మీ భూములు సురక్షితం | PM Narendra Modi reaches out to protesting farmers for clarification | Sakshi
Sakshi News home page

మీ భూములు సురక్షితం

Published Sat, Dec 26 2020 2:28 AM | Last Updated on Sat, Dec 26 2020 8:28 AM

PM Narendra Modi reaches out to protesting farmers for clarification - Sakshi

న్యూఢిల్లీ: ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్‌ ఫా మింగ్‌) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏడు రాష్ట్రాల రైతుల విజయగాధలను శుక్రవారం ప్రధాని విన్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో తాము పొందిన ప్రయోజనాలను అరుణాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణాలకు చెందిన ఏడుగురు రైతులు ప్రధానికి వివరించారు. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించిన తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి కిసాన్‌’ పథకానికి సంబంధించి రూ. 18 వేల కోట్లను ప్రధాని 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ‘కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీలాంటి వారు చెబితే ఇతరుల్లోనూ తమ భూమి ఎక్కడికీ పోదనే ధైర్యం వస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఒప్పంద ఉల్లంఘనకు గతంలో రైతులకు పెనాల్టీ ఉండేదని, తమ కొత్త చట్టంలో ఆ జరిమానా నిబంధన లేదని వివరించారు. ‘కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీ తన ఇష్టానుసారం ఒప్పందం నుంచి వైదొలగే అవకాశం లేదు. కానీ రైతులు, తాము కోరుకుంటే ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఇది రైతులకు అనుకూల నిబంధన కాదా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒప్పంద రేటు కన్నా మార్కెట్‌ రేటు ఎక్కువ ఉంటే దిగుబడులకు రైతులకు బోనస్‌ లభిస్తుందని వివరించారు.


అందుకే చర్చల్లో ప్రతిష్టంభన
రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి జోక్యం వల్లనే రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రధాని విమర్శించారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆ చర్చలు ‘సహేతుకమైన, వాస్తవికమైన రైతు అభ్యంతరాల’ పైననే జరగాలన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి చేతుల్లోకి ప్రస్తుతం రైతు ఆందోళనలు వెళ్లాయని, అందువల్లనే అర్థంలేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. కొత్త సాగు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారన్నారు.

ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు తమ రాజకీయ అస్తిత్వం కోసం రైతులను వాడుకుంటున్నాయని ఆరోపించారు.  తనను కొందరు నేతలు, ఆందోళనకారులు అభ్యంతరకర భాషలో దూషించారని, అయినా తాను అవేవీ పట్టించుకోనని ప్రధాని పేర్కొన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల్లో విబేధాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీని ఇచ్చేందుకు, తమ ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు కచ్చితమైన కార్యాచరణ చూపాలని ప్రధానిని కోరారు.  

మోదీపీఎంగా  ఉన్నంతవరకు..
నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ కార్పొరేట్‌ సంస్థ కూడా రైతు భూమిని స్వాధీనం చేసుకోలేదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘ఎమ్మెస్పీ విధానం కొనసాగుతుంది, మండీలు మూతపడవు, మీ భూములను ఎవరూ స్వాధీనం చేసుకోరు’ అని రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశ రాజధాని ప్రాంతంలోని కిషన్‌గంజ్‌ గ్రామంలో రైతులనుద్దేశించి షా ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత స్మృతి ఇరానీ విమర్శించారు. ౖఆయన సొంత బావ రాబర్ట్‌ వాద్రానే రైతుల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. యూపీలోని అమేథీలో జరిగిన రైతు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.   

నేడు నిర్ణయం
కేంద్రంతో చర్చలు కొనసాగించే విషయంపై నేడు రైతు సంఘాలు చర్చించనున్నాయి. చర్చలకు రావాలన్న కేంద్రం ప్రతిపాదనకు లిఖితపూర్వక సమాధానాన్ని సిద్ధం చేయనున్నాయి.

ఒకటి రెండేళ్లు చూడండి
‘కొత్త సాగు చట్టాలను ఒక ప్రయోగంలా ఒకటి రెండేళ్లు ప్రయత్నించండి. అవి ప్రయోజనకరం కాదని తేలితే ప్రభుత్వం వాటికి అవసరమైన సవరణలు చేస్తుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రైతులకు సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులంతా తమ వారేనని, వారు రైతు బిడ్డలని, వారంటే తమకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. రైతులకు హాని కలిగించే చర్యలు ప్రధాని మోదీ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఒక ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

పార్లమెంట్‌లో ఆప్‌ సభ్యుల నిరసన
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రధాని మోదీ ముందు ఆప్‌ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం ప్రధాని మోదీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి: ఎ కమామొరేటివ్‌ వాల్యూమ్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా.. ఆప్‌ సభ్యులు సంజయ్‌ సింగ్, భగవంత్‌ మన్‌ లేచి నిల్చుని రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.  

వాజ్‌పేయి వల్లనే బలమైన భారత్‌!
న్యూఢిల్లీ:  భారత్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అటల్‌ కృషిని దేశం ఎప్పటికీ మరవలేదని ప్రధాని మోదీ ప్రశంసించారు.  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు.  పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్‌ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సదైవ్‌ అటల్‌ మెమోరియల్‌ వద్ద  రాష్ట్రపతి రామ్‌నాధ్‌ వాజ్‌పాయ్‌కు అంజలి అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement