‘‘సార్స్ అంటువ్యాధి సార్స్–కోవిడ్‌గా కరోనా వైరస్ రూపంలో చైనాలోని వూహాన్ వైరాలజీ పరిశోధనా సంస్థ నుంచే పుట్టుకొచ్చిన చైనీస్ వైరస్సేననీ, ఇది జీవాయుధమేననీ, దానిని యుద్ధ ప్రయోజనాల కోసమే చైనా సృష్టించిందనీ సాగుతున్న ప్రచారం పచ్చి అబద్ధపు ప్రచారం. 2020 జనవరి 26న అమె రికా పత్రిక ‘వాషింగ్టన్ టైమ్స్’లో ప్రచురించిన ఈ ప్రచార వ్యాసానికి ఆధారం ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకడు చేసిన ఈ ఆరోపణయే. కానీ ఆ వెనువెంటనే మార్చి 17న కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్క్రిప్స్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త క్రిస్తియన్ ఆండర్సన్, ప్రొఫెసర్ లాన్ లిప్కిన్ రెండవ సార్స్ వ్యాధి రూపంలో వచ్చిన కరోనా వైరస్ చైనా పరిశోధనా గారం సృష్టి ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ఏ వ్యాధి అయినా జంతుజాలం నుంచి బయటకు బదిలీ అయ్యేముందు ఆ జంతువు అంతకుముందు ఏ పరాశ్రయ జీవిపై ఆధారపడిందో దాని ఫలితంగా బదిలీ అవుతుంది కాగా, సదరు జంతు జాలం నుంచే స్వభావసిద్ధంగా (నేచురల్ సెలక్షన్) మానవులకు వ్యాధి సంక్రమిస్తూంటుంది’’. – అనంత కృష్ణన్ (ది హిందూ: 27–04–2020)
అబద్ధాల అంకయ్యకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఉబుసుపోకకు పుట్టింది కాదు, ఆ సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లను చూసే ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి సుమారు గత ఎనిమిది శతాబ్దాలుగా ప్రపంచాన్ని కకావికలు చేసి కోట్లాది మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఫ్లూ, ప్లేగు, క్షయ, న్యూమోనియా, సార్స్, ఎబోలా ఇత్యాది వైరస్‌ల మాదిరే పుట్టుకొచ్చిన ఉగ్రవ్యాధి. అయినా ట్రంప్ అంటువ్యాధుల వ్యాప్తికి ఒక జాతినో, ఒక దేశాన్నో, మానవాళిలో ఒక భాగాన్నో, ఒక ప్రభుత్వాన్నో కారణంగా వివక్ష చూపడానికి ప్రత్యేక కారణం ఉంది. అది– నేటి ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయం గానూ, నైతికంగానూ హోరాహోరీగా పోటీ కొనసాగుతోంది. ఒక వ్యవ స్థకు అంటే నయావలస సామ్రాజ్య పాలనా వ్యవస్థకు అమెరికా నాయకత్వం వహిస్తుండగా, మరొక వ్యవస్థకు ఆ వలసపాలనా దోపిడీ వ్యవస్థలపై ఎదురు తిరిగి విప్లవం ద్వారా, త్యాగాల ద్వారా ప్రజా బాహుళ్యం అండతో సోషలిస్టు వ్యవస్థను స్థాపించుకుని రక్షించుకుం టున్న నవచైనా నాయకత్వం వహిస్తోంది. ఈ సంకుల సమరం ఇప్ప టితో ఆగేది కాదు.
ప్రజాహిత వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకోదలిచిన సోషలిస్టు వ్యవస్థకు తన ప్రజల్ని తానే చంపుకునేందుకు శాస్త్ర పరిశోధ నాగారాల్లో చేజేతులా ఒక వైరస్‌ను పనిగట్టుకుని సృష్టించుకోదు. కానీ జాతుల్ని, వ్యవస్థల్ని ధ్వంసం చేయడం ద్వారా, పీడన ద్వారా వలస పాలనా దోపిడీ వ్యవస్థను, దురాక్రమణల ద్వారా దేశాల సంపదను కొల్లగొట్టే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోజూసే పాలక వర్గాలకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఒక కూసువిద్య. కరోనా వ్యాప్తి సందర్భంగా ఆ వ్యాధి వెనక దాగి అలాంటి వ్యాధుల్ని జీవాయుధాలుగా లేబొరేటరీల్లో సృష్టించుకోవచ్చుననీ, ఒక రహస్య కృత్రిమ ప్రయోగం ద్వారా ఇటీవలనే ప్రపంచం కళ్లు కప్పి అమెరికా సామ్రాజ్యపాలక యుద్ధోన్మాదులు ప్రయత్నించారనీ సుప్రసిద్ధ అమెరి కన్ మేధావి, ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, సామాజిక వ్యవహారాల నిశిత పరిశీలకుడైన ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ కొద్దిరోజుల నాడే బయట పెట్టారు. కొన్ని రోజులపాటు ప్రపంచ వెబ్‌సైట్లలో వైరల్‌గా మారిన ఆ వార్తను కొలది రోజులనాడు అమెరికా ఒత్తిడి పెట్టి తొలగింప చేసుకు న్నట్లు తాజా వార్తలు. ఇంతకూ ఆ రహస్య ప్రయోగానికి తగిలించిన ముద్దుపేరు ‘ఈవెంట్ 201’ (‘ఘటన 201’) చైనాలో కరోనా వ్యాధి గురించిన వార్త వ్యాప్తి కావడానికి 2020వ సంవత్సరానికి ముందర, అంటే 2019 అక్టోబర్‌లోనే, కరోనా లాంటి మహమ్మారి వ్యాధి అలు ముకోవడానికి అనువైన అంతే లక్షణాలను కృత్రిమంగా భారీ ఎత్తున సృష్టించడం గురించిన కృత్రిమ శాస్త్ర ప్రయోగాన్ని లేబొరేటరీలో అమె రికా నిర్వహించింది.
ఆ ప్రయోగానికే ఈవెంట్ 201 అని పేరు పెట్టారు. దీన్ని నిర్వ హించినవారు ప్రపంచ మహా కోటీశ్వరుడైన అమెరికన్ బిల్‌గేట్స్ (బిల్ అండ్ మెలిండా) ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాన్స్ హాస్కిన్స్ ఆరోగ్య భద్రతా కేంద్రీయ సంస్థ! నిజానికి కరోనా వైరస్ మహ మ్మారిని తలెత్తకుండా నివారించవచ్చని, నివారించగల్గినంత సమా చారం లేకపోలేదనీ ప్రొఫెసర్ చామ్‌స్కీ చెబుతూ ఇలా వ్యాఖ్యానిం చారు: ‘అయినా, ఎలాంటి ప్రయత్నమూ అందుకు జరగలేదు. పైగా కరోనా సంక్షోభం రాజకీయ వ్యవస్థల విద్రోహంవల్ల మరింత తీవ్రరూపం దాల్చింది. తమకు తెలిసిన, అందుబాటులోనే ఉన్న వ్యాధి వ్యాప్తి నిరోధక సమాచారంపైన రాజకీయ వ్యవస్థలు శ్రద్ధ పెట్టలేదు’. కాగా, చైనాలో న్యుమోనియా వ్యాధి లక్షణాలుగా కనిపి స్తున్నా, దాని పుట్టుపూర్వోత్తరాలు మాత్రం తెలవడం లేదని చైనా ప్రభుత్వం 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమా చారం అందించింది. ఆ తర్వాత వారం రోజులకు చైనా శాస్త్ర వేత్తలు ఈ అజ్ఞాత వ్యాధిని కరోనా వైరస్‌గా గుర్తించగలిగి, వెంటనే దాని లక్షణాలను వడపోసి మరీ ప్రపంచానికి సంబంధిత సమాచా రాన్ని అందించారు.
సరిగ్గా ఈ దశలోనే ట్రంప్ రోజుకో మాట వదులుతూ వచ్చారు. ‘అబ్బే’ సంక్షోభం ఏమీ లేదు, కరోనా, ఫ్లూ లాంటిదే అని ఒకరోజు, ఆ మరునాడే ‘ఇది పెద్ద సంక్షోభమే సుమా, నాకెప్పటినుంచో తెలుసు’ అనీ, ‘మన వ్యాపకాలు మనం చూసుకుందాం, నేను ఏమైనా సరే రేపటి ఎన్నికలు గెలవాలి’ అనీ ట్రంప్ పేలుతూ వచ్చాడు. అందుకే చామ్‌స్కీ ‘ఇలాంటి బాపతు నాయకుల చేతుల్లో ప్రపంచం మనగల గడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది. అంతేగాదు ఆయన ట్రంప్‌ని ‘బుద్ధిజాడ్య జనితోన్మాది, సంఘవిదూషకుడు’ (సైకోపతిక్ బఫూన్) అని విమర్శించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మానవాళిని ట్రంప్, అతని ‘ఛోటా’లూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారనిపిస్తోందనీ, నేడు మనల్ని రెండు రకాల భీకర ప్రమాదాలు–అణ్వస్త్ర యుద్ధ ఛాయలు, అదుపుతప్పిన వాతావరణ కాలుష్యంతో మంటల కుంపటిగా మారు తున్న భూతలమూ వెంటాడుతున్నాయని హెచ్చరించారు. కరోనా వల్ల ప్రమాదాలను ఇవాళ కాకపోతే రేపైనా అదుపు చేసుకోగల అవ కాశం ఉంది. కానీ, ఇతర ప్రమాదాలనుంచి కోలుకోవడం ఉండదు.
2019 అక్టోబర్ 18–27 మధ్య ఏం జరిగింది?!
ఈ తేదీల్లోనే వూహాన్(చైనా) నగరంలో ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో వంద దేశాల నుంచి వచ్చిన సైనికు లతోపాటు 300 మందికి పైగా అమెరికన్ సైనికులూ పాల్గొన్నారు. ఆ తర్వాత సరిగ్గా రెండు వారాలకే వూహాన్‌లో మొట్టమొదటి కోవిడ్–19 కరోనా మహమ్మారి వ్యాధి బయటపడింది. సరిగ్గా ఇది గమనించిన అమెరికా పోర్ట్ డెడ్రిక్ పట్టణంలోని తన సైనిక జీవాయుధ రక్షణ పరిశోధనశాలను కాస్తా అకస్మాత్తుగా మూసేసింది. 2019 అక్టోబర్ 18న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఒక రహస్య సమావేశ ప్రదేశంలో.. కరోనా లాంటి మహమ్మారి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తల పేరిట అదే తరహా వ్యాధి నమూనాతో ‘ఈవెంట్ 201’ ప్రయోగం నిర్వహించారు. ఈ రహస్య సమావేశంలో ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు పెట్టారని ‘ఇన్‌స్టాగ్రామ్’ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ రహస్య సమావేశ ప్రయోగ విన్యాసానికి ఏం పేరు తగిలించారో తెలుసా– ‘ప్రపంచానికి తుది ఘడియలు’ (నౌ ది ఎండ్ బిగిన్స్)!
బిల్‌గేట్స్ ఏర్పాటుచేసిన విలయ తాండవ రహస్య ప్రయోగంలో జిలుగు వెలుగుల కరోనా వైరస్ ఆటబొమ్మ సహాయంతో (ప్లష్ టాయ్) రాగల వినాశనాన్ని చూపాడు. అందులో కొద్ది మాసాల్లోనే ఎలా వేలకు వేలుగా ప్రజలు నేలకు ఒరిగిపోతారో చూపిస్తాడు. అందులో చెప్పిన భయకంపిత వాతావరణాన్ని ఇలా వర్ణిస్తాడు: రేపు మీరు చూడబోయే ‘నవ ప్రపంచ వ్యవస్థ’ ఎలాంటిదంటారు? సంతా నప్రాప్తి వైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా సంతానం లేకుండా చేసి, వంధ్య త్వాన్ని కల్గించి జనాభాను తగ్గించేయడం మైక్రోసాఫ్ట్ అధిపతి కోరిక అని ‘ఎన్‌టీఈబీ’ వెబ్‌సైట్ ప్రచారం. ఇలాంటి ప్రయోగాలకు అవస రమైన ఇంజెక్షన్లు రూపొందించడానికి బడా ఫార్మా కంపెనీలు, బిల్ గేట్స్ చేతులు కలుపుతున్నారని వార్త. ఈ రహస్య ప్రయోగశాలకు (ఈవెంట్ 201) అమెరికా గూఢచారి శాఖ మాజీ అధికారులు, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఫార్మా, పీఆర్‌ఓ సంస్థ ప్రతినిధులూ హాజర య్యారు. ఈ అమెరికా రహస్య ప్రయోగం సఫలమైతే ఆచరణలోకి వస్తే ఏకధాటిన 6 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని అంచనా. నిజానికి అమెరికా ‘లియోటాయిస్’ ఉన్మాదపు యుద్ధ పిపాసను పెంచే పరికరాలు, పిల్లలతో మతిభ్రమింపజేసే ఉన్మాదాన్ని పెంచే పరికరాలు ఇప్పటిదాకా ముక్కుపచ్చలారని పెక్కు మంది చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటూ వస్తున్నవేనని మరవరాదు.
అసలెందుకీ కరోనా వైరస్ సంక్షోభం తలెత్తవలసి వచ్చిందన్న ప్రశ్నకు ప్రొఫెసర్ చామ్‌స్కీ సమాధానం వేరు: ‘ఈ సంక్షోభం మార్కెట్ పరిస్థితుల వైఫల్యంవల్ల బిళ్లదీటుగా విరుచుకుపడిన ఫలితం. మార్కెట్ శక్తుల వైఫల్యం అనేది నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలవల్ల అపరిష్కృతంగా పోగుబడి పేరుకుపోయిన సాంఘిక, ఆర్థిక సమస్యల పర్యవసానమని మరచిపోరాదు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజా రోగ్య రక్షణకు మందులు, వ్యాక్సిన్లు అందవలసినచోట లాభార్జన ధ్యేయంగా ఎదిగే ప్రైవేట్ రంగం వైఫల్యం వల్ల సమస్యలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఉదారవాద ఆర్థిక వ్యవస్థవల్లనే నిరంకుశ పాలనా వ్యవస్థలు బతుకుతున్నాయని మరవరాదు’!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment