మోదీ తంత్రం ‘వాకట్టు’ మంత్రం | modi magic of jucicial department | Sakshi
Sakshi News home page

మోదీ తంత్రం ‘వాకట్టు’ మంత్రం

Published Tue, Aug 25 2015 12:56 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

మోదీ తంత్రం ‘వాకట్టు’ మంత్రం - Sakshi

మోదీ తంత్రం ‘వాకట్టు’ మంత్రం

రెండోమాట
‘సుప్రీం’ వ్యవస్థ అడ్డంకిగా ఉన్నదని భావిస్తున్న బీజేపీ పాలకులు జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. జడ్జీల నియామకాలను కోర్టుకు వదిలిపెట్టకుండా ప్రభుత్వమే ఆ పని నిర్వహించేందుకు ఈ కమిషన్ ఉపకరిస్తుంది.  దీనిని ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నది. ఇందులో వెనుక నుంచి చేతులు మెలిపెట్టే మతలబు ఏదో ఉందని పసిగట్టి ఈ ప్రతిపాదన మీద కేంద్రం నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. పక్షం రోజులకు పైగా వాదోపవాదాలు జరిగాయి. సమస్య ఒక కొలిక్కి రాలేదు.
 
జర్మనీలో హిట్లర్ పాలనతో వీమార్ రిపబ్లిక్ అవసానదశకు చేరుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఏలుబడిలో, ఇందిర హయాంలో దేశ స్వాతం త్య్రానికి ఎమర్జెన్సీతో చేటుకాలం వచ్చింది. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ జోస్యం చెబుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరోసారి దేశాన్ని ఎమర్జెన్సీ రోజులలోకి నడిపిస్తారా? ఏమైనా ఇటీవలి కొన్ని పరిణామాలూ, ఆలోచనలూ, సరికొత్త వ్యూహాలూ, ఎత్తగడలూ అలాంటి జోస్యం నిజం కాగలదనే అనుమానాలను కలిగిస్తున్నాయి. నిజానికి బీజేపీ పాలన ఆరంభం నుంచి అలాంటి శాసనాలు కొన్ని అమలు కాబోతున్నాయా అన్న అనుమా నాలు దేశవ్యాప్త చర్చలలో వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ చేపట్టిన చర్యలే ఇందుకు కారణం. ఆ చర్యలలో ఒకటే, కొలది రోజుల నాడు (23-7-15) కేంద్ర హోంశాఖ జారీ చేసిన ‘వాకట్టు’ మంత్రం. దీనినే ముద్దుగా ఆంగ్లంలో ‘గాగ్ ఆర్డర్’. అంటే వాయి ముడుపు లేదా నోటికీ చేతికీ బంధనం అని విస్తృతార్థం.

అత్యవసర పరిస్థితి వైపే అడుగులు
తొలి ఎమర్జెన్సీ (1975-1977) కాలంలో పత్రికలు, ఇతర ప్రసార మాధ్య మాలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు మౌనం వహించేటట్టు చేయడానికీ, వారిని కట్టడి చేయడానికీ వేసిన ‘చేతబడి’ మంత్రం వంటిదే ఈ కొత్త వాకట్టు మంత్రం కూడా. కొత్త ఉత్తర్వు ఆదేశించేదేమిటి? జర్నలిస్టులు వార్తా సేకరణ కోసం రాజకీయులైన పాలకులతోనే సరిపెట్టుకోకుండా, వివిధ పాలనా శాఖల సీనియర్ అధికారులను సహితం కలసి సమాచారం సేకరించ డానికి ఇక వీల్లేదు. వార్తలు, లేదా ఇతర సమాచారం ఏదైనా ప్రభుత్వం నుంచి ఆశిస్తే మీడియా గదికే అందచేస్తారనీ, ఇందుకు అధికారులను జర్న లిస్టులు ఎవరూ కలుసుకోవడానికి వీలు లేదనీ కొత్త ఉత్తర్వు శాసిస్తున్నది.


వాస్తవం ఏమిటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రులు తరచూ ఎవరికి తోచిన రీతిలో వారు పత్రికలతో ముచ్చటిస్తూ ఉండేవారు. దీనితో దేశ ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ, మతపరమైన విధానాల మీద పార్టీ స్వరూప స్వభావాలేమిటో వెల్లడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను పార్టీలో కూడా కొన్నాళ్లుగా కట్టడి చేస్తున్నారు. కేవలం ముగ్గురే- సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్- పార్టీ ప్రతినిధులుగా వ్యవ హరించారు. కానీ మనసులోని మాట ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో వెలువడక తప్పదు. పలు సందర్భాలలో అదే జరిగింది. పార్టీ సభ్యులను కట్టడి చేయడం కూడా కష్టమైపోయింది. ఫలితంగా సామాజిక, రాజకీయ వ్యవస్థలలో చీలుబాటలకు, అస్థిరత్వానికి కారణం కాగల పరిణా మాలు చోటు చేసుకున్నాయి.


పాలనను మంచి మార్గం పట్టిద్దామన్న కోరిక పాలకులలో కొందరికి ఉన్నదని మనం అమాయకంగా నమ్మినా, దానిని కూడా ఏడాదిన్నర కాలంలోనే వమ్ము చేశారు. చివరికి మోదీ మంత్రివర్గంలో సహాయమంత్రి జితేంద్రసింగ్ కూడా ‘ఈ ఉత్తర్వు అనవసర వివాదం లేవదీసింది’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలపాల్సి వచ్చింది. మరో పక్క పత్రికలను బుజ్జగించడం కోసం ఈ ఉత్తర్వును జారీ చేయడంలో హోం మంత్రి ఉద్దేశం అది కాదు, ఇది అంటూ సమర్థించవలసి వచ్చింది. ఈ ధోరణి, ఉత్తర్వు స్వభావం, అధికార పార్టీ సభ్యుల వ్యవహారసరళి ఎమర్జెన్సీ ప్రకటన వాతావరణానికి చాలా దగ్గరగానే ఉందని గ్రహించాలి. ఇదే కాకుండా ఇతర పరిణామాలను చూసైనా ప్రజాస్వామికవాదులు అప్రమ త్తంగా ఉండవలసిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యలను భగ్నప్రేమికుల ఆత్మహత్యలుగా చిత్రించగలిగిన నాయకులు ఉన్న చోట మొలకెత్తేది పల్లేరు మాత్రమే.


న్యాయదేవతకు మొదలవుతున్న ఆంక్షలు
కాంగ్రెస్-యూపీఏ హయాంలో అనేక అవినీతి బాగోతాలు నమోదైనాయి. దేశ వనరులు, సహజ సంపదను దేశీయ కంపెనీల కన్నా విదేశీ గుత్త పెట్టు బడి సంస్థల దోపిడీ కోసం తలుపులు బార్లా తెరిచిన పాలన అది. ఆ కుంభ కోణాల పాలనను కట్టడి చేయడానికి చొరవతో ముందుకు వచ్చిన దేశ అత్యు న్నత న్యాయస్థానాన్ని సయితం ఇప్పుడు బీజేపీ-ఎన్డీఏ తన అదుపాజ్ఞల లోనికి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థకు ముఖ్యమైన మూడు వ్యవస్థల విధులను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వేదిక ద్వారా ప్రభుత్వం చేసే చట్టాలను సమీక్షించే, భాష్యం చెప్పే అధికారా లను న్యాయ వ్యవస్థకు అదనంగా రాజ్యాంగం ఇచ్చింది. ఆ మేరకు న్యాయ మూర్తుల నియామకాలు, బదిలీల బాధ్యతలు కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ -3 (1.ఎ. బి.) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరమైనాయి.


శాసనకర్తల చేత ‘దేశ సార్వభౌమాధికారాన్నీ, దేశ సమగ్రతనూ’ కాపాడు తామన్న ప్రతిజ్ఞ చేయించే అధికారం కూడా ప్రధాన న్యాయమూర్తి/ న్యాయ మూర్తులకే అప్పగించారు. ఈ బృహత్ బాధ్యతను నెరవేర్చే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాలలో న్యాయమూర్తులు కూడా పరిధులకు మించి వ్యాఖ్యా నాలో, భాష్యాలో వెలువరించి ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన సుప్రీం కోర్టుకు రాజ్యాంగం ద్వారా దఖలు పడిన అధికారాన్నీ, హక్కునూ గుంజు కునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అక్కడికీ ఒక్కొక్కప్పుడు ప్రభుత్వం న్యాయమూర్తిగా నియమించవలసిందని ఎవరిని సూచించినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో పనిచేసే కమిటీ/ కమిషన్ తన నిర్ణ యం మేరకే వ్యవహరిస్తున్నది.


ఎమర్జెన్సీ కాలం నాటి అనుభవాల ప్రకారం చూస్తే దేశంలో పత్రికా, న్యాయ రంగాలు నాటి కేంద్ర ప్రభుత్వ నియంతృ త్వానికి లొంగిపోయాయి. నేర పరిశోధక సంస్థలు సీబీఐ, ప్రత్యేక దర్యాప్తు బృందాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు సహితం నాడు దాసోహమన్నాయి. ఇదే తంతు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు ఆ తరువాత కాలం వరకు కూడా కొనసాగింది. చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్, నిఘా సంఘం (సెంట్రల్ విజిలెన్స్) వరకు కూడా ఈ నీడ కిందకు వచ్చాయి. నిజానికి ఇప్పటికీ మూస పద్ధతిలో మోసాలూ, పలుకుబళ్ల ద్వారా, పీఠాల కోసం అంగలార్చే రాజ కీయాల మూలంగా అదే పంథా కొనసాగుతున్నది. కాంగ్రెస్-యూపీఏ ఏలు బడిలో ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పినట్టు నడచుకున్న సీబీఐ డెరైక్టర్ సిన్హా సుప్రీంకోర్టు జాగరూకతతో పట్టుబడ్డారు. దీనితో కేంద్ర విచారణ సంస్థల పారదర్శకతను ప్రజలు బాహాటంగా చర్చించుకునే దుస్థితికి పాల కులు పరిస్థితిని తెచ్చారు.


న్యాయమూర్తుల నియామకంలో జోక్యం
ఈ నేపథ్యంలోనే ‘సుప్రీం’ వ్యవస్థ అడ్డంకిగా ఉన్నదని భావిస్తున్న బీజేపీ పాలకులు జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. జడ్జీల నియామకాలను కోర్టుకు వదిలిపెట్టకుండా ప్రభుత్వమే ఆ పని నిర్వహించేందుకు ఈ కమిషన్ ఉపకరిస్తుంది. దీనిని ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నది. ఇందులో వెనుక నుంచి చేతులు మెలిపెట్టే మతలబు ఏదో ఉందని పసిగట్టి ఈ ప్రతిపాదన మీద కేంద్రం నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. పక్షం రోజులకు పైగా వాదోపవాదాలు జరిగాయి. సమస్య ఒక కొలిక్కి రాలేదు. అసలు ఈ శషభిషల మధ్య దాగి ఉన్న సమస్య-రాజ్యాంగం 124వ అధికరణం ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’ అని పేర్కొనగా, రాజ్యాంగానికి అనుబంధంగా జోడించిన 3వ షెడ్యూల్ మాత్రం ఆయనను ‘భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి’ అని వ్యవహరిస్తున్నది. ఇప్పుడు కుస్తీ అంతా దీని మీదే- కేంద్ర అధికారాలూ, జ్యుడీషియరీల అధికారాల మీదనే కేంద్రీకృతమైంది.

అనంతమైన అసమర్థత
మిగిలిన విషయాలలో వలెనే, ఉమ్మడి జాబితాలో కేంద్రం చేతివాటం ప్రదర్శి స్తున్నది. రాష్ట్రాల పరిధిని నిర్ణయించి వాటిని అమలు చేయవలసిన కేంద్రం వాటి అధికారాలను మింగచూస్తోంది. పన్నులలో కూడా మెట్టు వాటాను కేంద్రమే హరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా చల్లకోసం వచ్చి ముంత దాచినట్టు మళ్లీ సహకార సమాఖ్య పేరుతో రాష్ట్రాల అధికారాలకే కత్తెర వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎవరో కొందరు అమాయకులను ఉగ్రవా దులుగా ముద్ర వేస్తున్నారు. కానీ వివిధ మతాల ప్రార్థనా మందిరాలు- చర్చిలు, గురుద్వారాలు, మసీదులపై తాము చేస్తున్న అరాచకాలను మాత్రం ఉగ్రవాదంగా గుర్తించలేకపోతున్నారు. ముంబై పేలుళ్ల మీద శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలులోకి తెచ్చి దుండగులను శిక్షించడానికి వెనుకాడిన, గుజరాత్ మైనారిటీల మీద జరిపిన మూకుమ్మడి హత్యాకాండకు బాధ్యులైన పాలకులను, అధికారులను శిక్షించడానికి వెనుకాడిన వ్యవస్థ మనది. ఆ అరా చక చర్యలకు బాధ్యులుగా ముద్రపడి, కేసుల నుంచి తప్పించుకోలేని వారిని కూడా అధికారంలోకి రాగానే అంతా మాఫీ చేసేసిన వ్యవస్థ మనది. ఆయా రామ్, గయారామ్‌ల నిరోధానికి చట్టం ఉన్నా వీటి నిరోధంలో పాలక వ్యవస్థ నపుంసకంగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. స్థలాభావం చేత వీటితో ఆపుతున్నాను.







ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
(వ్యాసకర్త మొబైల్: 9848318414).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement