బుందేల్ ప్యాకేజీతో బురిడీ
ఇలాంటి ప్రత్యేక హోదాపై మొదటిగా జాతీయాభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) చర్చించవలసి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం మండలి రాష్ట్రాల ప్రతినిధులతో, ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాతే ప్రకటన వెలువడాలి.
రాష్ట్ర విభజన పేరిట తెలుగు జాతిని చీల్చుతూ ‘ఇరు ప్రాంతాలకూ న్యాయం’ అన్న సూత్రం చాటున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు ‘పేరు పట్టాలు’ మాత్రమే. ఆ పట్టాలే - ‘ఆంధ్రప్రదేశ్’, ‘తెలంగాణ’. నాలుగు స్థానాల కోసం ఒక వైపున బీజేపీతోను, మరో వైపున తెలుగుదేశంతోను కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయింది. దక్షిణ భారతంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిమితులలోనే అయినా అభివృద్ధి పటంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ను విభజన పేరుతో సమస్యలలోకి, దీర్ఘకాలిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ విషయంలో జరిగింది కూడా సాధికారత, విలువలూ లేని ‘మూజువాణి’ ప్రకటన తప్ప, విభజనానంతర సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను బిల్లులో చూపలేదు. ఈ క్షణానికి ఉన్న పరిస్థితిని బట్టి ఉభయ ప్రాంతాలకూ కోరుకున్నది రాదు. ఉన్నదానికి రక్షణ లేదు.
ఈ గందరగోళంలో ఏ ప్రాంత ప్రజలకైనా చాలాకాలం వరకు సుఖశాంతులు ఆశించలేం. ‘మాకు కలిగిన అద్భుత ప్రయోజనం ఇది’ అన్న భరోసా ఆ బిల్లు ఈ రెండు ప్రాంతాల వారికి కూడా ఇవ్వడం లేదు. విభజనకు తోడ్పడిన పాలక పక్షానికీ, అందుకు వత్తాసు పలికిన జాతీయ, ప్రాంతీయ పక్షాలు బీజేపీ, తెలుగుదేశం సాధించగలిగినది ఇంతమాత్రమే అయితే, ఉభయ ప్రాంతాలతో కూడిన యావత్తు తెలుగుజాతి భవితవ్యం నట్టేట మునిగినట్టే. దారి తప్పిన నాయకుల వల్ల, పాలకుల వల్లా రేపు రెండు ప్రాంతాలలోను సంభవించబోతున్నది ఇదే. ‘విభజన’, ‘చీలిక’ జరిగినది నా ప్రభావంతో అంటే, కాదు నా ప్రభావం ఫలితమేనని వికృతానందం పొందుతున్న నాయకులందరి మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఎలా చోటు చేసుకుందో, అది ఏ రూపంలో సాధ్యమైందో ‘ది హిందూ’ ఢిల్లీ ప్రతినిధి గార్గీ పర్సాయ్, పార్లమెంటులో చూసిన దృశ్యాల ఆధారంగా తన వార్తాకథనంలో కళ్లకు కట్టాడు.
బుందేల్ బులబాటం
ఇలాంటి నేతలంతా తెలుగుజాతిని ఎలా నిట్టనిలువునా ముంచగలరో తెలుసుకోవాలంటే, తాజా ఉదాహరణ చూడాలి. విభజన బిల్లుకు ముక్కూ మొహం లేవు. అలాగే, సీమాంధ్రకు ‘బుందేల్‌ఖండ్ తరహా’లో ఐదేళ్ల పాటు ఎవరికీ అందని ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం కూడా అలాంటిదే. ఇది ఎన్నికలలో ప్రయోజనం పొందడానికీ, బుజ్జగించడానికీ, తొమ్మిదికోట్లకు పైబడి ఉన్న తెలుగువారితో ఇచ్చకాలతో కాలక్షేపం చేయడానికీ పార్లమెంటులో చేసిన ప్రకటన మాత్రమే. నాయకులు ఇచ్చేసిన హామీలూ, ప్రకటనలూ బిల్లులో చోటు చేసుకోకుంటే వాటికి చట్టబద్ధత ఉండదు గాక ఉండదు. అనేక బిల్లులనూ, ఇంకా అనేక చట్టాలనూ ఆచరణలో అపహాస్యం పాలుచే సిన సంస్కృతి కాంగ్రెస్, బీజేపీలకు ఉంది. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ ముందుకు తెచ్చిన ‘బుందేల్‌ఖండ్ ప్రయోగం’ వల్లగానీ, కురిపించిన హామీల వర్షానికి గానీ గడ్డిపోచ విలువ కూడా ఉండదు. బిల్లులో ప్రతిపాదించకుండా, నోటిమాటగా ఇచ్చేసిన హామీలను తరువాత గద్దెనెక్కేవారు గౌరవిస్తారనీ, అమలు చేస్తారని నమ్మకమేమీ లేదు. ‘మూజువాణి’ ఆమోదాన్ని అంగీకరించవలసిన అవసరం గానీ, చట్టబద్ధత లేని ఉత్తుత్తి కేటాయింపులని పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం గానీ తమకు లేదని రాబోయే సర్కార్లు చేతులెత్తేస్తే తెలుగు వారంతా తలలు ఎక్కడ పెట్టుకోవాలి? మనకి యూపీఏ కల్పించిన దుస్థితి ఇది. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నేతలతో (వెంకయ్యనాయుడు సహా) సాగించిన లోపాయికారీ మంతనాల ద్వారా యూపీఏ ప్రభుత్వం చేసిన నిర్వాకం సరిగ్గా ఇందుకు సంబంధించినదే.
ఆ ప్యాకేజీ రాజ్యాంగ విరుద్ధం
కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ చేత ‘బుందేల్‌ఖండ్’(ప్రత్యేక ప్రతిపత్తి) ప్యాకేజీని సీమాంధ్ర కోసం ప్రకటింప చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ అలా ప్రకటించే హక్కు ఉంటే గింటే ప్రధానికే ఉంటుంది. కానీ మొదట సోనియా ఆ ప్యాకేజీని ప్రకటించారు. తరువాత ప్రధాని మన్మోహన్ వల్లించారు. కానీ ఆ ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఐదేళ్లు ఉంటుందని బిల్లులో కాకుండా ప్రధాని నోటి మాటగా ప్రకటించడం కూడా రాజ్యాంగ బద్ధం కాదు.
ఇదంతా ఉల్టా రాజకీయం. ఇలాంటి ప్రత్యేక హోదాపై మొదటిగా జాతీయాభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) చర్చించవలసి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం మండలి రాష్ట్రాల ప్రతినిధులతో, ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాతే ప్రకటన వెలువడాలి. ఎన్‌డీసీకి ప్రధాని అధ్యక్షుడు అయి ఉండవచ్చు. అయినా ఇలాంటి ప్రతిపాదన మీద మండలి ఆమోదం తరువాతే ప్రకటన చేయాలి. కాబట్టే రాజ్యాంగ బద్ధత లేని ఈ వ్యక్తిగత స్థాయి ప్రతిపాదనకు విలువ లేదు. ఎన్‌డీసీ నియమ నిబంధనల మేరకు ఇది సీమాంధ్రకు వర్తించే అవకాశం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నియమ నిబంధనలను సవరించే హక్కు కూడా ఎన్‌డీసీకే పరిమితం.
అది కొండ ప్రాంతాలకే
అలాంటి ‘ప్రత్యేకప్రతిపత్తిని’ ఏ రాష్ట్రానినైనా కల్పించడానికి పాటించాల్సిన నియమాలు - కొండప్రాంతాలుగా, అననుకూలమైన(టైర్రైన్), చేరుకోవడం కష్టమైన ప్రాంతాలుగా ఉండాలి. జనసాంద్రత తక్కువగా ఉండాలి. గిరిజన, ఆదివాసీ ప్రాంతాలై ఉండాలి. దేశ సరిహద్దులలో వ్యూహాత్మకంగా కీలకమై ఉండాలి. ఆర్థికంగానూ, మౌలిక సదుపాయాలలోనూ, వెనుకబడి ఉండాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ హోదాకు రాష్ట్రాలు అర్హమవుతాయని కేంద్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ(9-3-2011) స్పష్టం చేసింది.
కానీ, ఈ ప్యాకేజీని కూడా తన జేబులోని వస్తువు మాదిరిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తన చుట్టూ తిరుగుతున్న 17 మంది సీమాంధ్ర ఎంపీలకు ‘హామీ’ రూపంలో ప్రకటించేశాడట . ప్రధాని సీమాంధ్రకు ప్రకటన మాత్రంగా చెప్పిన పన్ను మినహాయింపులు కూడా బిల్లులోకి ఎక్కలేదు. సీమాంధ్ర 13 జిల్లాలకు వర్తించాల్సిన ‘బుందేల్‌ఖండ్’ ప్యాకేజీ సాధికారిత లేని, చట్టబద్ధం కాని ‘ప్రత్యేక ప్రతిపత్తి’గానే మిగిలిపోకతప్పదు! ఇక నోటిమాటగా కేంద్రం ఇస్తానన్న ‘90 శాతం గ్రాంటు’ ప్రతిపత్తి కూడా నీటి మీది రాతగానే ఉండిపోవచ్చు. బహుశా ఈ బాదరబందీ వల్లనే విభజన ప్రక్రియ మూడు నెలల తర్వాతనే సాధ్యపడుతుందనీ, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి షిండే చావుకబురు చల్లగా వదిలాడు! ఈ విషయంలో రాజకీయ పక్షాలు, అభ్యర్థులు చట్టబద్ధత లేని హామీలు ఇస్తే చర్యలుంటాయని ఎన్నికల కమిషన్ హెచ్చరించినందువల్ల కూడా విభజన ఇప్పటికి ఆగి ఉండవచ్చు.
కుమ్మక్కుకు సంకేతం
రాజ్యసభలో బిల్లుపై చర్చించినట్లు సభ్యులు నటించిన సందర్భంలో వెంకయ్యనాయుడు ‘ఇంతవరకు మీరు చేయండి! ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక మిగతా హామీలు నెరవేరుస్తుం’దని కుమ్మక్కులో భాగంగానే ప్రకటించారు. ఇంతకీ బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్రతిపత్తిని కాంగ్రెస్ ఎందుకు భుజాన వేసుకుంది? బుందేల్‌ఖండ్ రూపురేఖలే వేరు. దానికి ప్రతిపత్తి ప్రతిపాదన బీజేపీది. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య పదమూడు జిల్లాల భూభాగంలో ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నవి ఆరు జిల్లాలే. 70,000 చ. కి. మీ. మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంత జనాభా రెండు కోట్ల, పది లక్షలు. ప్రణాళికా సంఘం గుర్తించిన కరువు జిల్లాలో ఇక్కడి పదమూడు జిల్లాలు ఉన్నాయి.
దీనికి ఉన్న ప్రతిపత్తిని తీసుకువచ్చి బీజేపీ చెప్పింది కదా అని ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపజేయాలనుకోవడం కాంగ్రెస్ తను తీసుకున్న గోతిలో తాను పడడమే. తెలంగాణ ప్రాంతాన్ని కూడా హైదరాబాద్‌ను చూపి, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా ప్రకటన మాత్రం చేసి కూర్చున్నారు. ప్రాంతీయ నాయకులు కూడా బిల్లు కథ ముగిసింతర్వాత ఆలస్యంగా మేల్కొని 7 రకాల ప్రతిపాదనలు సూచించడం కూడా అధికారం ముగించుకుని పోబోతున్న కాంగ్రెస్ చెవులకు ఎక్కబోదని గుర్తించడం అవసరం! 2010లోనే రాజస్థాన్‌కు ‘బుందేల్ ప్యాకేజీ’ ప్రకటించారు. కానీ ఇప్పటికి ఒక్క పైసా కూడా ఆ రాష్ట్రం ఎరగదు! తేలేదేమిటంటే రాజకీయ లబ్ధి కోసం తెలుగు జాతితో భవిష్యత్తులో వీళ్లంతా జూదమాడుతున్నారు.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
- ఏబీకే ప్రసాద్