వలసలు నిజం... వాదనలు అబద్ధం | ABK Prasad Article On Marla Vijay Kumar Book Review | Sakshi
Sakshi News home page

వలసలు నిజం... వాదనలు అబద్ధం

Published Tue, Mar 2 2021 1:00 AM | Last Updated on Mon, Mar 8 2021 5:42 PM

ABK Prasad Article On Marla Vijay Kumar Book Review - Sakshi

మనుగడ కోసం పక్షులే వేల కిలోమీటర్లు ఎగురుతూ వెళ్లిపోతాయి. మరి మనుషులు మాత్రం ఉన్నచోటే ఎందుకుంటారు? స్వావలంబన కోసం ఉన్న ప్రాంతాన్ని వదిలి, కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి కొత్త ఖండాలకు వెళ్లి నివాసాలు ఏర్పరుచుకున్నారు. చారిత్రక పరిణామ క్రమంలో వలసలు అనివార్యం. ఈ క్రమంలో జాతులు సంపర్కం చెందాయి. సమాజాలు కలగలిసిపోయాయి. ఈ రోజు ఆర్య రక్తం, అనార్య రక్తం అనేది వేరుచేయగలిగేది కాదు. అయినా కొన్ని రాజకీయ శక్తులు కులాలను, మతాలను, జాతులను తమ స్వార్థం కోసం, అధికారం కోసం విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటిని తిప్పికొట్టడానికి శాస్త్రీయమైన పరిశోధనలు, ఆ పరిశోధనల ఆధారంగా రాసిన పుస్తకాలే ఆయుధాలు.

‘‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?’’
ఈ ప్రశ్నలో సంధించిన మానవకథ- ప్రకృతి కథే! పశుపక్ష్యాదులు, శిల్పం, సాహిత్యం, శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, కవిత్వం, నాట్యం, అన్నీ ప్రకృతి జననంతో ముడిపడి ఉన్నవే. అవి మానవుడి ద్వారా వివిధ రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్రాంత సాంకేతిక నిపుణులు, భౌతికవాది, పరిణామవాద, వైజ్ఞానిక శాస్త్రాంశాల పరిశోధనలో తలమునకలుగా ఉన్న మర్ల విజయకుమార్‌ తాజాగా వెలువరించిన ‘భారతీయుల (చారిత్రక, సాంస్కృతిక, జన్యు) మూలాలు’ అన్న గ్రంథం (పీకాక్‌ క్లాసిక్స్‌) నేటి తరాలకు ఒక అమూల్య రచన.

‘ఓల్గా నుంచి గంగా’ నదీ తీరందాకా మధ్యాసియా ఇరానియన్‌ సాంస్కృతిక పూర్వ రంగం నుంచి ఆసియా ఖండంలో సాగిన మానవ వలసల గురించి అత్యంత విలువైన సమాచారంతో కూడిన వైజ్ఞానిక పరిశోధనా గ్రంథాన్ని కథల రూపంలో మహాపండితుడు, బౌద్ధ దార్శనికుడు, ముప్పయ్‌ భాషలు తెలిసిన విజ్ఞానవేత్త రాహుల్‌ సాంకృత్యా యన్‌ అందించారు. ఆ తర్వాత తొలి తరం సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులలో అగ్రగణ్యులైన ప్రొఫెసర్‌ డీడీ కోశాంబి, దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ, ఆ తరువాతి తరం చరిత్రకారులలో సుప్రసిద్ధులైన డీఎన్‌ ఝూ, ఇర్ఫాన్‌ హబీబ్‌లు కూడా దక్షిణాసియా నుంచి మన దేశం లోకి ఉధృతంగా సాగిన మానవ వలసల గురించి, విభిన్న జాతులు, తెగల గురించి విస్తారంగా ప్రస్తావించడం జరిగింది. రాహుల్జీ ఒక సందర్భంలో పేర్కొన్నట్టు ‘పక్షి సంతానం కంటే, మానవ సంతానానికి ఈ ప్రపంచంలో బతకడానికి సాధనాలు, అవకాశాలు కూడా ఎక్కు వన్న విషయాన్ని చాలామంది మరిచిపోతారు’’.

సరిహద్దులు ఎరుగని జగజ్జనులు
మనకు తెలుసు, ఆంధ్రలో కొల్లేరు సరస్సుకు, పులికాట్‌ సరస్సుకు వచ్చే పక్షులన్నీ సైబీరియా (రష్యా) నుంచి వచ్చి రుతువును బట్టి సేద తీర్చుకుంటుంటాయి. లాల్‌సర్‌ పక్షులు అలా చలికాలంలో వచ్చి వేసవి వస్తుందనగానే ఏప్రిల్‌లో హిమాలయాలవైపు వెళ్లి పోతాయి. ఇలా తమకు బొత్తిగా తెలియని దూర తీర ప్రాంతాలకు పక్షులు, వాటి పిల్లలకు ఎగిరివెళ్లి, వాలి తమ జీవనాన్ని గడుపుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వావలంబన వల్లనే అనివార్యమవుతుంది. ఇలా పశుపక్ష్యాదులే స్వావలంబన ద్వారా తమ జీవితాలకు మెరుగు పెట్టుకుంటుండగా మానవ సంతానం ఇంకెలా ఉండాలి? అని మహా పండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ తన ‘లోక సంచారి’ గ్రంథంలో ప్రస్తావించాడు. అలాంటివే సప్తఖండాలలోనూ జరిగాయి. ఒక చోటు నుంచి, ప్రాంతం నుంచి, దేశాల నుంచి, ఖండాంతరాల నుంచి ‘సరిహద్దులు ఎరుగని జగజ్జనులు’ చారిత్రక పరిణామ క్రమంలో కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి తమ అవసరాల కొద్దీ కొత్త ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. వలసలు వచ్చి స్థిరపడిన జనాల మధ్య పనిగట్టుకుని కుల, మత వివక్షలు రేపుకోవడం కన్నా భుక్తి గడుపుకోవడానికి, ఉనికిని కాపాడుకోవడానికే సమయమంతా సరిపోయింది.

జనపదాల కదలికలు మారాయి, అలవాట్లకు పెట్టే పేర్లూ మారాయి. సమాజం పరిణామం చెందుతున్నకొద్దీ భక్ష్య పదార్థమైన ‘సూపా’న్ని ప్రాచీనులు మాంసానికి వాడితే, దాన్నే తరువాతి కాలాల్లో శ్రోత్రియ కుటుంబాలు ‘కందిపప్పు’ని సూపంగా చెప్పసాగాయి. నేటికి రెండులక్షల సంవత్సరాల నాటికే పాత తరాల యుగపు మాన వుడు అడవుల్లో నివసిస్తూ వేట, ఆహారసేకరణ ఆధారంగా జీవించ సాగారు. మానవ జాతికి పుట్టిల్లు తూర్పు ఆఫ్రికా అని అనేక మానవ జన్యుకణాల పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారని మర్ల విజయకుమార్‌ పేర్కొన్నారు. మానవ నివాసానికి అనుకూలం గాని ప్రాంతాల నుంచి అను కూలమైన ప్రాంతాలకు మానవ వలసలు ఎందుకు సాగాయో సోదాహరణంగా వివరించారు. ఈ మానవ వలసల్లో భాగంగానే చరిత్రలో ఆదిమ జాతులుగా పేర్కొన్న మానవులు లక్ష ఏళ్ల నాటికే ఆఫ్రికా నుంచి వచ్చి వాతా వరణం కాస్త వేడిగా ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు. వాతావరణం ప్రభావం రంగును, ముఖ కవలికల్ని కూడా మార్చేశాయి.

సింధు అయ్యింది హిందూ...
అలాగే భారతదేశంలో కొందరు మతాభిమానులు దేశ నాగరికతను మత ప్రాతిపదికపై విభజించి చూపేందుకుగాను సింధు నాగరికతను ‘హిందూ’ నాగరికతగా చిత్రించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాన్ని ఈ గ్రంథకర్త తిప్పికొట్టారు. ఎందుకంటే భారతదేశంతో సంపర్కం కల్గిన పర్షియన్లకు చారిత్రక మొహెంజదారో–హరప్పా నాగరికతలకు ఆల వాలంగా ఉన్న సింధు నదీలోయ ప్రాంతాన్ని... ‘స’కారాన్ని అదే అక్షరంతో పలకడం రానందున, దాన్ని ‘హ’కారంగా మార్చుకుని ‘సింధు’ను ‘హిందు’గా ఉచ్చరించుతూ రావడంవల్ల ఈ గందరగోళం ఏర్పడిందని గుర్తించాలి. ఉచ్చారణలో ఒక్క ‘అక్షరం’ మార్పిడివల్ల భారతదేశంలోని ఛాందస వర్గాలు కొందరు మొత్తం దేశ ఐక్యతకు, మత సామరస్యానికి, లౌకిక వ్యవస్థకు ఎంత చేటు కల్గిస్తూ వచ్చారో చరిత్ర చెబుతోంది. వాడికి ‘స’ అక్షరం నోరు తిరగలేదు కాబట్టి మన ఛాందసులు ‘వికార’ పోకడలు ఎందుకు పోవాలి?

మూలాలను నిర్ధారించే పరిశోధన
జన్యు విజ్ఞాన పరిశోధనలకు చరిత్ర పఠనంలో ఎంత విలువుందో తెలుసుకోవాలంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన ఒక గొప్ప సత్య నిరూపణను పాఠకుల ప్రయోజనార్థం ఇక్కడ ఉదహరించదలిచాను. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్, బౌద్ధ పరిశోధకులు ఆంజనేయ రెడ్డి కుటుంబం తాలూకు జన్యు లక్షణాల పుట్టుపూర్వాలు, వారి కుటుంబ పూర్వీకులు ఎక్కడి నుంచి తెలుగుదేశానికి ఊడిపడి స్థిరపడ్డారన్న యావత్తు తబిశీళ్లు ఒక ‘జినోగ్రాఫిక్‌’ ప్రాజెక్టు ద్వారా బయటపడ్డాయి. ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ‘నేషనల్‌ జాగ్రఫిక్‌’ (ఐబీఎం) నిర్వహించింది. ఆంజనేయరెడ్డి ‘పుట్టెంట్రుకల’ తబిశీళ్లు బయటికి లాగిన ఈ ప్రాజెక్టు ఆ కుటుంబ జన్యుకణాల పూర్వాపరాలను డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వెల్లడించింది.

అంజనేయరెడ్డి క్రోమోజోమ్‌ ‘వై’గా నిర్ధారణ చేసి, దాన్ని హాప్లోగ్రూప్‌–ఎల్‌గా గుర్తించింది. 60,000 సంవత్సరాల క్రితం వీరంతా ఆఫ్రికనేతరులుగా నిర్ధారించారు. ఈరోజున దక్షిణ భారతంలో నివసించే వారిలో నూటికి 50 మందికి పైగా ఈ ‘హాప్లో’ గ్రూపుకు చెందినవారేనని తేల్చారు. ఆంజనేయులు పూర్వీకులలో తొలితరం పూర్వీకుడు 50 వేల ఏళ్ల క్రితంవాడని కూడా నిర్ధారించారు. ఆ పూర్వీకుడికి సంకేతం ‘ఎం– 168’గా నిర్ణయించారు. వీరంతా ఒకప్పటి ఆఫ్రికా వాసులుగా, వీరికి సంబంధించిన నిర్దిష్టమైన గుర్తులుగా రాతి పనిముట్లను గుర్తించడం విశేషం. ఈశాన్య ఆఫ్రికాలోని రిఫ్ట్‌ లోయలో (ఈనాటి ఇథియో పియా/కెన్యా/టాంజానియా ప్రాంతం) 31,000 నుంచి 79,000 సంవత్సరాల క్రితం ఆంజనేయులు పూర్వీకులు ఉండి ఉండవచ్చునని నిర్ధారించారు.

వేదాలలో సర్వజ్ఞానం పొందుపర్చబడి ఉందని, ఈ ‘అపార విజ్ఞానాన్ని’ పాశ్చాత్యులు దొంగలించి తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకున్నారని కొందరు పండితులనుకునేవారు ప్రకటనలు చేశారు. విజయకుమార్‌ అన్నట్టు కుల చట్రంలో ప్రజలను బందీలు చేసి వారిని దోపిడీకి గురి చేసినందున, దానికి మతం రంగు పూసి, తమ ఆర్థిక సామాజిక దోపిడీని కొనసాగించడమే దీనికి కారణం. నేడు కల్తీలేని ఆర్యజాతిగానీ, అనార్య జాతులు గానీ లేవు. కాల క్రమంలో జాతుల మధ్యన జన్యు మిశ్రమం జరిగిపోయింది గనుక. ఆ మాటకొస్తే చరిత్ర, సంస్కృతి విషయంలో భారత ప్రజల్లో అత్యధికులు అనార్య మూలాలు కలిగినవారే సుమా! కనుకనే భావ విప్లవానికి మతం, మూఢ విశ్వాసాలు ప్రధాన అడ్డంకి అని రాహుల్జీ హెచ్చరించి ఉంటాడు. మరి ఈ అడ్డంకిని తొలగించాలంటే ఏం కావాలన్నాడు శ్రీశ్రీ? ‘‘కదిలేదీ కదిలించేదీ/మారేదీ మార్పించేదీ/పాడేదీ పాడిం చేదీ/మునుముందుకు సాగించేది/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ...’’!


ఏబీకే ప్రసాద్‌ 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement