మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలన్నాడు సుమతీ శతకకర్త. విని, తొందరపడకుండా ఆలోచించి, నిజానిజాలు తెలుసుకోగలిగినవారే నీతిపరులని చెప్పాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లాడించింది. ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసింది. వీటన్నింటికీ నిజంగా కారణం కరోనాయేనా అని ప్రశ్నించే గొంతులూ ఉన్నాయి. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేసివుంటే అనవసర లాక్‌డౌన్స్ తప్పేవని ప్రొఫెసర్ చోసుడొవస్కీ లాంటివాళ్లు చెబుతున్నారు. కరోనా వల్ల ప్రపంచ సంపదను మహాశ్రీమంతులు మరింతగా పంచుకున్నారని కూడా అన్నారు. ఇందులోని నిజానిజాలు తేల్చుకోవాలన్నా ముందు ఇలాంటివాళ్ల మాటలు తొందరపడకుండా వినాలి. సత్యం దిశగా యోచించాలి.
సుమతీ శతకకారుడు బద్దెన భవిష్యత్తును ఊహించి వందల సంవత్సరాల క్రితమే బోధించిన నీతి సూత్రం ఈ క్షణానికీ ఎంత విలువైనదో మరోసారి రుజువైంది. ‘నీతి తెలిసిన వాడెవడు?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం... మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలని చెబుతూ ఇలా హెచ్చరించిపోయాడు. ‘‘విన్న తరువాత తొందరపడకుండా బాగా ఆలోచించాలి. ఆ తరువాత నిజానిజాలు తెలుసుకోగలిగినవారే లోకంలో నీతిపరులు’’ అని బోధించాడు. ఇప్పుడా బోధించే వంతు తెలివిగల రెండు ఎలుకలపై పడిందనిపిస్తుంది. ఇంతకూ ఆ ఎలుకల సంభాషణను ఒక సుప్రసిద్ధ కళాకారుడు (క్యారికేచరిస్టు) ఇలా అక్షరబద్ధం చేశాడు: ఒక ఎలుక రెండో ఎలుకను ‘‘నీవు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పోతున్నావా?’’ అని అడిగితే, ఆ రెండో ఎలుక ‘‘ఎందుకా తొందరపాటు? మనుషుల మీద ప్రయోగ ఫలితాలు తేలనీ’’ అని సరిపెడుతుంది, తెలివిగా!
ప్రపంచమంతటా 2020–21 నుంచి విస్తరించిన కరోనా వైరస్ పౌర సమాజాన్ని నాశనం చేసింది. అది విస్తరించిన దేశాలన్నిటా ఆర్థిక సంక్షోభాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బడుగు దేశాలకు, ప్రజలకు అత్యంత ఆశాజనకంగా తన విశిష్ట విశ్లేషణలను, సకాలంలో హెచ్చరికలను అందిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు కెనడాకు చెందిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ (కాట్లిన్ జాన్‌స్టోన్ ప్రత్యేక వ్యాసం 14 ఫిబ్రవరి 2022). చోసుడొవస్కీ విశ్లేషణల వల్ల ప్రపంచ వైద్య నిపుణులు సహితం పలు వ్యాపార కంపెనీల మందుల నాణ్యత గురించి ప్రశ్నించే స్థితి ఉత్పన్నమైంది.
దీనికితోడు కరోనా వైరస్‌కు దాని విభిన్న రూపాల (వేరియంట్స్) నిర్ధారణకు వాడుతున్న ఆర్‌టీ – పీసీఆర్ పరీక్షలు కూడా నిరర్థకంగా తయారైనాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడంతో పెద్ద గందరగోళం సర్వత్రా వ్యాపించింది. పైగా ‘సార్స్ – కోవిడ్ 2’ సాధారణంగా సీజనల్‌గా వచ్చే ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజాలకు మించింది కాదనీ, వాటికి వాడే సాధారణ ఇంజెక్షన్లకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్‌కు వదులుతున్న ఇంజక్షన్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులే నిర్ధరిస్తూ ఉండడంతో ప్రొఫెసర్ చోసుడొవస్కీ హెచ్చరికలకు విలువ పెరగడం మరొక విశేషం! ఈ గందరగోళం మధ్య దేశదేశాల్లో నిరంతరం జరుగుతున్న పని – లాక్‌డౌన్‌లు, ప్రజల నిత్య వర్తక వ్యాపారాలు స్తంభించి, సర్వవ్యాప్త ఆర్థిక సంక్షోభాల్లోకి దేశాల్ని నెట్టడమూ! అంతేగాదు, ఏ ‘కోవిడ్ – 19’ వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన ‘ఎం–ఆర్‌ఎన్‌ఏ’ వ్యాక్సిన్స్ ఉన్నాయో, ఆ ప్రత్యేక వ్యాక్సిన్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రపంచ వైద్యరంగంలో భారీ గందరగోళ పరిస్థితులు ఏర్పడటాన్ని నిపుణులు గుర్తించారు. అంతేగాదు, ఈలోగా ‘సమాచార స్వేచ్ఛ’ చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం, ‘కోవిడ్–19’ వ్యాక్సిన్ రక్షణ కవచమేనా అన్న సందేహం రేకెత్తడం మరొక విషమ పరిణామంగా ప్రసిద్ధ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది.
ఇన్నిరకాల పరిణామాల ఫలితంగానే ప్రొఫెసర్ చోసుడొవస్కీ ఈ కింది నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘‘ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకర సంక్షోభపు చౌరస్తాలో మనం నిలబడాల్సి వచ్చింది. మనది నడుస్తున్న చరిత్ర. అయినా 2020 సంవత్సరం జనవరి నుంచీ అనుభవిస్తున్న ఘటనల పరంపర గురించిన మన అవగాహన మాత్రం మసకబారిపోయింది. కోవిడ్–19 మహమ్మారి వైరస్ కారణాల గురించీ, దాని వ్యాప్తివల్ల కలిగే దారుణ ఫలితాల గురించీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అంతేగాదు, బయటకు చెప్పని అసలు వాస్తవం – ప్రపంచ దేశాల్ని భారీ ఎత్తున నిరుద్యోగంలోకీ, ఆర్థిక దివాళా పరిస్థితుల్లోకీ, దారుణ దారిద్య్ర పరిస్థితుల్లోకీ, నిరాశా నిస్పృహల్లోకీ నెట్టి ప్రజల్ని సుడిగుండంలోకి దించగల బడాబడా గుత్తాధిపతుల ప్రయోజనాల రక్షణకు ఈ కరోనా వైరస్ ఒక పెద్ద ముసుగని మరిచిపోరాదు. దీని ఫలితానికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురయ్యారు’’. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే సాధారణ ఇన్‌ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేస్తే మహమ్మారిని నివారించగలిగేవాళ్లమనీ, అప్పుడు అనవసర ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనలు (లాక్‌డౌన్స్) తప్పేవనీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా భద్రంగా ఉండగలిగేదనీ చోసుడొవస్కీ తన డాక్యుమెంట్‌లో స్పష్టం చేశారు (ద 2020 వరల్డ్‌వైడ్ కరోనా క్రైసిస్: డిస్ట్రాయింగ్ సివిల్ సొసైటీ, ఇంజనీర్డ్ ఎకనామిక్ డిప్రెషన్, గ్లోబల్ కూ డెటట్ అండ్ ద ‘‘గ్రేట్ రీసెట్’’).
ఈ సానుకూల నిర్ణయానికి దూరమైనందుననే కరోనా మరో సద్దు మరో సద్దుగా (సెకండ్ వేవ్, థర్డ్ వేవ్) వస్తోందన్న ప్రచారంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ దివాళా ఎత్తించారనీ ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! ఎక్కడికో అక్కర్లేదు, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారమే కనీసం అభివృద్ధి దశలోని పాతిక, ముప్ఫయ్ వర్ధమాన దేశాలలో ఈ దశలోనే కరువుకాటకాలు చుట్టుముట్టిన ఫలితంగా విలవిలలాడాయి. ఈ దశలో అనేక కంపెనీలూ, సంస్థలూ దివాళా ఎత్తడానికి, నిరుద్యోగం పెచ్చరిల్లిపోవడానికి ‘వైరస్’ కారణమన్నది కేవలం సాకు మాత్రమేనని కూడా ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! అంతేకాదు, ఆర్థిక వ్యవస్థలు ఈ దశలో – అంటే కరోనా కాలంలో చితికిపోతున్న సమయంలోనే 2020 ఫిబ్రవరి నుంచీ బిలియన్ల కొలదీ డాలర్లను మహాకోటీశ్వరులు ఎలా పోగుచేసుకుని బలిసిపోయారో డాక్యుమెంట్ ప్రస్తావించింది. కానీ, అసలు వాస్తవం ఏమంటే – ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో ప్రపంచ సంపదను భారీఎత్తున బడా సంపన్న వర్గాలు తమ మధ్యన పునఃపంపిణీ చేసుకోవడం (రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్) జరిగిందని ఆ డాక్యుమెంట్ వివరించింది!
బహుశా అందుకే ‘టెంపెస్ట్’ (పెను ఉప్పెన) అన్న రచనలో ‘‘నరకలోకం ఖాళీ అయిపోగా, దయ్యాలన్నీ ఇక్కడ చేరా’’యని మహాకవి, నాటకకర్త షేక్‌స్పియర్ అన్నాడు! మరొక రహస్యం ఈ సందర్భంగా మరచిపోరానిది – ప్రజలలో విశ్వాస వారధులు నిర్మించి, కష్టాలను కడు ధైర్యంతో ఎదుర్కోగల చేవను ఎక్కించవలసినవాళ్లు కూడా కోవిడ్–19 గురించిన రకరకాల తప్పుడు సమాచారాన్ని భుజాన వేసుకోవడం! వాస్తవాల్ని తెలుసుకోగోరే ప్రాథమిక మానవ హక్కుల్ని పౌరులు చలాయించగల ధైర్యస్థయిర్యాలను అందించాల్సిన అవసరాన్ని ఆ డాక్యుమెంట్ ఎత్తిచూపింది. దీనికితోడు, కోవిడ్–19 చాటున మరో పెను పరిణామం ముంచుకొస్తోందనీ, పైస్థాయిలో ప్రపంచ ద్రవ్య వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మరీ నిర్ణయాలను రుద్దే సరికొత్త విధాన వ్యవస్థ బ్రహ్మప్రళయంగా రూపుదిద్దుకుంటోందనీ, ఇది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందనీ చెప్పింది. ఇలాంటి ఆదేశాలను అనేక దేశాలలోని అవినీతిపరులైన రాజకీయవేత్తలకు ఏకకాలంలో బట్వాడా చేసే విధానం రూపొందించడం జరుగుతుందని చోసుడొవస్కీ హెచ్చరించారు. మొత్తం ఐక్యరాజ్యసమితి ఈ వినాశకర ఎత్తుగడల పట్ల మూగనోము పట్టగల ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. అందుకే, తత్త్వవేత్తలు ఒక సత్యాన్ని వెల్లడించాల్సి వచ్చింది– ‘‘అబద్ధం ఒకసారి నిజమైతే, ఇక వెనక్కి మళ్లే సమస్య ఉండదు’’. పిచ్చి తలకెక్కింది. రోకలిచుట్టమన్నట్టుగా, ఆ పని జరిగితే ప్రపంచం తలకిందులు కాక తప్పదు. కనుకనే మానవాళి ఇప్పుడు సమస్యల చౌరస్తాలో కొట్టుమిట్టాడుతోందని విజ్ఞుల భావనగా అర్థం చేసుకోవాలి!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment