రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్‌లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు.టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం!
ప్రకృతి వినాశాన్ని కొని తెచ్చుకునే ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) పేరిట ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా మాంసకృత్తులను పెంచే జంతు ప్రొటీన్ల కోసం ఆరాటం పెరిగిపోయిన ఫలితంగా మానవ జాతి ప్రపంచ వ్యాపితంగానే తెలిసిన రోగాలతో పాటు తెలియని అనేక అజ్ఞాత వ్యాధులకు గురవుతూ వస్తోంది. ఈ దుస్థితి గతంలో అంతగా లేదు. ఈ అజ్ఞాత వ్యాధుల్లో భాగమే ‘సార్స్’ వ్యాధి వ్యాప్తి. దాంతో ప్రపంచం ఎంతగా పడుగు పేకలా అల్లుకుపోయిన భూమో మనకు తెలిసొచ్చింది. అంతేగాదు, రకరకాల మహమ్మారి వ్యాధి కారక వైరస్ క్రిములకు రకరకాల గబ్బిలాలు, రిషి పిట్టలూ ఆలవాలంగా మారాయో వెల్లడైంది’’.
►ప్రపంచ వైద్య పరిశోధనా సంస్థ ప్రపంచాన్ని ముమ్మరించనున్న అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్)పై హెచ్చరిస్తూ 1992లోనే ప్రచురించిన సాధికార నివేదిక.
►అంతేగాదు, ‘‘ సుమారు 25 వేల సంవత్సరాలకు ముందే నేటి కరోనా (కోవిడ్ 19)ను పోలిన వైరస్ వ్యాధి మనుషులకు సోకింది, ప్రపంచంలోని మానవాళి ఆది నుంచీ ప్రమాదకరమైన విషవ్యాధుల్ని ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే అలాంటి వైరస్‌లను ప్రతిఘటించి బట్టకట్టిన మానవ జీవకణాలలోని సానుకూల శక్తుల సాయంతోనే వైరస్‌లు దఫదఫాలుగా వచ్చినా తట్టుకుని మానవులు ఉనికిని చాటుకున్నారు!
►అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల తాజా అధికార నివేదిక.
అంటే ‘‘సార్స్’’ వైరస్ తర్వాత ‘జికా’, ఎబోలా’ వగైరా సరికొత్త వైరస్‌లు పుట్టగొడుగుల్లా వివిధ ఖండాలలో పెల్లుబుక్కుతూ వస్తున్న దశలోనే తాజా కోవిడ్–19 (కరోనా) వైరస్ కూడా మానవాళిపై విరుచుకుపడి అన్ని ఖండాలను చుట్టుముడుతూ లక్షలు, కోట్లమంది ప్రజల ప్రాణాలు తోడుకుంటోంది. ఈసారి ఈ వైరస్ వ్యాప్తికి ఖండాలు, దేశాలు, పలానా ప్రాంత ప్రజలు, జాతి, కుల, మత వివక్షలు వంటివి లేవు! ఎందుకంటే ‘రోగానికి మందుగాని మనిషి ఆయుర్దాయానికి మందు ఉండదన్నది సామెత. ప్రపంచ శాస్త్రవేత్తలు, రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్‌లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! 19వ శతాబ్దంలో వచ్చిన ‘‘స్పానిష్ ఫ్లూ’’ ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది ప్రజల ప్రాణాలు హరించివేసింది. అయినా ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు. ఈ లెక్కన నిన్న, మొన్ననే ‘ఉషోదయం’ చూడగలిగిన ‘‘2–డీజీ’’ (రక్షణ శాఖ శాస్త్ర పరిశోధన సంస్థ) సహితం కరోనా వ్యాధి సోకిన వారికి కొంత ఉపశమనం ఇవ్వగల్గిందే గాని, రాక్షస వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించగల శక్తి గలది కాదని డీఆర్‌డీవో అధినేత సతీష్‌రెడ్డి కూడా భావిస్తున్నారు! అయినా ఆ మేరకైనా కరోనా వ్యాధిగ్రస్తులకు భారీ ఉపశమనం కల్గించబోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ వైరాలజిస్టులు, జీవశాస్త్రవేత్తలయిన లూయీపాశ్చర్, కోచీలు (18–19 శతాబ్ద) చాలా దూరదృష్టితో ఒక మహా సత్యాన్ని ప్రకటించి, మానవాళిని విజ్ఞానవంతుల్ని చేయడానికి, మూఢవిశ్వాసాలను పటాపంచలు చేయడానికి ప్రయత్నించారు. జీవితం అంటేనే క్రిముల సముదాయం, క్రిములంటేనే జీవితం సుమా! మానవ జీవితాన్ని శాసించే ఆఖరి శక్తులు కూడా క్రిములేనని మరచిపోరాదు’’!
అలాగే భారత తొలితరం ప్రముఖ క్రిమి శాస్త్రవేత్త శ్రీమతి గగన్‌దీప్ కాంగ్ సహితం వైరస్ క్రిమి బతికేది కూడా మరో పరాశ్రయ క్రిమి మీదనే, ఇది సృష్టి పరిణామ క్రమంలో అంతర్భాగమని’’ గుర్తించాలని స్పష్టం చేశారు! మానవజాతి పరిణామ క్రమంలో గుహలనే స్వగృహాలుగా మలుచుకుని గడిపిన ఆ అజ్ఞాత ఆదిమ గుçహాంతర జీవులకూ నేటి మానవుల ఉనికి బాధలకూ సంబంధం ఉందని బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వినయపాండ్యే తాజా పరిశోధనల్లో తేల్చారు. పరిణామ క్రమంలో భాగంగానే నెదర్లాండ్స్ వైరస్ జీవకణాల్లోని కొన్ని కణాలు వైరస్‌ను ఎదిరించి మరీ మనగలగడం రుజువైందని అలా చెడును ఎదిరించి బతకడాన్ని ఆ ప్రయోజనకర కణాల నుంచే మానవులకు సంక్రమించిన గుణపాఠమనీ పాండ్యే నిర్ధారణ! అదే, జన్యు కణాలలో ప్రయోజనకరమైన వాటిని కాపాడే డీఎన్‌ఏకూ ఆ కణాలలోని ప్రతికూల శక్తి అయిన ఆర్‌ఎన్‌ఏకూ మధ్య నిరంతరం సాగే సంకుల సమర దుందుభులకు అసలు కారణం! బహుశా ఈ వాస్తవం దృష్ట్యానే క్రిమి శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ ప్రస్తుత కరోనా వైరస్ విలయతాండవానికి బహుశా మే ఆఖరు, లేదా ఆ ప్రాంతాలకల్లా సాధ్యమైనంత వరకు ఆటవిడుపు ఉంటుందని అనేక ఉదాహరణలు ఆధారంగా ప్రకటించగలిగి ఉంటారు! అందుకనే సుప్రసిద్ధ పరిణామవాద జీవశాస్త్రవేత్త థియోడోసియస్ డోబ్ ఝాన్సీకి ‘‘సార్స్– కోవిడ్ –2 వైరస్ వ్యాధి పుట్టుక, దాని వ్యాప్తిని పరిశోధించి ఆ వ్యాధి కారణాన్ని నిగ్గుదేల్చిన తరువాత చేసిన కీలకమైన వ్యాఖ్యను మనం మరిచిపోరాదు. ‘‘పరిణామవాద దీపకాంతిలో తప్ప జీవశాస్త్రం విశిష్టత మరో విధంగా తెలియరాదు’’ అని చాటిచెప్పారు! అలాగే సామ్రాజ్యవాద, వలస దోపిడీ విధానాల ఫలితంగా పాత, కొత్త వర్ధమాన దేశాల ఉనికిని, ప్రజాబాహుళ్యం జీవన విధానాలను చెల్లాచెదర చేసిన దారుణ యుద్ధాలు, దోపిడీల ఫలితంగా లెక్కకు మకుటంగా వైరస్‌లు వ్యాపించి ఆర్ధిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన చరిత్రను మరచిపోలేం. కనీవినీ ఎరుగని విపత్తుల నుంచి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వర్ధమాన దేశాలు ఈ రోజుకీ కోలుకోలేక పోవడానికి అపరిష్కారంగా మిగిలిపోయిన సామాజిక, రాజకీయ, మతపరమైన దారుణ వివక్షలను పాలకులు కొనసాగించడమే కారణం! ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెక్కుమంది ఉద్దేశం ఈ రోజుకీ కోవిడ్–19(కరోనా సహా) ‘‘ఫ్లూ’’ కు రకరకాల నకళ్లే. కాకపోతే వ్యాధి తీవ్రతలో, ఉధృతిలో తేడాపాడాలు! అందుకే కోవిడ్–19 భారతదేశంలో ‘ఆశ్రయం’ పొంది పెరుగుతున్న వాలకం గమనించిన వైద్యశాస్త్రంలో నిపుణులైన డాక్టర్లు పెక్కుమంది ‘కరోనా’ దాడి ప్రారంభమైనప్పటి నుంచీ కనబడిన రోగులు పెక్కుమందికి ముందు జాగ్రత్తగా ఇన్‌ఫ్లూయొంజా/ న్యూమోనియా ఇంజక్షన్‌లని వేయించుకోమని సలహా ఇచ్చారని మరచిపోరాదు. కోళ్లు, కుక్కలకు ఇతర జంతువులకు కూడా కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో చిలకలకూ ‘‘పారెట్ ఫీవర్’’ మొదలైందని వార్తలు వింటున్నాం! ఆధునిక వైద్య పితామహులలో ఒకరుగా పేరొందిన సర్ విలియం ఆస్లర్. ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధి న్యూమోనియాను మృత్యువాత పడిన రోగులకు ‘సార్స్’ అని నామకరణం చేశారు! మన దేశం నేడున్న అత్యంత విపత్కర పరిస్థితులలో కూడా ముందు చూపు కరువైన పాలక రాజకీయ నాయకత్వం కనుసన్నలలోనే, వారి ఆధ్వర్యంలోనే వందలు, వేలల్లో లాభాల వేటకు మోసులెత్తగా, ఇంకొక వైపున అసంఖ్యాక పేద మధ్య తరగతి వర్గాలు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులూ పరాయి పంచల్లో బతుకులీడుస్తూ రోడ్లపాలై బతుకులు వెల్లబుచ్చుకుంటున్నారు. అందుకే టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment