‘రెండుకళ్ల’కు తోడు ‘రెండుకాళ్లు’! | Senior Journalist ABK Prasad Analysis on Andhra Pradesh Bifurcation Issue | Sakshi
Sakshi News home page

‘రెండుకళ్ల’కు తోడు ‘రెండుకాళ్లు’!

Published Wed, Aug 21 2013 2:00 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

‘రెండుకళ్ల’కు తోడు ‘రెండుకాళ్లు’! - Sakshi

‘రెండుకళ్ల’కు తోడు ‘రెండుకాళ్లు’!

విశ్లేషణ: ‘‘కాలచక్రాన్ని పాచిపట్టిన పాత పద్ధతులకు మళ్లిద్దామా? చప్పన్నారు రాజ్యాల్లాంటి చిన్నచిన్న రాష్ట్రాలకు, సంస్థానాధీశుల ఇలాకాలకు మళ్లీ మరలిపోదామా? మళ్లీ వెనుకడుగు వేద్దామా?  కేవలం వెనుకబాటుతనం పేరిట రాష్ట్ర విభజనను ఎవరూ కోరుకోజాలరు. నేను ఇది వరకు  కూడా చెప్పాను- కేవలం వేర్పాటు గురించి మాట్లాడినంత మాత్రాన వెనుకబాటుతనం అనే సమస్య పరిష్కారం కాదు, కాదు అని! వేర్పాటు ధోరణి మరో పెద్ద సమస్యకు దారితీస్తుంది’’ - ఇందిరా గాంధీ
 
 ప్రదక్షిణలు చేస్తే మంచి బిడ్డలు పుడతారని తలమాసిన వాళ్లె వరో చెబితే, మంచి మనసుతో నమ్మిన ఓ పిచ్చితల్లి, చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందని పెద్దలు అంటుంటారు! ప్రస్తు తం రాష్ట్ర ‘విభజన’, ‘సమైక్యత’ సమస్యలను పరిష్కరించలేక సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టాన దేవత సోనియాగాంధీ స్థితీ, కేసుల నుంచి బయట పడేందుకు తంటాలుపడుతూ ‘విభజన’ విష యంలో కాంగ్రెస్‌కు పరోక్షంగా వత్తాసు పలుకుతున్న ‘టీడీపీ’ అధినేత చంద్రబాబు పరిస్థితీ ఆ సామెతలాగానే ఉంది! ఎందుకంటే, రాజకీయ నిరుద్యోగులతోపాటు, ‘విభజన’ సమస్య తలెత్తినప్పటి నుంచీ రాష్ట్రంలో అంత ర్భాగంగా ఉన్న రెండు ప్రాంతాలూ (కోస్తాంధ్ర, తెలంగా ణలు) తనకు ‘రెండు కళ్లు’ అని ఆది నుంచీ చెప్పిన ‘దేశం’ అధినేత చంద్రబాబు మధ్యలో బాణీ మార్చి కేవలం వ్యక్తి గతంగా తన మెడ మీద ‘కత్తుల్లా’ వేలాడుతున్న కేసుల నుంచి ఎలాగోలా తెములుకునే ప్రక్రియలో భాగంగా తరవాత తన ‘రెండు కళ్లల్లో’ ఒకదానికి ‘శుక్లాలు’ మొలి పించేశారు!
 
 కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విభజన సమస్యకు ‘తుది రూపం’ ఇవ్వడం ద్వారా రానున్న జనరల్ ఎన్నికల్లో ‘ఓటు-సీటు’ నిష్పత్తి ద్వారా నీటుగా అనుకూల ఫలితం పొందవచ్చునని సోనియా భ్రమపడ్డారు! కాని క్రమంగా రెండు ప్రాంతాల్లోనూ అలజడులు తగ్గకపోగా పెరుగుతు న్నాయి. ఫలితంగా తాను కాంగ్రెస్‌కు ఆశించిన స్థానాలు దక్కే అవకాశాలు నెమ్మదిగా సన్నగిల్లిపోవడంతో సోని యాగాంధీ వ్యూహాన్ని మార్చినట్టు వార్తలు వెలువడ్డాయి. రెండు ప్రాంతాల్లో ఎలాగోలా కాంగ్రెస్‌ను తిరిగి అధికారం లో ప్రతిష్టించడం ద్వారా కొడుకు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాగల అవకాశాలను పెంచడం సోనియా ప్రధాన లక్ష్యమైనట్టు స్పష్టమవుతోంది!
 
 అందుకే చంద్రబాబు ‘రెండుకళ్ల’ సిద్ధాంతానికి తోడుగా సోనియా ‘రెండుకాళ్ల’ సిద్ధాంతాన్ని రూపొందిం చుకున్నట్టుంది! అంటే, ఒక కాలును ‘తెలంగాణ కాం గ్రెస్’ బోటులో, మరొక కాలును ‘సీమాంధ్ర కాంగ్రెస్’ బోటులో పెట్టి రెండుచోట్లా లబ్ధిపొందడానికి ఆలోచన చేసినట్టు వార్తలు! అంటే, అటు ‘సోనియా బోటు’కు దీటుగా ఇటు సీమాంధ్రలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ‘ఇందిరా బోటు’ను ఎన్నికల సమర జలాలలోకి దించబోతున్నారట! ‘‘రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమై క్యాంధ్ర ఉద్యమం విరుచుకుపడి ముందుకు సాగుతుం డటంతో’’ కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకులతోనే ‘ఇందిరా కాంగ్రెస్’ పేరిట పార్టీ దుకాణం తెరిపించి కాంగ్రెస్‌ను బతికించాలనీ, ఒకవేళ విభజన అంటూ జరిగితే కోస్తాంధ్ర ‘ఇందిరా కాంగ్రెస్’ను అప్పుడు తిరిగి తెలంగాణలోని సోనియా ‘బోటు’తోపాటు, కాంగ్రెస్ ఖాతాలోకి సాధికా రికంగానే కలిపేసుకోవచ్చుననీ కాంగ్రెస్ అధిష్టానం ఎత్తు గడ పన్నుతున్నది.
 
 చిత్తశుద్ధి లేని ఇంతటి విన్యాసాలు ఆమె సాహసించ డానికి కారణం - కొలది రోజుల నాడు వచ్చిన జాతీయ స్థాయి సర్వేక్షణలన్నీ ‘‘ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడవలసివస్తుందనీ, రాష్ట్రాన్ని విభ జించినా, విభజించకపోయినా ఈ ఓటమిని కాంగ్రెస్ చవి చూడకతప్పద’’నీ స్పష్టం చేయడమే! అందుకు పన్నిన కొత్త ‘చిట్కా’యే కోస్తాంధ్రలో ‘ఇందిరా కాంగ్రెస్’ పార్టీని ఆగమేఘాల మీద ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన! అక్కడ, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలనే తహతహే ఇందుకు కారణం.
 
 ఇందిరాగాంధీ వైఖరికి, సోనియా వైఖరికి దివికీ భువికీ మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా దేశంలో ఏర్పడి స్థిరత్వం పొందిన తెలు గుజాతిని విచ్ఛిన్నం చేయడానికి సుతరామూ ఇష్టపడక, దేశ సుస్థిరతకు ఏక జాతిగా ఏక భాషా ప్రాతిపదికపైన ఏర్పడిన రాష్ట్రాల సమైక్యతను, ప్రజల సంఘీభావాన్నీ చెక్కు చెదర్చరాదని 1972 నాటి పార్లమెంటులో రెండో అభిప్రాయానికి తావులేకుండా తెగేసి చెప్పిన ఘనత ఇంది రాగాంధీది! కనుక, తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలి, విడిపోతే అందరం చెడిపోతామన్న నినాదంతో సీమాం ధ్రలో పెల్లుబుకిన సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు అను కూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతోనే, విభజనను వ్యతి రేకించిన ఇందిరాగాంధీ పేరిట కోస్తాంధ్రలో పార్టీ ఏర్ప డితే ఇందిరపై ప్రేమాభిమానాలతో ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్‌ను విజయపథం వైపు నడిపిస్తారని సోనియా కాంగ్రెస్ ఆశ.
 
 కానీ కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ‘ద్విదళ బీజం’! ఒకవైపున ఒక ప్రాంతంలో రాష్ట్ర ‘విభజన’కు స్వార్థ ప్రయోజనాలతో జెండా ఊపుతూ, మరొక వైపు అందుకు విరుద్ధమైన ప్రతిపాదన ద్వారా తెలుగు జాతి సమైక్యతను కాపాడి విశాలాంధ్ర ప్రగతిని కోరుకున్న ఇందిరా కాంగ్రెస్ పేరిట వేరే ‘దుకాణం’ తెరవాలని కోడలమ్మ సోనియా ‘జెండా’ ఊపటం ఏ రాజనీతి కిందికి, ఏ రకం రాజకీయం కిందికి వస్తుందో ‘రెండు నాల్కల’ ధోరణిలో పడిపోయిన సోనియా కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాలు చూసే ‘సత్తరకాయ’ (ఇన్‌ఛార్జి) అయిన దిగ్విజయ్‌సింగ్ లాంటి వాళ్లకే తెలియాలి!
 
 భాషాప్రయుక్త రాష్ట్ర సమైక్యతను తన పాలనలో ఇందిర చెదరగొట్టలేదు! ఆవిడ, కావాలని కాలికి అంటిన పేడను నెత్తికి పులుముకున్న నాయకురాలు కాదు! ఇందిరాగాంధీ రెండు కళ్లతో దర్శించిందీ, చూసిందీ ఒక్క పరిణామాన్నే - అదే ఆంధ్రప్రదేశ్ సమైక్యత, యావత్తు తెలుగు జాతి అవిచ్ఛిన్నమైన, అప్రతిహతమైన జమిలి పురోగతిని మాత్రమే! అందుకనే, ఎప్పటికీ మరవలేని సందేశాన్ని, హెచ్చరికగా, గుణపాఠంగా ఇందిరాగాంధీ 1972 నాటి పార్లమెంటు నిండు సభలో విభజనోద్యమాల పూర్వరంగంలో చేసిన ఆర్ద్రమైన ప్రకటనను, ఆప్తవాక్యాలను మరొక్కసారి తెలుగు వారందరూ, దారితప్పిపోతున్న రాజకీయపక్షాల నాయకులూ జ్ఞాపకం చేసుకోవడం అవసరం.
 
 ఇందిర మాటల్లోనే - ‘‘వెనుకబడిన ప్రాంతాలులేని రాష్ట్రం దేశంలో ఒక్కటి కూడా లేదు. తరతమ భేదాలతో వెనుకబడిన ప్రాం తాలూ, అభివృద్ధి చెందిన ప్రాంతాలున్న అన్ని రాష్ట్రాల లోనేగాక ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో అలాంటి ప్రాంతాలు రాయలసీమ, శ్రీకాకుళం జిల్లా ల్లోనూ ఉన్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతం కూడా వెనుకబడి ఉండటంతో పాటు అదే ప్రాంతంలోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చు కున్నప్పుడు వెనుకబడి ఉన్నంత మాత్రాన ఎక్కడికక్కడ వేరుపడిపోవాలనడం హేతుబద్ధమైన కారణం కాదు.
 
 అలాంటి కారణంపై ఆధారపడి వెనకాముందు చూడ కుండా తీవ్రమైన నిర్ణయాలకు రాకూడదు. అలా అయితే ఈ ప్రక్రియకు అంతం ఎక్కడ? ఇలాంటి విషయాల్లో ఎక్కడ గిరిగీసుకుని కూర్చోవడం? ఈ లెక్కన ఒకే రాష్ట్రం లోని ప్రతి ఒక్క జిల్లా తాము వేరుపడి ఉండాలని కోరుకో గలదా? కాలచక్రాన్ని పాచిపట్టిన పాత పద్ధతులకు మళ్లి ద్దామా? చప్పన్నారు రాజ్యాల్లాంటి చిన్నచిన్న రాష్ట్రాలకు, సంస్థానాధీశుల ఇలాకాలకు మళ్లీ మరలిపోదామా? మళ్లీ వెనుకడుగు వేద్దామా? కేవలం వెనుకబాటుతనం పేరిట రాష్ట్ర విభజనను ఎవరూ కోరుకోజాలరు.
 
 ‘‘నేను ఇది వరకు కూడా చెప్పాను- కేవలం వేర్పాటు గురించి మాట్లాడినంత మాత్రాన వెనుకబాటుతనం అనే సమస్య పరిష్కారం కాదు, కాదు అని! వేర్పాటు ధోరణి మరో పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఆ సమస్య ఇతర రాష్ట్రాలకే కాదు, ఏ ప్రాంతంలో అయితే ఆ వేర్పాటు వాదం తలెత్తుతుందో ఆ ప్రాంతానికో, ఆ రాష్ట్రానికో మరో పెద్ద సమస్యగా మారుతుంది. నా కట్టుబాటు సమైక్య రాష్ట్రానికే. మీరేదో వేరుపడి పోయినంత మాత్రాన మిగతా ప్రజల్ని వదిలించుకోవచ్చునని భావించడంగానీ లేదా వేర్పాటు సమస్య తీరిపోయిందని భావించడంగానీ కేవలం పసలేని ఆలోచన, నిరుపయోగమైన వాదన... ఆంధ్రప్రదేశ్ అనేక వేల ఏళ్లుగా విలక్షణమైన, విశిష్టమైన సాంస్కృతిక శక్తిగా ఉంటూ వచ్చింది.
 
 ఆంధ్రదేశం పేరు అతి ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలోనే ఉంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రూపంలో ఉన్న భాగాలన్నీ చరిత్రలోనూ దీర్ఘకాలం పాటు ఒకే గొడుగు కింద ఉన్నాయి. భాషా రాష్ట్రాల సమస్య మన జాతీయోద్యమంలో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. వాస్తవం నుంచి వెనక్కి మళ్లే సమస్యే లేదు. వెనక బ్రిటిష్ ప్రావిన్సెస్‌లో విభిన్న ప్రాంతాలు ఉండి ఉండవచ్చు, కాని ఆ నాటి ప్రతీ ప్రావిన్షియల్ యూనిట్టూ భాషా ప్రాతిపదికపైనే ఉండేదని మరవరాదు. వివిధ రాష్ట్రాల ఆవిర్భావంలో మొత్తం మీద కనిపించేది హేతుబద్ధమైన ఏర్పాటే. అందువల్ల తాత్కాలిక భావో ద్రేకాలకు లోనైపోయి ఈ హేతుబద్ధమైన భాషాప్రయుక్త రాష్ట్రాల పునాదిని కూల్చకుండా అత్యంత జాగరూకతతో ఉండాలి’’ అని ఇందిర హెచ్చరించారు!
 
 నేటి కాంగ్రెస్ నాయకత్వం రాజకీయ నిరుద్యోగుల నినాదాలకు తలొగ్గి వాటికి ‘లాభ లబ్ధి’ కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చురేపుతోంది. ఇది ఆ పార్టీకి, తాత్కాలికంగా అది ఆధారపడుతున్న, ప్రజల మధ్య ‘సౌరు’ కోల్పోయిన కొన్ని ప్రతిపక్షాలకూ, వాటిలో అక్షరాస్యులైన మూర్ఖులకూ పిడుగుపాటుగా మారకముందే తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను ఇప్పటికైనా శరణు వేడుకోవటం అవ శ్యం జరగాల్సిన పని! ‘విభజించి-పాలించే’ సామ్రాజ్య వాద దుర్నీతికి శాశ్వత దాఖలాలుగా చరిత్రలో పాఠాలుగా నిలిచి పోయినవీ, ఈ రోజుకీ తేరుకోలేనివీ - పునరేకీకరణ జరిగిన ఒక్క వియత్నాం మినహా రెండు జర్మనీలు, రెండు కొరియాలు, బదాబదలైన యుగోస్లావియా విభజన!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement