కట్టుదిట్టంగా కాంట్రాక్టు వ్యవసాయం | Contract farming as a commitment | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా కాంట్రాక్టు వ్యవసాయం

Published Sat, Jul 22 2017 1:28 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

Contract farming as a commitment

- కనీస మద్దతు ధరకు మించి కొనాలన్నది ప్రధాన షరతు
ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు, చేర్పులు
 
సాక్షి, హైదరాబాద్‌: కాంట్రాక్టు వ్యవసాయవిధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం... వ్యవసాయ ఆధారిత కంపెనీలు రైతు వద్దకు వెళ్లి తమకు అవసరమైన పంటలను పండించాలి. ఆయా పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు తామే కొనుగోలు చేస్తానని రైతుతో చేసుకునే ఒప్పందమే కాంట్రాక్టు వ్యవసాయం. తాజా ఉత్తర్వుల్లో కనీస మద్దతు ధరకు మించి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కంపెనీలు కొనుగోలు చేయాలి.

రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాలి. పంట కొనుగోలు చేసిన మరుసటి రోజే రైతు ఖాతాలో సొమ్ము జమ చేయాలి. అందుకోసం సీజన్‌కు ముందే రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకోవాలి. నాణ్యత లేదంటూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిరాకరించకూడదు. వాటి నాణ్యతను ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ఆయా కంపెనీలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. అందుకోసం సెక్యురిటీ డిపాజిట్‌ చేయాలి. మొత్తం కాంట్రాక్టు వ్యవసాయం చేయిస్తున్న వాటి విలువలో 20 శాతం చెల్లించాలి. ఒక పంట సీజన్‌కే రైతులతో ఒప్పందం చేసుకోవాలి. 
 
గోదాములు, కోల్డ్‌స్టోరేజీలను మార్కెట్లుగా మార్చుకునే సదుపాయం
వ్యవసాయ మార్కెట్‌ నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చేసింది. ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మార్కెట్లు వేలల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇలా వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు జరిగే చోట్లన్నీ కూడా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే మార్కెట్లుగా మారనున్నాయి. అవన్నీ కూడా ఈ–నామ్‌తో అనుసంధానం కానున్నాయి. 
 
ప్రైవేటు మార్కెట్ల నిబంధనలు సరళతరం: గతంలో ప్రైవేటు మార్కెట్‌ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 10 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రైవేటు మార్కెట్‌ ఏర్పాటైంది. ఇక ప్రైవేటు మార్కెట్‌ ఏర్పాటు చేయాలంటే రూ. 3 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపారస్థులు పంట ఉత్పత్తులను రవాణా చేయాలంటే ప్రతీ మార్కెట్‌ కమిటీ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే రవాణా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తులు ఇప్పటివరకు ఒక్కో మార్కెట్‌ యార్డుల్లో ఒక్కో లైసెన్సు కలిగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యాపారస్తులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకటే లైసెన్సు జారీచేస్తారు. ప్రస్తుతం వ్యాపారస్తులకు, ఏజెంట్లకు ప్రతీ ఒక్కరికీ ఒకటే లైసెన్సు, ఒకటే ఫీజు ఉండేది. దాన్ని మార్చేశారు. వేర్వేరు లైసెన్సులు, వేర్వేరు ఫీజులుంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement