భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు.
‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023)
గుజరాత్‌లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు.
పరిణామాలకు అద్దం
నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు.
దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది.
స్వతంత్రంగా వ్యవహరించాలి
1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్‌ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్‌ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్‌ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?!
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment