బలిపీఠంపై ‘విశాఖ ఉక్కు’! | ABK Prasad Special Article On Visakha Steel Plant Issue | Sakshi
Sakshi News home page

బలిపీఠంపై ‘విశాఖ ఉక్కు’!

Published Tue, Feb 9 2021 12:49 AM | Last Updated on Tue, Feb 9 2021 9:16 AM

ABK Prasad Special Article On Visakha Steel Plant Issue - Sakshi

క్రీస్తుపూర్వం 1800 నాటికే మధ్య గంగానదీ లోయలో ముడి ఇనుము నిల్వలు ఉన్నాయి. వాటి సాయంతోనే లోహాల ఉత్పత్తికి భారతదేశంలో అంకురార్పణ జరిగింది. అత్యంత నాణ్యమైన ఉక్కు దక్షిణ భారతం నుంచే ప్రాచీన యూరప్, చైనా, అరబ్, మధ్య ఆసియాలకు ఎగుమతి కావడం చరిత్ర. పరిశ్రమ సాధనలో, ఆంధ్రులంతా ఒక్కటై సాగడంలో మళ్లీ అంతటి చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. పబ్లిక్‌రంగ పరిశ్రమల్లో తలమానికమైన ‘విశాఖ ఉక్కు’ను ప్రైవేట్‌ వ్యక్తుల లాభాల పెరపెరకు బలిపెట్టడం దారుణం. ఒకవైపు ఆత్మ నిర్భర భారత్‌ నినాదం ఇస్తూనే, ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీలును ప్రైవేట్‌పరం చేయబూనుకోవడం శోచనీయం. 

‘‘1750 నాటికి ప్రపంచ ఉత్పత్తుల రంగంలో మూడింట ఒక వంతు స్థానం చైనాది కాగా, ఇండియాది నాల్గింట ఒక వంతు స్థానం. మొత్తం పశ్చిమ దేశాలన్నీ కలిపి చేసిన ఉత్పత్తులు అయిదోవంతు కన్నా మించలేదు. ఆ తరువాత దశాబ్దాలలో పశ్చిమ దేశాల పారిశ్రామికీకరణ విధానంవల్ల మాత్రమే మిగతా ప్రపంచ దేశాలను పారిశ్రామికీకరణలో వెనక్కి నెట్ట గలిగాయి. అంతవరకూ ప్రపంచంలో మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో అగ్రస్థానం చైనా, ఇండియాలదేనని మరవరాదు’’.
– శామ్యూల్‌ హటింగ్టన్‌: ‘క్లాష్‌ ఆఫ్‌ సివిలైజేషన్స్‌’

ప్రాచీన చరిత్రలు గల భారత్, చైనా వేల ఏళ్ల చరిత్ర కలిగిన మొహం జదారో, హరప్పా నాగరికతల కాలంలోనే ముడి ఇనుము, ఉక్కు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందాయని పలువురు పాశ్చాత్య, భారత చరిత్ర కారులు, శాస్త్రీయ నాగరికతల సుప్రసిద్ధ చరిత్రకారుడైన ప్రొఫెసర్‌ నీడ్‌హామ్‌ పేర్కొన్నాడు. ఈ కోణం నుంచి పరిశీలించినప్పుడు, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’గా చాటి, పట్టువీడని అభినవ ‘భట్టిమార్కులు’గా ప్రభుత్వ రంగంలో ఆంధ్రులు  సాధించుకున్న ప్రసిద్ధ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒక్క కలంపోటుతో ప్రైవేటీకరించడానికి చడీచప్పుడు లేకుండా సిద్ధమ య్యారు. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌ (2021–22) ప్రతి పాదనల్లోగానీ, అంతకుముందు ఆర్థిక సర్వేక్షణ సమీక్షలోగానీ సూచన మాత్రంగా కూడా దీని ప్రస్తావన లేకుండా ‘కూబీ’తనంతో అకస్మా త్తుగా ప్రభుత్వ రంగ ‘విశాఖ స్టీల్‌’ను ప్రైవేట్‌ కంపెనీకి ధారాదత్తం చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. వేలాదిమంది ప్రత్యక్ష ఉపాధికి, మరి కొన్ని వేలమంది పరోక్ష ఉపాధి కల్పనకు చేయూతనందివ్వడమేగాక పబ్లిక్‌రంగ పరిశ్రమల్లో మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా 2019 దాకా తలమానికంగా ఎదుగుతూ వచ్చిన ‘విశాఖ ఉక్కు’ను ప్రైవేట్‌ వ్యక్తుల లాభాల పెరపెరకు బలిపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఉక్కు కర్మాగార సాధనకు వైశాఖీయులు సహా యావదాంధ్ర ప్రజలు ఉద్యమించారు. కర్మాగార సాధన యాత్రలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు 32 మంది నిండు ప్రాణాలు బల య్యాయి. పరిశ్రమ సాధనకు సారథ్యం వహించినవారిలో హేమా హేమీ రాజకీయవేత్తలు, ప్రజోద్యమాలలో తలపండిన తెన్నేటి విశ్వ నాథం, గౌతు లచ్చన్న, కాళోజీ నారాయణరావు, పరకాల శేషావ తారం, చాగంటి రామకృష్ణ, ముప్పవరపు వెంకయ్యనాయుడు వగైరా రాష్ట్ర, స్థానిక నాయకులెందరో ఉన్నారు. అది రక్తతర్పణతో కూడిన చరిత్ర. ప్రజల మనోభావాలను కుల, మతాల పేరుతో రెచ్చగొట్టి, పబ్బం గడుపుకునే సంస్థలు, రాజకీయ పక్షాలకు భిన్నంగా ఉపాధి అన్వేషణ కోసం సాగిన మహోద్యమం అది. 

ప్రజల మనోభావాలతో నిమిత్తంలేని స్వార్థపూరిత ఎన్నికల ప్రయోజనాల కోసం రూపొందించే రాజకీయ బడ్జెట్లు కేవలం ప్రైవేట్‌ రంగ ప్రయోజనాలకే ఉపయోగపడతాయి. ఒకవైపున కేంద్రం వద్ద స్టీల్‌ అథారిటీ ఆధ్వర్యంలో 200 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము నిల్వలు మూలుగుతున్న సమయంలో అదే ముడి ఇనుము అవసర మున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆ నిల్వలనుంచి ముడి ఖనిజాన్ని తరలించి ఆదుకోవచ్చుగదా? ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా కేంద్రం, ప్రపంచబ్యాంక్‌ ప్రపంచీకరణ విధానంలో భాగంగా ప్రైవేట్‌ రంగ ప్రయోజనాల రక్షణ పథకాన్ని తు.చ. తప్పకుండా అనుసరిస్తోంది. అంతా మళ్లీ ప్రధాని మోదీ భాషలో ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ (ఆత్మ నిర్భర భారత్‌) నిర్మాణ నినాదం ముసుగులోనే చాపకింద నీరులా ప్రభుత్వరంగ సంస్థలు కనుమరుగవుతున్న దశ ఇది. 

ఈ విషయంలో తెలుగువారి తొలి ‘నష్టజాతకుడు’ చంద్రబాబు నాయుడు పాలనలోనే 2015లో విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయడానికి కుట్ర జరిగిందని మరచిపోరాదు. అయినా బైలదిల్లా గనుల నుంచి ఎక్కువ ధర పెట్టి వైశాఖీయులు ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అకుంఠిత దీక్ష కారణంగానే ఉక్కు ఫ్యాక్టరీ నిలబడుతూ, నిలబడుతూ 2019 నాటికి లాభాలలోకి కూడా వెళ్లినట్లు దాఖలాలున్నాయి. చంద్రబాబు తలపెట్టిన ప్రైవేటీకరణ మైకంలోకి ‘విశాఖ స్టీల్‌’ కన్నా ముందు హైదరాబాద్‌లోని ఆల్విన్‌ కర్మాగారం, నిజామాబాద్‌లోని ప్రసిద్ధ చక్కెర ఫ్యాక్టరీలను కూడా నెట్టాడు. బాబులోని ఈ ‘ఆత్రం’, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌... విశాఖ స్టీల్‌పై కేంద్రవైఖరితో విభేదిస్తూ కర్మాగార రక్షణకు, ఉద్యోగుల ఉపాధి రక్షణకు వీలైన క్రియాశీల ఆచరణాత్మక పథకాన్ని ప్రత్యామ్నా యంగా చూపేదాకా ఆగలేదు. 

నేడు మనదేశంలో రెండు రకాల ఉక్కు కర్మాగారాలున్నాయి– చిన్న ఫ్యాక్టరీలు, సంఘటిత(ఇంటిగ్రేటెడ్‌) కర్మాగారాలు. దేశంలో మొత్తం 50 ఇనుము, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలున్నాయి. ఇక కేంద్ర స్టీల్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు: దుర్గాపూర్, ఛత్తీస్‌ గఢ్, బొకారో, చంద్రాపూర్, హజీరా, నిప్పాన్, ఛత్రపతి, విశాఖ, హోస్పేట్, తారాపూర్, ధరంతార్, కళింగనగర్‌. ఇంతకూ అసలు విచిత్రం– 2005లో ప్రపంచస్థాయి స్టీల్‌ స్థాయి నాణ్యత, సామర్థ్యాన్ని పాటించే ప్రమాణంలో ఉక్కు ఉత్పత్తి చేయాలని ప్రకటించడం; 2019–20 నాటికి ఏడాదికి 3 కోట్ల 80 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం. అయితే 2017లో బీజేపీ పాలకులు జాతీయ స్థాయిలో ఉక్కు ఉత్పత్తికి విధాన నిర్ణయం తీసుకున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంగానే స్టీల్‌ ప్రొడక్షన్‌ పాలసీ ఉండాలని నిర్ణయించారు. దీనికి చెప్పిన కారణం ఏమిటి? ఉక్కు పరిశ్రమలు భారీ అప్పుల్లో ఉన్నాయి; ఉక్కు గిరాకీ తగ్గిపోయింది; లోహ పరిశ్రమ లకు ఉపయోగించే కోల్‌ నాణ్యత పడిపోయింది; ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి; చైనా, కొరియాల నుంచి చౌకరకం దిగుమతులు వస్తు న్నాయి; ఇవి భారతదేశానికీ ఉక్కు ఉత్పత్తిదార్లకూ సంతృప్తిగా లేవు. 

నిజానికి ఉక్కు ఉత్పత్తిలో స్వయం పోషకంగా ఉండాలని; ప్రపంచస్థాయిలో గట్టి పోటీ యివ్వాలని; ఇందుకోసం ఉక్కు కర్మా గారాలకి అవసరమైన కోకింగ్‌ బొగ్గు లాంటి ముడిపదార్థాల్ని తక్కువ రేటుకి దిగుమతి చేసుకోవాలని; ఎక్కువ ఉత్పత్తి ఖర్చుల భారం పడకుండా ఉండాలంటే– ‘సాగరమాల’ పేరుతో సముద్రతీరం వెంట ఉక్కు పరిశ్రమలను నెలకొల్పాలని కూడా ఓ విధాన నిర్ణయం చేసింది ప్రభుత్వం. మరి ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ లను ప్రభుత్వరంగం నుంచి తప్పించి ప్రైవేట్‌ రంగానికి ఎందుకు ధారాదత్తం చేయాల్సి వస్తోంది? ఈ రోజున పాలకులు తమవద్ద 200 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము నిధులున్నాయని గొప్పలు చెప్పుకొం టున్నా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అక్కరకు రాని ఆ నిధులు దేనికి? ప్రైవేట్‌కు కుదువపెట్టడానికా? అంటే, ఉక్కు ఉత్పత్తులకు కావలసిన ముడి ఇనుము నిధులయితే ఉన్నాయిగానీ అవి ప్రభుత్వరంగ కర్మగా రాలకు మాత్రం మళ్లించరా? పరిశ్రమ నడవడానికి యిచ్చే ప్రభుత్వ రుణాలను పరిశ్రమలో పెట్టిన ఈక్విటీగా మళ్లించి ప్రభుత్వం ఎందుకు రక్షణగా నిలబడకూడదు? 

క్రీస్తుపూర్వం 1800 నాటికే మధ్య గంగానదీ లోయలో ముడి ఇనుము నిల్వలు ఉన్నట్టు, వాటి సాయంతోనే లోహాల ఉత్పత్తికి భారతదేశంలో అంకురార్పణ జరిగినట్టు ప్రసిద్ధ భారత పురాతత్వ శాస్త్రవేత్తలు రాకేష్‌ రెడ్డి, అదితి వేణుగోపాల్‌ వెల్లడించారు. ఆమాట కొస్తే అత్యంత నాణ్యమైన ఉక్కు (ఊజ్‌ స్టీల్‌) దక్షిణ భారతం నుంచే ప్రాచీన యూరప్, చైనా, అరబ్, మధ్య ఆసియాలకు ఎగుమతి కావడం ఒక చారిత్రక సత్యం! ఇంతకూ ఆంధ్రోద్యమ కార్యకర్తల్లో ఒకరుగా ఉన్న మన భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ‘ఆంధ్రుల హక్కు’ కోసం తన పదవీ త్యాగానికైనా సిద్ధపడగలరా?


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement