సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు వ్యవసాయంతో రైతుకు భరోసా కలుగుతుందని కేంద్రం పేర్కొంది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కాంట్రాక్టు వ్యవసాయం తప్పనిసరని స్పష్టంచేసింది. ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్, లైవ్‌స్టాక్ కాంట్రాక్టు ఫార్మింగ్ (ప్రొమోషన్, ఫెసిలిటేషన్) యాక్టు–2018’ప్రాథమిక ముసాయిదా బిల్లు ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ బిల్లును మోడల్ కాంట్రాక్టు వ్యవసాయ బిల్లుగా పిలుస్తున్నారు. ఈ బిల్లుపై అభిప్రాయాలు తెలపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. స్పాన్సర్‌కు, రైతుకు మధ్య ఏ ఒప్పందం జరుగుతుందో ఈ బిల్లులో ప్రస్తావించింది. వ్యవసాయం గిట్టుబాటు కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ నష్టంలేని విధంగా కాంట్రాక్టు పద్ధతి వీలు కల్పిస్తుందని బిల్లు వివరించింది. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపింది.
బిల్లులోని ముఖ్యాంశాలు...
వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలోనూ కాంట్రాక్టు పద్ధతిని అమలు చేస్తారు. ఆ ప్రకారం ఉద్యాన, పశుసంవర్థక, డెయిరీ, కోళ్లు, మత్స్య తదితర అన్నింటిలోనూ ప్రవేశపెడతారు. కాంట్రాక్టు వ్యవసాయాన్ని అమలుచేసేందుకు రాష్ట్రస్థాయిలో కాంట్రాక్టు ఫార్మింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనూ రిజిస్టరింగ్, అగ్రిమెంట్ రికార్డింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. గ్రామం లేదా పంచాయతీ స్థాయిలో కాంట్రాక్టు ఫార్మింగ్ ఫెసిలిటేషన్ గ్రూప్ (సీఎఫ్‌ఎఫ్‌జీ) ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ పంటలు, ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితులపై వేగంగా ఇది నిర్ణయాలు తీసుకుంటుంది.
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, శాస్త్ర పరిజ్ఞానం, అవసరమైన రుణాన్ని అందజేస్తారు. అలాగే బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. కాంట్రాక్టు వ్యవసాయ చట్టం అమలులోకి వస్తే రైతు పంటను కొనుగోలు చేసే బయ్యర్లకు స్వేచ్ఛ కల్పిస్తారు. దీనివల్ల వారికి మార్కెట్ ఫీజు, కమీషన్ చార్జీలు ఉండవు. ఫలితంగా 5–10 శాతం వారికి కలసి వస్తుంది. ఇది రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) లేదా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌పీసీ)లను ఏర్పాటు చేస్తారు. ఇవి సన్న, చిన్నకారు రైతులను కాంట్రాక్టు వ్యవసాయంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తాయి. స్పాన్సర్‌కు రైతు భూమిపై ఎటువంటి అధికారం ఉండదు. ఈ మేరకు ఒప్పందంలో స్పష్టంగా ప్రస్తావిస్తారు. ఒప్పందంలో చేసుకున్న ప్రకారమే రైతుల వద్ద ఉన్న పంటలను స్పాన్సర్లు కొనుగోలు చేయాలి. మార్కెట్లో సంబంధిత పంటకు సరైన ధర లేకపోతే రైతు, స్పాన్సర్ ఇద్దరూ లాభపడేలా పంటను విక్రయించాలి.
సీజన్‌కు ముందే ఒప్పందం...
స్పాన్సర్‌కు, రైతుకు మధ్య ఒప్పందం జరగడమే కాంట్రాక్టు వ్యవసాయం ముఖ్య ఉద్దేశం. ఆ ఒప్పందం ప్రకారం రైతు లేదా రైతు గ్రూపులు స్పాన్సర్‌తో చర్చించి ఆ ప్రకారం వ్యవసాయం చేస్తారు. ఈ మేరకు సీజన్‌కు ముందే రైతు, స్పాన్సర్ మధ్య ఒప్పందం జరుగుతుంది.
పంట పండించే సమయంలో తలెత్తే సమస్యలు, పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్ ద్వారా జరిగే అన్ని కష్టనష్టాల నుంచి బయట పడేయడమే కాంట్రాక్టు వ్యవసాయం ప్రధాన లక్ష్యం కాబట్టి అందుకు అనుగుణంగా స్పాన్సర్ ఏర్పాట్లు చేస్తారు. రైతుకు అవసరమైన ఇన్‌ఫుట్స్, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ విస్తరణ అవకాశాలు, పంట పండించే సమయంలో, పంట చేతికి వచ్చే సందర్భంలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఇతర సేవలను స్పాన్సర్ రైతుకు అందజేస్తారు. ఆ ప్రకారమే ఒప్పందం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment