నూతన సాగు చట్టాలపై రైతులు పోరాడుతున్న పరిణామానికి దోహదం చేసిన పాలకులు ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరే కాదు, ప్రపంచబ్యాంక్ సంస్కరణలను తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు టీడీపీ దీనికి ప్రధాన సూత్రధారులని మరువరాదు. 1991లో పి.వి. నరసింహారావు, మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టిన ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను పోటా పోటీలమీద భుజాన వేసుకొని ఆ మార్గంలోనే ముందుకు సాగిన వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం నాయకులు, వాజ్‌పేయ్, చంద్రబాబు. వీరి వారసత్వాన్ని తాను కూడా పాటించాలని నరేంద్రమోదీ కూడా భావించి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు పరిపూర్ణ రూపం ఇవ్వాలని నిర్ణయించుకుని ఎక్కడా రాజీపడకుండా మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఒక్క కలంపోటుతో ముందుకు నెట్టి కూర్చున్నారు!
ప్రపంచ బ్యాంకు, అమెరికా పాలకుల నాయకత్వాన ప్రవేశపెట్టించిన ఆర్థిక విధానాలకు మూలం టెక్నాలజీ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్), కాని ఇందువల్ల జరిగిన ఫలితం– కార్పొరేట్ రంగ బడా బడా మోతుబరి ధనిక రైతులు లాభించారే గాని, పేద, మధ్యతరగతి రైతులు మాత్రం ఉన్న చిన్న కమతాలను కాస్తా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇందువల్ల 1948–2015 సంవత్సరాల మధ్య పేద, మధ్యతరగతి రైతులు 40లక్షల వ్యవసాయ క్షేత్రాల్ని కోల్పోయారు. ఫలితంగా, అధిక లాభాల ద్వారా ప్రపంచ జనాభాను ఆదుకుంటున్నామన్న తృప్తి మోతు బరులకు ఉండొచ్చు గాని ఆచరణలో వ్యవసాయోత్పత్తులను తమ కాయకష్టం ద్వారా పండించే సన్నకారు పేద రైతాంగం భరించే ఉత్పత్తి ఖర్చులు మాత్రం తగ్గిపోలేదు. మా ప్రెసిడెంట్స్ మా వ్యవసాయ మార్కెట్లను అస్థిరం చేయడానికి పాపం చాలా కష్టపడ్డారు. – జాన్ న్యూటన్, అమెరికా వ్యవసాయ సమాఖ్య ప్రధాన ఆర్థికవేత్త
‘‘భారతదేశ రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోనిది. రాజ్యాంగంలోని అధికరణ 246 (3వ సెక్షన్) వ్యవసాయ సంబంధిత చట్టాలను చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ దేశ రైతాంగ ప్రజల విశాల ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను ‘కోవిడ్’ నీడలో పార్లమెంటులో చర్చించకుండానే ఆర్డినెన్స్‌గా ప్రకటించేసింది’’.
– అఖిల భారత స్థాయిలో స్వతంత్ర సంస్థగా ‘కిసాన్ సమాఖ్య 30వ రోజు జాతీయ స్థాయి సత్యాగ్రహం సందర్భంగా చేసిన ప్రకటనస్వతంత్ర భారతంలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని స్థాయిలో 30 రోజులనాడు ప్రారంభమై నేటిదాకా కొనసాగుతున్న ఈ అపర సత్యా గ్రహ దీక్షను విరమింపచేయడానికి ఎన్డీఏ (మోదీ) ప్రభుత్వం ఈ రోజున (డిసెంబర్ 29) ఒక ప్రయత్నం చేస్తోంది. ఇంతకూ అసలు విషయమేమంటే తమ జీవితాల సెక్యూరిటీ కోసం తమ పంటలకు కనీస మద్దతు రేటును నోటిమాటగా కాకుండా చట్టం రూపంలో ఖాయపరచమన్న రైతాంగ కోర్కెను కాస్తా ‘అది మినహా’ అని ప్రధాన మంత్రి భీష్మించి కూర్చున్నారు! ‘ఆర్డినెన్స్ 2020’ పేరిట విడుదలైన మూడు చట్టాలు– రైతులు పండించే వ్యవసాయోత్పత్తులకు వ్యాపార, వాణిజ్య. ప్రోత్సాహక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినవని పాల కులు చెప్పడమే గాని మూడు చట్టాల అసలు లక్ష్యం బట్టబయలై పోయింది. అబద్ధాల్ని.. మరీ పచ్చి అబద్ధాలను దాచలేరు! ఎందు కంటే 1966 సంవత్సరం నాటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టాన్ని మార్కెట్ కమిటీలను నిర్వీర్యపరచడం ద్వారా ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అధికరణ 246, అధికరణ 23, అధి కరణ 14 లకు వ్యతిరేకంగా బీజేపీ పాలకులు తెచ్చిన మూడు చట్టాల ‘ఆర్డినెన్సు 2020’ చెల్లనేరవని ‘కిసాన్ కాంగ్రెస్’ దాఖలు చేసిన పిటి షన్‌పైన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నోటీస్ జారీచేయడం ఓ కొసమెరుపు!
అన్నింటికన్నా దుర్మార్గం– రైతులు, వ్యవసాయ కార్మికులు శ్రమ జీవులుగా సమష్టిగా పండించే పంటలకు గిట్టుబాటు ధరల గురించి మాటమాత్రంగానైనా స్పష్టంగా ఆర్డినెన్సులో పేర్కొనక పోవడం! కనీస గిట్టుబాటు ధరను అమలు చేయడమేగాక పంటల ఉత్పత్తికయ్యే ఖర్చుకు అదనంగా 50 శాతం జోడించి గిట్టుబాటు ధరల్ని నిర్ణయించి విధిగా అమలు జరపాలన్న డా. స్వామినాథన్ కమిషన్ సాధికార సూచనల ప్రస్తావన కూడా ఎక్కడా ఈ ఆర్డినెన్స్‌లో లేదు. ఎందుకని? ఈ ప్రశ్నలకు కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనా లకు కొమ్ముకాస్తున్నాయని ఎదురయ్యే ప్రశ్నకు జవాబుకోసం రైతాంగం ఎదురు చూస్తోంది.
ఎందుకంటే దేశంలో పాలకులు పెంచిన బడా బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని కాస్తా అప్పగించి, ఆహార ఉత్పత్తుల ధరలను నిర్ణయించే సర్వాధికారాన్ని బీజేపీ పాలకుల ఆర్డినెన్సు కల్పిస్తోంది. అందుకే రాజకీయ పక్షాలతో నిమిత్తం లేకుండా కేవలం కిసాన్ సమాఖ్య రైతాంగం సుదీర్ఘ సత్యాగ్రహం తలపెట్టవలసి వచ్చింది. ఈ పరిణామానికి దోహదం చేసిన పాలకులు ప్రధాని మోదీ ఒక్కరే కాదు, భారత çసన్నకారు, మధ్యతరగతి రైతాంగ, వ్యవసాయ కార్మికుల నడ్డి విరగకొట్టే ప్రపంచబ్యాంక్ సంస్కరణలను తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, బాబు దేశంగానీ ‘దేశం’ ప్రధాన సూత్రధారులని మరువరాదు.
ఈ మూడు పార్టీల (కాంగ్రెస్/ బీజేపీ/ తెలుగుదేశం) నాయకులూ 1991లో పి.వి. నరసింహారావు, మన్మోహన్‌సింగ్ ఆగమేఘాల మీద ఆహ్వానించి భుజాన వేసుకొని ప్రవేశపెట్టిన ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను పోటా పోటీలమీద ఆహ్వానించి భుజాన వేసుకొని ఆ మార్గంలోనే ముందుకు సాగిన వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం నాయకులు, వాజ్‌పేయ్, చంద్రబాబు. ఈ ప్రజా వ్యతి రేకపోటీలో వెనకబడిపోవడం సహించలేని దేశంగాని ‘దేశం’ నాయ కుడు చంద్రన్న! 1991లో వరల్డ్ బ్యాంకు సంస్కరణలను వెంటనే అమలులోకి తీసుకురాకుండా జంకుతో పి.వి. అయినా కొంత తాత్సారం చేశాడు.
ఇక మన్మోహన్ సింగ్ పూర్వాశ్రమం వరల్డ్ బ్యాంకే కాబట్టి, బయటకు ఏం మాట్లాడినా ఆంతరంగికంగా బ్యాంక్ సంస్క రణలను తలకెత్తుకున్నవాడే. ఇకపోతే, అమ్ముడుపోవడంలో ముందు పీఠిలో నిలబడగల ‘సాహసవంతుడు’ బాబు! కాంగ్రెస్‌తో ప్రపంచ బ్యాంకు అధికారులు ఇంకా చర్చల్లో ఉండగానే అనంతరం ఏపీ సీఎం హోదాలో చంద్రన్న ఢిల్లీవెళ్లి ప్రపంచబ్యాంకు అధినేతలలో ఒకరైన ఉల్ఫోన్‌సన్‌తో ఏకాంతంగా సమావేశమై మంతనాలాడి వచ్చాడు. దీంతో పి.వి.కన్నా తన వలలో అతి జరూరుగా వలలో పడిన పిట్ట చంద్రన్న అని ఉల్ఫోన్‌సన్ నిర్ణయానికి వచ్చాడు.
ఇక ఆపైన కథంతా మనకి తెలిసిందే! పైకి బింకంగా ‘నేను ఏ షరతులకూ అంగీకరిం చలేదని మేకపోతు గాంభీర్యంతో చంద్రన్న ప్రకటించినా బ్యాంకు మాత్రం తన ప్రతిష్టను కాపాడుకుంటూ ‘చంద్రబాబు బ్యాంకు పెట్టిన షరతున్నింటినీ అంగీకరించాడ’ని ఆ మరుసటిరోజే ప్రకటించి తన పరువుని నిలబెట్టుకోక తప్పలేదు. ఆ తరువాత బ్రిటన్ నుంచి నాటి ప్రధాని మాక్మిలన్ నోట బ్యాంక్ ‘సంస్కరణల’ నినాదం వెలువడిన వెంటనే భారతదేశంలో అదేబాటలో నాటి బీజేపీ ప్రధాని వాజ్‌పేయ్ కూడా ‘అంతాబాగానే ఉంద’న్న స్లోగన్ ఎత్తుకుని బ్యాంక్ సంస్కరణ లను అమలు చేయడాన్ని వ్యతిరేకించలేదు! అలా తనకు ముందున్న పెద్దలను అనుసరించడమే ఆర్య సంస్కృతో, హిందూత్వ సంస్కా రమో అనుకుని ప్రధాని హోదాలో నరేంద్రమోదీ కూడా భావించి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు పరిపూర్ణ రూపం ఇవ్వాలని నిర్ణయిం చుకుని ఎక్కడా రాజీపడకుండా మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఒక్క కలంపోటుతో ముందుకు నెట్టి కూర్చున్నారు!
ప్రపంచబ్యాంకు అమెరికా చేతి ‘ఎత్తుబిడ్డ’ కాబట్టి చెల్లుబాటవు తోంది! అలాగే ‘మన బంగారం (పాలకుడు) మంచిదైతే ఎవరేం చేయగలరన్న’ సామెత అన్ని రంగుల భారత పాలకులకూ వర్తిస్తుంది. పాలకులకు మొండితనం అలంకారం కాకూడదు. కనుకనే బీజేపీ పాలకులు భారత పేద, మధ్యతరగతి రైతాంగ ప్రయోజనాలకు వ్యతి రేకంగా, కార్పొరేట్ మోతుబరుల ప్రయోజనాలకు రక్షణ కవచాలుగా ముందుకు నెడుతున్న చట్టాల మూలంగా రానున్న రోజుల్లో మన గ్రామీణ ప్రజల జీవనశైలినే వినాశకర పరిణామాల వైపు నెట్టకుండా ఉండాలని మనం ఆశిద్దాం! ఎందుకీ మాట అనవలసి వస్తోందంటే– మనకన్నా ఎక్కువ ముందడుగులో ఉందని భ్రమిస్తున్న అమెరికాలో సహజ వ్యవసాయోత్పత్తులను దెబ్బతీసి కేవలం లాభాపేక్షతో నడిచే కార్పొరేట్, కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతుల మూలంగా చిన్నకారు, మధ్యతరగతి సాధారణ రైతు కుటుంబాలు రెండు మూడు దశాబ్దాల లోనే ఎలా చితికిపోయి, నామరూపాలు లేకుండా పోవలసివస్తోందో నెబ్రస్కా రాష్ట్ర రైతు, మాజీ సెనేటర్ అయిన ఆల్‌డేవిడ్ ఆవేదన వినండి. ‘ఆ గ్రామీణ జీవనశైలిని ఒక్కసారి కోల్పోయామా, ఇంతటి గొప్పదేశంగా తీర్చిదిద్దుకున్న దేశంలో మెట్టభాగమంతా మనం చేజే తులా నాశనం చేసుకోవడమే అవుతుంది’ బహుశా అందుకే అమెరికా ప్రపంచబ్యాంకు సంస్థల ద్వారా నడిపే ‘కాబూలీవాలా’ రుణాల ఉచ్చుల గురించి ఏకరువు పెడుతూ శ్రీశ్రీ ఇలా హెచ్చరించాడు.
‘‘అరువులిచ్చి కరువు తెచ్చి / రుణం పెట్టి రణం తెచ్చి
ధనం జనం ఇంధనమై/ చరణకరాబంధనమై
జనన జరామరణ / దురాక్రమణల సంగ్రంధనమై’’
వినాశానికి కారణమవుతుందన్నాడు. అందుకే
‘‘అన్నం మెతుకునీ / ఆగర్భ శ్రీమంతుణ్ణీ
వేరుచేస్తే / శ్రమ విలువేదో ఇట్టే తేలిపోదూ?!’’ అని అన్నాడు
నడివయసుకు చేరకముందు పేదరికం మధ్య నలిగిపోయి
తనువు చాలించవలసి వచ్చిన యువకవి అలిసెట్టి ప్రభాకర్!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment