Contract Farming
-
మీ భూములు సురక్షితం
న్యూఢిల్లీ: ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్ ఫా మింగ్) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏడు రాష్ట్రాల రైతుల విజయగాధలను శుక్రవారం ప్రధాని విన్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో తాము పొందిన ప్రయోజనాలను అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణాలకు చెందిన ఏడుగురు రైతులు ప్రధానికి వివరించారు. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించిన తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి కిసాన్’ పథకానికి సంబంధించి రూ. 18 వేల కోట్లను ప్రధాని 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ‘కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీలాంటి వారు చెబితే ఇతరుల్లోనూ తమ భూమి ఎక్కడికీ పోదనే ధైర్యం వస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఒప్పంద ఉల్లంఘనకు గతంలో రైతులకు పెనాల్టీ ఉండేదని, తమ కొత్త చట్టంలో ఆ జరిమానా నిబంధన లేదని వివరించారు. ‘కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీ తన ఇష్టానుసారం ఒప్పందం నుంచి వైదొలగే అవకాశం లేదు. కానీ రైతులు, తాము కోరుకుంటే ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఇది రైతులకు అనుకూల నిబంధన కాదా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒప్పంద రేటు కన్నా మార్కెట్ రేటు ఎక్కువ ఉంటే దిగుబడులకు రైతులకు బోనస్ లభిస్తుందని వివరించారు. అందుకే చర్చల్లో ప్రతిష్టంభన రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి జోక్యం వల్లనే రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రధాని విమర్శించారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆ చర్చలు ‘సహేతుకమైన, వాస్తవికమైన రైతు అభ్యంతరాల’ పైననే జరగాలన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి చేతుల్లోకి ప్రస్తుతం రైతు ఆందోళనలు వెళ్లాయని, అందువల్లనే అర్థంలేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. కొత్త సాగు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారన్నారు. ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు తమ రాజకీయ అస్తిత్వం కోసం రైతులను వాడుకుంటున్నాయని ఆరోపించారు. తనను కొందరు నేతలు, ఆందోళనకారులు అభ్యంతరకర భాషలో దూషించారని, అయినా తాను అవేవీ పట్టించుకోనని ప్రధాని పేర్కొన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల్లో విబేధాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీని ఇచ్చేందుకు, తమ ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు కచ్చితమైన కార్యాచరణ చూపాలని ప్రధానిని కోరారు. మోదీపీఎంగా ఉన్నంతవరకు.. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ కార్పొరేట్ సంస్థ కూడా రైతు భూమిని స్వాధీనం చేసుకోలేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఎమ్మెస్పీ విధానం కొనసాగుతుంది, మండీలు మూతపడవు, మీ భూములను ఎవరూ స్వాధీనం చేసుకోరు’ అని రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశ రాజధాని ప్రాంతంలోని కిషన్‌గంజ్ గ్రామంలో రైతులనుద్దేశించి షా ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ విమర్శించారు. ౖఆయన సొంత బావ రాబర్ట్ వాద్రానే రైతుల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. యూపీలోని అమేథీలో జరిగిన రైతు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. నేడు నిర్ణయం కేంద్రంతో చర్చలు కొనసాగించే విషయంపై నేడు రైతు సంఘాలు చర్చించనున్నాయి. చర్చలకు రావాలన్న కేంద్రం ప్రతిపాదనకు లిఖితపూర్వక సమాధానాన్ని సిద్ధం చేయనున్నాయి. ఒకటి రెండేళ్లు చూడండి ‘కొత్త సాగు చట్టాలను ఒక ప్రయోగంలా ఒకటి రెండేళ్లు ప్రయత్నించండి. అవి ప్రయోజనకరం కాదని తేలితే ప్రభుత్వం వాటికి అవసరమైన సవరణలు చేస్తుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులకు సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులంతా తమ వారేనని, వారు రైతు బిడ్డలని, వారంటే తమకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. రైతులకు హాని కలిగించే చర్యలు ప్రధాని మోదీ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఒక ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ఆప్ సభ్యుల నిరసన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రధాని మోదీ ముందు ఆప్ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం ప్రధాని మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయి: ఎ కమామొరేటివ్ వాల్యూమ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా.. ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, భగవంత్ మన్ లేచి నిల్చుని రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వాజ్‌పేయి వల్లనే బలమైన భారత్! న్యూఢిల్లీ: భారత్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అటల్ కృషిని దేశం ఎప్పటికీ మరవలేదని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితోపాటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాధ్ వాజ్‌పాయ్‌కు అంజలి అర్పించారు. -
కాంట్రాక్టు వ్యవసాయంతో రైతులకు భరోసా
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు వ్యవసాయంతో రైతుకు భరోసా కలుగుతుందని కేంద్రం పేర్కొంది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కాంట్రాక్టు వ్యవసాయం తప్పనిసరని స్పష్టంచేసింది. ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్, లైవ్‌స్టాక్ కాంట్రాక్టు ఫార్మింగ్ (ప్రొమోషన్, ఫెసిలిటేషన్) యాక్టు–2018’ప్రాథమిక ముసాయిదా బిల్లు ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ బిల్లును మోడల్ కాంట్రాక్టు వ్యవసాయ బిల్లుగా పిలుస్తున్నారు. ఈ బిల్లుపై అభిప్రాయాలు తెలపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. స్పాన్సర్‌కు, రైతుకు మధ్య ఏ ఒప్పందం జరుగుతుందో ఈ బిల్లులో ప్రస్తావించింది. వ్యవసాయం గిట్టుబాటు కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ నష్టంలేని విధంగా కాంట్రాక్టు పద్ధతి వీలు కల్పిస్తుందని బిల్లు వివరించింది. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపింది. బిల్లులోని ముఖ్యాంశాలు... వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలోనూ కాంట్రాక్టు పద్ధతిని అమలు చేస్తారు. ఆ ప్రకారం ఉద్యాన, పశుసంవర్థక, డెయిరీ, కోళ్లు, మత్స్య తదితర అన్నింటిలోనూ ప్రవేశపెడతారు. కాంట్రాక్టు వ్యవసాయాన్ని అమలుచేసేందుకు రాష్ట్రస్థాయిలో కాంట్రాక్టు ఫార్మింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనూ రిజిస్టరింగ్, అగ్రిమెంట్ రికార్డింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. గ్రామం లేదా పంచాయతీ స్థాయిలో కాంట్రాక్టు ఫార్మింగ్ ఫెసిలిటేషన్ గ్రూప్ (సీఎఫ్ఎఫ్జీ) ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ పంటలు, ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితులపై వేగంగా ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, శాస్త్ర పరిజ్ఞానం, అవసరమైన రుణాన్ని అందజేస్తారు. అలాగే బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. కాంట్రాక్టు వ్యవసాయ చట్టం అమలులోకి వస్తే రైతు పంటను కొనుగోలు చేసే బయ్యర్లకు స్వేచ్ఛ కల్పిస్తారు. దీనివల్ల వారికి మార్కెట్ ఫీజు, కమీషన్ చార్జీలు ఉండవు. ఫలితంగా 5–10 శాతం వారికి కలసి వస్తుంది. ఇది రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) లేదా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్పీసీ)లను ఏర్పాటు చేస్తారు. ఇవి సన్న, చిన్నకారు రైతులను కాంట్రాక్టు వ్యవసాయంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తాయి. స్పాన్సర్‌కు రైతు భూమిపై ఎటువంటి అధికారం ఉండదు. ఈ మేరకు ఒప్పందంలో స్పష్టంగా ప్రస్తావిస్తారు. ఒప్పందంలో చేసుకున్న ప్రకారమే రైతుల వద్ద ఉన్న పంటలను స్పాన్సర్లు కొనుగోలు చేయాలి. మార్కెట్లో సంబంధిత పంటకు సరైన ధర లేకపోతే రైతు, స్పాన్సర్ ఇద్దరూ లాభపడేలా పంటను విక్రయించాలి. సీజన్‌కు ముందే ఒప్పందం... స్పాన్సర్‌కు, రైతుకు మధ్య ఒప్పందం జరగడమే కాంట్రాక్టు వ్యవసాయం ముఖ్య ఉద్దేశం. ఆ ఒప్పందం ప్రకారం రైతు లేదా రైతు గ్రూపులు స్పాన్సర్‌తో చర్చించి ఆ ప్రకారం వ్యవసాయం చేస్తారు. ఈ మేరకు సీజన్‌కు ముందే రైతు, స్పాన్సర్ మధ్య ఒప్పందం జరుగుతుంది. పంట పండించే సమయంలో తలెత్తే సమస్యలు, పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్ ద్వారా జరిగే అన్ని కష్టనష్టాల నుంచి బయట పడేయడమే కాంట్రాక్టు వ్యవసాయం ప్రధాన లక్ష్యం కాబట్టి అందుకు అనుగుణంగా స్పాన్సర్ ఏర్పాట్లు చేస్తారు. రైతుకు అవసరమైన ఇన్‌ఫుట్స్, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ విస్తరణ అవకాశాలు, పంట పండించే సమయంలో, పంట చేతికి వచ్చే సందర్భంలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఇతర సేవలను స్పాన్సర్ రైతుకు అందజేస్తారు. ఆ ప్రకారమే ఒప్పందం ఉంటుంది. -
కట్టుదిట్టంగా కాంట్రాక్టు వ్యవసాయం
- కనీస మద్దతు ధరకు మించి కొనాలన్నది ప్రధాన షరతు - ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు, చేర్పులు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు వ్యవసాయవిధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం... వ్యవసాయ ఆధారిత కంపెనీలు రైతు వద్దకు వెళ్లి తమకు అవసరమైన పంటలను పండించాలి. ఆయా పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు తామే కొనుగోలు చేస్తానని రైతుతో చేసుకునే ఒప్పందమే కాంట్రాక్టు వ్యవసాయం. తాజా ఉత్తర్వుల్లో కనీస మద్దతు ధరకు మించి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కంపెనీలు కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాలి. పంట కొనుగోలు చేసిన మరుసటి రోజే రైతు ఖాతాలో సొమ్ము జమ చేయాలి. అందుకోసం సీజన్‌కు ముందే రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకోవాలి. నాణ్యత లేదంటూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిరాకరించకూడదు. వాటి నాణ్యతను ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ఆయా కంపెనీలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. అందుకోసం సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. మొత్తం కాంట్రాక్టు వ్యవసాయం చేయిస్తున్న వాటి విలువలో 20 శాతం చెల్లించాలి. ఒక పంట సీజన్‌కే రైతులతో ఒప్పందం చేసుకోవాలి. గోదాములు, కోల్డ్‌స్టోరేజీలను మార్కెట్లుగా మార్చుకునే సదుపాయం వ్యవసాయ మార్కెట్ నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చేసింది. ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మార్కెట్లు వేలల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు జరిగే చోట్లన్నీ కూడా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే మార్కెట్లుగా మారనున్నాయి. అవన్నీ కూడా ఈ–నామ్‌తో అనుసంధానం కానున్నాయి. ప్రైవేటు మార్కెట్ల నిబంధనలు సరళతరం: గతంలో ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 10 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రైవేటు మార్కెట్ ఏర్పాటైంది. ఇక ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేయాలంటే రూ. 3 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపారస్థులు పంట ఉత్పత్తులను రవాణా చేయాలంటే ప్రతీ మార్కెట్ కమిటీ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లోనే రవాణా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తులు ఇప్పటివరకు ఒక్కో మార్కెట్ యార్డుల్లో ఒక్కో లైసెన్సు కలిగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యాపారస్తులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకటే లైసెన్సు జారీచేస్తారు. ప్రస్తుతం వ్యాపారస్తులకు, ఏజెంట్లకు ప్రతీ ఒక్కరికీ ఒకటే లైసెన్సు, ఒకటే ఫీజు ఉండేది. దాన్ని మార్చేశారు. వేర్వేరు లైసెన్సులు, వేర్వేరు ఫీజులుంటాయి. -
సాగుపై కంపెనీల ఆధిపత్యం!
‘కాంట్రాక్టు వ్యవసాయం’పై అభిప్రాయం కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో కంపెనీల ఆధిపత్యానికి అడుగులు పడనున్నా యా? సన్న, చిన్నకారు రైతులను బడా కంపె నీలు తమ గుప్పిట్లోకి తీసుకోనున్నాయా? కేంద్రం తీసుకురానున్న ‘మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్–2017’ ముసాయిదాలోని అంశాలు చూస్తే ఇవి నిజమేనని అంటున్నారు కొందరు రైతు సంఘాల నేతలు. ఈ ముసా యిదాపై రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయా లు, సలహాలు కోరుతూ కేంద్ర వ్యవసాయ సహకార శాఖ తాజాగా లేఖ రాసింది. కేంద్రం అంచనా ప్రకారం దేశంలో 22.50 శాతం రైతులు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారు. దేశంలో రైతు కుటుంబ నెలసరి ఆదాయం సగటున రూ.6,426 మాత్రమే ఉందని ముసా యిదాలో ప్రస్తావించారు. 52 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ఒక్కో వ్యవసాయ కుటుంబ అప్పు సగటున రూ.47 వేలుగా ఉందని ముసాయిదా వెల్లడించింది. ఈక్రమంలో 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా తీసుకొ స్తుందే కాంట్రాక్టు వ్యవసాయ చట్టమంటున్నారు. కాంట్రాక్టు వ్యవసాయ ఉద్దేశం ఏంటి? కేంద్ర ముసాయిదా ప్రకారం.. రైతు పంటకు ఏర్పాట్లు చేసుకున్నప్పట్నుంచీ ఆ పంట చేతికి వచ్చేవరకు కంపెనీకి, రైతుకు మధ్య ఒప్పందం ఉంటుంది. సీజన్ మొదట్లో రైతుల కు అవసరమైన సాయాన్ని కంపెనీలు అంద జేస్తాయి. సలహాలు సూచనలు ఇస్తాయి. పంట పండించాక రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కంపెనీలు గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. పంట పండించే క్రమంలో జోక్యం చేసుకుంటాయి.అయితే కంపెనీల విశ్వసనీ యత ఏంటనేది రైతు నేతల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. అలాగే కంపెనీలు మొదటి నుంచి గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల ఆధిపత్యం పెరగడం వల్ల ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోని పరిస్థితులు ఏర్పడుతాయని, దీంతో అన్నదాతకు సరైన న్యాయం దక్కదని అంటున్నారు. -
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టింగ్ వ్యవసాయంలో అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం అనేది ప్రధాన అడ్డంకిగా ఉందని ఫిక్కి సీఈవో కాన్క్లేవ్ పేర్కొంది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో పంటకు ధరను మార్కెట్ రేటును బట్టి నిర్ణయిస్తారా లేక జరిగిన వ్యయానికి లాభం కలిపి ఇస్తాయా అన్న విషయంలో స్పష్టత ఏర్పడితేనే ఈ విధానం విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వ్యవసాయంలో ‘నెక్స్ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఫిక్కి ఏర్పాటు చేసిన సీఈవో సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కావేరీ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మితున్ చాంద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం నీరు, విద్యుత్ అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించగలిగితే పప్పు దినుసులను దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ‘ఫుడ్ 360’ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అందచేశారు. జోరుగా పీఈ, వీసీ నిధుల ప్రవాహం... కాగా భారత వ్యవసాయ-వ్యాపార కంపెనీల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) నిధుల ప్రవాహం జోరుగా సాగనున్నది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పీఈ, వీసీ ఫండ్స్ ఆసక్తిగా ఉన్నాయని కేపీఎంజీ-ఫిక్కి తాజా నివేదిక వెల్లడించింది. సదస్సు సందర్భంగా ఈ నివేదిక వెలువడింది.