినియోగిం చడం! ప్రజా ప్రయోజనాల ఉమ్మడి రక్షణకు వినియోగ పడాల్సిన దేశ నిధుల్ని ప్రైవేట్ ప్రయోజనాల్ని రక్షించేందుకు దారి మళ్లించి ప్రభుత్వ రంగ పనులు జరక్కుండా కుంటుపరుస్తుంటారు. ఈ దారి ‘మళ్లింపు’ చర్యలనే ప్రజాబాహుళ్యం వ్యతిరేకించాల్సి వస్తోంది. అయినా వర్గ ప్రయోజనాల రక్షణకు కట్టుబడిన పాలకులు ప్రైవేట్ పెట్టుబడులకే పనులు ధారాదత్తం చేస్తారు. – అమెరికన్ మేధావి, విద్యాధికుడు, తత్వవేత్త నోమ్ చామ్స్కీ అలాంటి దారిమళ్లింపు ‘నైపుణ్యం’లో భాగంగా ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కొందరు వాడుకునే పరిస్థితి వస్తే! న్యూటన్ భౌతికవాద శాస్త్రం ఆధారంగా, చెట్టుమీద ఉన్న కాయ పైకి ఎగిరి పోకుండా భూమ్మీదనే ఎందుకు పడుతోందన్న ప్రశ్నకు శాస్త్రీయమైన సమాధానాన్ని కనుగొని, భూమి ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తిగా నామకరణం చేసి దాన్ని శాశ్వతంగా స్థిరపరిచాడు. కానీ మనకాలంలో ఈ గురుత్వాకర్షణ శక్తి ధనిక వర్గ సమాజాల్లో ఒకరకంగానూ, సోషలిజం పునాదిగా ఉన్న సమాజాల్లో మరొక విధంగానూ పని చేస్తూంటుంది. తమిళ మిత్రులు, సుప్రసిద్ధ కథకులైన ముత్తులింగం గారు లిఖించిన ‘ఐదు కాళ్ల మనిషి’ అనే పుస్తకంలో గురుత్వాకర్షణ సుంకం కథా కమామీషు ఉన్నాయి (తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ సౌజన్యంతో.) ఇంత గాథకు అసలు పూర్వ రంగాన్ని తెలుసుకోవడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. బడుగు దేశాల ప్రజలను సంపన్న దేశాలు ఇప్పటికీ ఎంత చులకనగా భావిస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఇది. కోవిడ్ –19 వైరస్ సంహారక వ్యాక్సీన్లు మురిగిపోతున్న దశలో, వాటిని బడుగు, వర్ధమాన దేశాల మీద లాభాల వేటలో ఉన్న విదేశీ, ప్రైవేట్ కంపెనీలు రుద్దాయని ఐక్యరాజ్య సమితి శిశు వైద్య నిధుల సంస్థ (14 జనవరి 2022) వెల్లడించింది. ప్రపంచంలోని అనేక పేద దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఐక్యరాజ్య సమితి సమర్థించిన ‘కోవాక్స్’ టీకా పథకంపై ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో 10 శాతం మంది ప్రజలకు కూడా టీకాలు అందకుండా మురిగిపోయాయి! చివరికి ఇండియాలో పరిస్థితి కూడా మెరుగ్గా లేదని రోజుకొక తీరున బయటపడుతున్న పరస్పర విరుద్ధమైన కథనాలు చెప్పకనే చెబుతున్నాయి. అమెరికాలో విషక్రిముల వ్యాప్తిని కంట్రోల్ చేసే సర్వాధికారాలు మందుల గుత్త వ్యాపారంలో ఉన్న 84 ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అమెరికా పాలక వర్గాలు, వాళ్లు రిపబ్లికన్స్ అయినా, డెమో క్రాట్స్ అయినా ఆ కంపెనీల నిర్ణయం పైననే ఆధారపడే దౌర్భాగ్యం ఉంది. ఆ కంపెనీల శాసనమే ప్రపంచ ఫార్మా కంపెనీల్ని కూడా నడుపుతోందని మరచిపోరాదు. ఈ దుస్థితికి కొనసాగింపు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్న కథలో ‘స్పేస్ షిప్’ వ్యాపారులు అయిన కాడికి కొన్ని గంటల పాటు రోదసీ యాత్రకు ఉత్సాహపడే విద్యా ర్థులు, బోధకులను దండుకుంటుంటారు. రోదసి నుంచి తిరిగి భూమ్మీదకు వారిని సురక్షితంగా దించుతారు. కానీ వారిని సంవత్స రాల తరబడి తీర్చలేని భారీ బకాయిల్లోకి నెట్టే పథకమే గురుత్వా కర్షణ సుంకం అన్నది వారికి తెలియదు. ఈ సరికొత్త సుంకం ఎలా పెరుగుతూ పోతుంది, మరెలా తీర్మానం అవుతుంది లాంటి అంశాల్ని ముత్తులింగం ప్రస్తావిస్తారు. ఒక్కసారి ‘గురుత్వాకర్షణ సుంకం’ కట్టమని మీకు నోటీసుల మీద నోటీసులు వస్తే ఏం చేస్తారన్నది ప్రశ్న! పైగా ఈ విచిత్రమైన ‘గురుత్వాకర్షణ సుంకం’ నోటీసు అందుకునే ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి, వారు పెరిగే బరువును బట్టి కూడా సుంకం ‘పాపపు బండి’లా పెరుగుతూ ఉంటుందట! ఈ సుంకాన్ని వరుసగా ఎనిమిది నెలల పాటు చెల్లించడానికి నిరాకరించిన వ్యక్తికి వేసిన శిక్ష ఎలాంటిదో, దానికి ‘స్పేస్ షిప్’ వ్యాపారులు ఇచ్చిన సమాధానం ఏమిటో మరీ వింతగా ఉంటాయి. ‘‘స్పేస్ షిప్లో యాత్రకు వచ్చిన వ్యక్తిని సురక్షితంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దింపేశాం. ఆ వ్యక్తి ఒకసారి భూమి ప్రదక్షిణ చేసి వచ్చాడు కాబట్టి, తాను మనసు మార్చుకుని మీరు చెప్పినట్టే సుంకం కట్టేస్తాని ఒప్పుదలయ్యాడు. అలా మా బాకీని వడ్డీతో సహా కట్టేశాడు.’’ అయితే అతనికి ఓ చిక్కు సమస్య ఎదురైంది. స్పేస్‌షిప్ ప్రయాణం కోసం అయిన ఖర్చు, స్పేస్ సూట్ ఖరీదు, ఇతర ఖర్చులు మొత్తానికి ఇప్పుడు నెలనెలా వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు. అయితే ఇలా అతను మొత్తం 2,196 మాసాలు కడుతూ ఉండాలి. ‘అమ్మో! అన్ని మాసాల పాటా?’ అంటే– ‘అవును, మొత్తం చెల్లించడానికి 183 సంవత్సరాలు పడుతుం’దని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. ‘మనిషి అన్నేళ్లు బతుకుతాడా’ అని ఔత్సాహిక యువకుడంటే – ‘అవన్నీ మాకు తెలీదు గానీ, అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చా’రని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. అలా ఆ యువకుడు రాజీపడి బిల్లులు చెల్లిస్తూండగానే, భూప్రయాణ శాఖ అన్న కొత్త శాఖ నుంచి మరికొన్ని బిల్లులు వచ్చి మీద పడతాయి. వాటి సారాంశం ఏమంటే – భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ దూరాన్ని కూడా లెక్కగట్టి అందుకయ్యే ఖర్చుల్ని కూడా ‘గురుత్వాకర్షణ సుంకం’ కిందనే కట్టమంటారు! అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొందరు లౌకిక వాదులు ఉండబట్టే అందరూ పెద్ద మనుషులేగానీ రొయ్యల బుట్ట ఖాళీ అయిందన్న అర్థంలో సామెత ఒకటి పుట్టుకొచ్చింది! ఇలాంటి గాథలు చదివే ఓపిక ఉండాలే గానీ ‘పురాణవైర గ్రంథమాల’లో కొల్లలు, కొల్లలు. పశ్చిమ యూరప్ అంతా అంధ యుగాలలో మగ్గుతున్నపుడు– ఈజిప్టు, గ్రీస్, రోమ్ ప్రాచీన సంçస్కృతులు, వాటి నాగరికతలకు ప్రాచ్య దేశాల సంస్కృతికి చాలా దగ్గరి సంబంధాలున్నాయి. సమాజ పరిస్థితుల్ని, ప్రజల దైన్యాన్ని కళ్లారా చూసి కలత చెందిన కొందరు రోమన్ రాచరికాల్లో టైబీరియస్ గ్రాచస్ లాంటి సెనేటర్ ఒకరు. ఇటలీలో ప్రజలపై సంపన్నుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదని భావించిన మరుక్షణమే ఇటాలియన్ కష్టజీవులైన రైతు వ్యవసాయ కార్మికులకు దేశంలోని అదనపు భూమినంతా పంచి, ప్రజా పాలకు నిగా మన్ననలు పొంది, ప్రజావాణిగా ప్రజల చేత సెనేట్‌కు ఏక గ్రీవంగా ఎన్నికయ్యాడు! తన దేశ సంపన్న వర్గాలకు గ్రాచస్ తుది సందేశంలో ఇలా వెలువరించాడు: ‘‘మీ అక్రమ సంపాదనను, సౌభా గ్యాన్ని, విలాసాల్ని కట్టిపెట్టి ప్రజలకిచ్చి, జీవితాల్ని సార్థకం చేసు కోండి. అప్పుడే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అంతేగానీ అరం గుళం నేలైనా ‘ఇది నాది’ అని చెప్పి కాలు మోపుకొనే స్థితి లేదని మీరు (సంపన్న వర్గం) గ్రహించా’’లని దండోరా వేయించాడు. అలాగే రైతాంగం పట్ల మన కృష్ణదేవరాయల లాంటి కారుణ్య ప్రభువులు కూడా ఉంటారు. చరిత్ర అందించిన ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ‘ప్రపంచ చరిత్ర పాఠాలు’ అన్న ఉద్గ్రంథంలో సుప్రసిద్ధ చరిత్రకారులు విల్ డూరాంట్, ఏరియల్ డూరాంట్ దంపతులు ఇంతవరకు జరిగిన చరిత్రను క్లుప్తంగా ఇలా క్రోఢీకరించి ఉంటారు: ‘‘పెట్టుబడిదారీ విధానం ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెడుతోందో నన్న భీతి వల్ల సోషలిజం స్వేచ్ఛా వాతావరణాన్ని తన పరిధిలో విస్తృతం చేయక తప్పలేదు. అలాగే సోషలిజం వల్ల సమానత్వ దృష్టిని పెంచుకోవలసిన అవసరాన్ని గుర్తించక పెట్టుబడిదారీ వ్యవస్థకు తప్పలేదు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన!
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్‌ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు. వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు. -
బుందేల్ ప్యాకేజీతో బురిడీ
ఇలాంటి ప్రత్యేక హోదాపై మొదటిగా జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ) చర్చించవలసి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం మండలి రాష్ట్రాల ప్రతినిధులతో, ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాతే ప్రకటన వెలువడాలి. రాష్ట్ర విభజన పేరిట తెలుగు జాతిని చీల్చుతూ ‘ఇరు ప్రాంతాలకూ న్యాయం’ అన్న సూత్రం చాటున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు ‘పేరు పట్టాలు’ మాత్రమే. ఆ పట్టాలే - ‘ఆంధ్రప్రదేశ్’, ‘తెలంగాణ’. నాలుగు స్థానాల కోసం ఒక వైపున బీజేపీతోను, మరో వైపున తెలుగుదేశంతోను కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయింది. దక్షిణ భారతంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిమితులలోనే అయినా అభివృద్ధి పటంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ను విభజన పేరుతో సమస్యలలోకి, దీర్ఘకాలిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ విషయంలో జరిగింది కూడా సాధికారత, విలువలూ లేని ‘మూజువాణి’ ప్రకటన తప్ప, విభజనానంతర సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను బిల్లులో చూపలేదు. ఈ క్షణానికి ఉన్న పరిస్థితిని బట్టి ఉభయ ప్రాంతాలకూ కోరుకున్నది రాదు. ఉన్నదానికి రక్షణ లేదు. ఈ గందరగోళంలో ఏ ప్రాంత ప్రజలకైనా చాలాకాలం వరకు సుఖశాంతులు ఆశించలేం. ‘మాకు కలిగిన అద్భుత ప్రయోజనం ఇది’ అన్న భరోసా ఆ బిల్లు ఈ రెండు ప్రాంతాల వారికి కూడా ఇవ్వడం లేదు. విభజనకు తోడ్పడిన పాలక పక్షానికీ, అందుకు వత్తాసు పలికిన జాతీయ, ప్రాంతీయ పక్షాలు బీజేపీ, తెలుగుదేశం సాధించగలిగినది ఇంతమాత్రమే అయితే, ఉభయ ప్రాంతాలతో కూడిన యావత్తు తెలుగుజాతి భవితవ్యం నట్టేట మునిగినట్టే. దారి తప్పిన నాయకుల వల్ల, పాలకుల వల్లా రేపు రెండు ప్రాంతాలలోను సంభవించబోతున్నది ఇదే. ‘విభజన’, ‘చీలిక’ జరిగినది నా ప్రభావంతో అంటే, కాదు నా ప్రభావం ఫలితమేనని వికృతానందం పొందుతున్న నాయకులందరి మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఎలా చోటు చేసుకుందో, అది ఏ రూపంలో సాధ్యమైందో ‘ది హిందూ’ ఢిల్లీ ప్రతినిధి గార్గీ పర్సాయ్, పార్లమెంటులో చూసిన దృశ్యాల ఆధారంగా తన వార్తాకథనంలో కళ్లకు కట్టాడు. బుందేల్ బులబాటం ఇలాంటి నేతలంతా తెలుగుజాతిని ఎలా నిట్టనిలువునా ముంచగలరో తెలుసుకోవాలంటే, తాజా ఉదాహరణ చూడాలి. విభజన బిల్లుకు ముక్కూ మొహం లేవు. అలాగే, సీమాంధ్రకు ‘బుందేల్‌ఖండ్ తరహా’లో ఐదేళ్ల పాటు ఎవరికీ అందని ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం కూడా అలాంటిదే. ఇది ఎన్నికలలో ప్రయోజనం పొందడానికీ, బుజ్జగించడానికీ, తొమ్మిదికోట్లకు పైబడి ఉన్న తెలుగువారితో ఇచ్చకాలతో కాలక్షేపం చేయడానికీ పార్లమెంటులో చేసిన ప్రకటన మాత్రమే. నాయకులు ఇచ్చేసిన హామీలూ, ప్రకటనలూ బిల్లులో చోటు చేసుకోకుంటే వాటికి చట్టబద్ధత ఉండదు గాక ఉండదు. అనేక బిల్లులనూ, ఇంకా అనేక చట్టాలనూ ఆచరణలో అపహాస్యం పాలుచే సిన సంస్కృతి కాంగ్రెస్, బీజేపీలకు ఉంది. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ ముందుకు తెచ్చిన ‘బుందేల్‌ఖండ్ ప్రయోగం’ వల్లగానీ, కురిపించిన హామీల వర్షానికి గానీ గడ్డిపోచ విలువ కూడా ఉండదు. బిల్లులో ప్రతిపాదించకుండా, నోటిమాటగా ఇచ్చేసిన హామీలను తరువాత గద్దెనెక్కేవారు గౌరవిస్తారనీ, అమలు చేస్తారని నమ్మకమేమీ లేదు. ‘మూజువాణి’ ఆమోదాన్ని అంగీకరించవలసిన అవసరం గానీ, చట్టబద్ధత లేని ఉత్తుత్తి కేటాయింపులని పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం గానీ తమకు లేదని రాబోయే సర్కార్లు చేతులెత్తేస్తే తెలుగు వారంతా తలలు ఎక్కడ పెట్టుకోవాలి? మనకి యూపీఏ కల్పించిన దుస్థితి ఇది. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నేతలతో (వెంకయ్యనాయుడు సహా) సాగించిన లోపాయికారీ మంతనాల ద్వారా యూపీఏ ప్రభుత్వం చేసిన నిర్వాకం సరిగ్గా ఇందుకు సంబంధించినదే. ఆ ప్యాకేజీ రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ చేత ‘బుందేల్‌ఖండ్’(ప్రత్యేక ప్రతిపత్తి) ప్యాకేజీని సీమాంధ్ర కోసం ప్రకటింప చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ అలా ప్రకటించే హక్కు ఉంటే గింటే ప్రధానికే ఉంటుంది. కానీ మొదట సోనియా ఆ ప్యాకేజీని ప్రకటించారు. తరువాత ప్రధాని మన్మోహన్ వల్లించారు. కానీ ఆ ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఐదేళ్లు ఉంటుందని బిల్లులో కాకుండా ప్రధాని నోటి మాటగా ప్రకటించడం కూడా రాజ్యాంగ బద్ధం కాదు. ఇదంతా ఉల్టా రాజకీయం. ఇలాంటి ప్రత్యేక హోదాపై మొదటిగా జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ) చర్చించవలసి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం మండలి రాష్ట్రాల ప్రతినిధులతో, ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాతే ప్రకటన వెలువడాలి. ఎన్డీసీకి ప్రధాని అధ్యక్షుడు అయి ఉండవచ్చు. అయినా ఇలాంటి ప్రతిపాదన మీద మండలి ఆమోదం తరువాతే ప్రకటన చేయాలి. కాబట్టే రాజ్యాంగ బద్ధత లేని ఈ వ్యక్తిగత స్థాయి ప్రతిపాదనకు విలువ లేదు. ఎన్డీసీ నియమ నిబంధనల మేరకు ఇది సీమాంధ్రకు వర్తించే అవకాశం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నియమ నిబంధనలను సవరించే హక్కు కూడా ఎన్డీసీకే పరిమితం. అది కొండ ప్రాంతాలకే అలాంటి ‘ప్రత్యేకప్రతిపత్తిని’ ఏ రాష్ట్రానినైనా కల్పించడానికి పాటించాల్సిన నియమాలు - కొండప్రాంతాలుగా, అననుకూలమైన(టైర్రైన్), చేరుకోవడం కష్టమైన ప్రాంతాలుగా ఉండాలి. జనసాంద్రత తక్కువగా ఉండాలి. గిరిజన, ఆదివాసీ ప్రాంతాలై ఉండాలి. దేశ సరిహద్దులలో వ్యూహాత్మకంగా కీలకమై ఉండాలి. ఆర్థికంగానూ, మౌలిక సదుపాయాలలోనూ, వెనుకబడి ఉండాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ హోదాకు రాష్ట్రాలు అర్హమవుతాయని కేంద్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ(9-3-2011) స్పష్టం చేసింది. కానీ, ఈ ప్యాకేజీని కూడా తన జేబులోని వస్తువు మాదిరిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తన చుట్టూ తిరుగుతున్న 17 మంది సీమాంధ్ర ఎంపీలకు ‘హామీ’ రూపంలో ప్రకటించేశాడట . ప్రధాని సీమాంధ్రకు ప్రకటన మాత్రంగా చెప్పిన పన్ను మినహాయింపులు కూడా బిల్లులోకి ఎక్కలేదు. సీమాంధ్ర 13 జిల్లాలకు వర్తించాల్సిన ‘బుందేల్‌ఖండ్’ ప్యాకేజీ సాధికారిత లేని, చట్టబద్ధం కాని ‘ప్రత్యేక ప్రతిపత్తి’గానే మిగిలిపోకతప్పదు! ఇక నోటిమాటగా కేంద్రం ఇస్తానన్న ‘90 శాతం గ్రాంటు’ ప్రతిపత్తి కూడా నీటి మీది రాతగానే ఉండిపోవచ్చు. బహుశా ఈ బాదరబందీ వల్లనే విభజన ప్రక్రియ మూడు నెలల తర్వాతనే సాధ్యపడుతుందనీ, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి షిండే చావుకబురు చల్లగా వదిలాడు! ఈ విషయంలో రాజకీయ పక్షాలు, అభ్యర్థులు చట్టబద్ధత లేని హామీలు ఇస్తే చర్యలుంటాయని ఎన్నికల కమిషన్ హెచ్చరించినందువల్ల కూడా విభజన ఇప్పటికి ఆగి ఉండవచ్చు. కుమ్మక్కుకు సంకేతం రాజ్యసభలో బిల్లుపై చర్చించినట్లు సభ్యులు నటించిన సందర్భంలో వెంకయ్యనాయుడు ‘ఇంతవరకు మీరు చేయండి! ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక మిగతా హామీలు నెరవేరుస్తుం’దని కుమ్మక్కులో భాగంగానే ప్రకటించారు. ఇంతకీ బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్రతిపత్తిని కాంగ్రెస్ ఎందుకు భుజాన వేసుకుంది? బుందేల్‌ఖండ్ రూపురేఖలే వేరు. దానికి ప్రతిపత్తి ప్రతిపాదన బీజేపీది. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య పదమూడు జిల్లాల భూభాగంలో ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నవి ఆరు జిల్లాలే. 70,000 చ. కి. మీ. మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంత జనాభా రెండు కోట్ల, పది లక్షలు. ప్రణాళికా సంఘం గుర్తించిన కరువు జిల్లాలో ఇక్కడి పదమూడు జిల్లాలు ఉన్నాయి. దీనికి ఉన్న ప్రతిపత్తిని తీసుకువచ్చి బీజేపీ చెప్పింది కదా అని ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపజేయాలనుకోవడం కాంగ్రెస్ తను తీసుకున్న గోతిలో తాను పడడమే. తెలంగాణ ప్రాంతాన్ని కూడా హైదరాబాద్‌ను చూపి, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా ప్రకటన మాత్రం చేసి కూర్చున్నారు. ప్రాంతీయ నాయకులు కూడా బిల్లు కథ ముగిసింతర్వాత ఆలస్యంగా మేల్కొని 7 రకాల ప్రతిపాదనలు సూచించడం కూడా అధికారం ముగించుకుని పోబోతున్న కాంగ్రెస్ చెవులకు ఎక్కబోదని గుర్తించడం అవసరం! 2010లోనే రాజస్థాన్‌కు ‘బుందేల్ ప్యాకేజీ’ ప్రకటించారు. కానీ ఇప్పటికి ఒక్క పైసా కూడా ఆ రాష్ట్రం ఎరగదు! తేలేదేమిటంటే రాజకీయ లబ్ధి కోసం తెలుగు జాతితో భవిష్యత్తులో వీళ్లంతా జూదమాడుతున్నారు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) - ఏబీకే ప్రసాద్