‘అత్తెసరు’ మెజారిటీతో 2014లో బతికి బట్టకట్టిన చంద్రబాబు ఎప్పటికైనా ఇది కొంపముంచుతుందని ఆ క్షణం నుంచే బెంబేలుపడుతూ అసెంబ్లీలో టీడీపీదే మెజారిటీ అనిపించుకునే రంధి కొద్దీ తొక్కని అడ్డదారులు లేవు. ఓటర్ల యావత్ సమాచారం తమ పార్టీ (టీడీపీ) కార్యకర్తలవద్ద ఉంటే తప్పేంటనీ, వారు ఎవరికి ఓటు వేస్తారు అనే వివరాలు సేకరిస్తే తప్పెలా అవుతుందనీ ప్రశ్నించే చంద్రబాబును ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకుగాను శిక్షార్హమైన పాలకుడిగా పరిగణించాల్సిన అవసరం లేదా? లక్షలాదిమంది దగాపడిన ఓటర్ల నుంచి, పలు పార్టీల నుంచీ అందిన సాధికార రుజుపత్రాల ఆధారంగా ఎన్నికల సంఘం/న్యాయస్థానం చంద్రబాబును ప్రశ్నించవద్దా?!
‘‘ఎన్నికల ప్రక్రియలో ఓట్ల కొనుగోలు, అమ్మకాలు అనే పద్ధతుల ప్రవేశంతో ప్రజా స్వామ్యం, ప్రజాతంత్ర వ్యవస్థల పతన దశ ప్రారంభమైంది. ఇదే రోమన్ రిపబ్లిక్ పతనానికి నాంది పలికింది’’
– రిపబ్లిక్ పతన చరిత్రలో 2000 ఏళ్ల క్రితం ప్లూటార్క్
స్వతంత్ర భారత రిపబ్లిక్‌లో ఎన్నికలు స్వేచ్ఛగానూ, నిష్పక్షపాతంగా జరగాలని నిర్దేశిస్తున్న భారత రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియ యావత్తూ ఎన్నికల సంఘం అజమాయిషీలో, నిర్దేశంలో, దాని అదుపాజ్ఞల్లో జర గాలని ఆదేశిస్తూ రాజ్యాంగం 324వ అధికరణ ఇలా స్పష్టం చేసింది. ‘ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడా నికి కుల, మత, వర్ణ, లింగ వివక్ష ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ అనర్హుడిగా చేయరాదు’. – 324వ అధికరణ
ఈ ఆదేశాలకు, హెచ్చరికలకు బద్ధవిరుద్ధంగా నేడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆగడాలు పురిపిప్పుకుని బాహాటంగా సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో శాసనసభల కాలపరిమితి ముగియనున్న రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా (తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి) సార్వ త్రిక షెడ్యూల్స్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ ఎన్ని కలు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమై, అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, వాటి గడువు, ఉపసంహరణ ప్రక్రియ సహా 28తో ముగిసి, ఏప్రిల్ 14న పోలింగ్ అనంతరం మే 23న పార్టీల, అభ్యర్థుల జాతక ఫలితాలతో ముగుస్తుంది. బహుశా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇంత స్వల్పమైన వ్యవధిలో ఆగమేఘా లపై ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారేమో! ఈ పరిస్థితుల్లో 2014లో తెలుగు ప్రజల కృత్రిమ విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కాదలిచిన చంద్రబాబు అతుకుల బొంత మెజారిటీతో (వైఎ స్సార్‌సీపీపై మొత్తం ఓట్లలో కేవలం సుమారు ఒకటిన్నర శాతం ఓట్ల అత్తెసరుతో) బీజేపీ సత్తరగాయ చేయూతతో అధికారాన్ని చేపట్టారు. అది మొదలు ఈ ’అత్తెసరు’ మెజారిటీ ఎప్పటికైనా కొంపముంచుతుం దని బాబు ఆ క్షణం నుంచే బెంబేలుపడుతూ రాష్ట్ర శాసనసభలో టీడీ పీదే మెజారిటీ అనిపించుకునే రంధి కొద్దీ తొక్కని అడ్డదారులు లేవు. ఇటీవల ఆధునిక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మాధ్యమంగా, కృత్రిమ పద్ధతుల ద్వారా వోటర్ల జాబితాలలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ(వైఎస్ జగన్‌కి) అనుకూలంగా ఉండే ఓటర్లను పనిగట్టుకుని ఏరివేసి ఆ ఓటర్లే తమ పేరు తొలగించవలసిందిగా దరఖాస్తులు పెట్టుకున్నట్లుగా ‘చిత్ర గుప్తుడి’ చిట్టాలు తయారు చేయించారు!
ఈ భారీ ప్రక్రియకు సిద్ధాంతపరంగానూ, ఆచరణరీత్యానూ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీని తన కనుసన్నల్లో ఉంచుకుని, ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ప్రక్రియకు అతి రహస్యంగా ప్రయత్నాలు చేసినట్లు వార్తాసంస్థలు విశ్వసనీయ కథనాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియకోసం చంద్రబాబు వాడుకుని ప్రస్తుతం ఇబ్బందుల్లోకి నెట్టేసిన వ్యక్తి అశోక్. ఐటీ గ్రిడ్స్ కేంద్ర కార్యాలయ స్థానం హైదరాబాద్‌లో ఉన్నందున, దాని ఆధారంగా ఓటర్ల జాబితాలలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనుమానించిన ప్రధాన ప్రతిపక్షం సహా ఇతర ప్రత్యర్థుల ఓట్లను కూడా జాబితా నుంచి తప్పించే పన్నుగడ పన్నడానికి విశాఖలో నెలకొల్పిన ‘బ్లూఫ్రాగ్’ (సాధికారిక అనుమతులు లేని) కంపెనీని వినియోగించు కోవడమే కాకుండా ఇంగ్లండ్‌లో ఉన్న ‘సాఫ్ట్‌ల్యాబ్స్’ అనే ఒక కృత్రిమ కంపెనీని కూడా వాడుకుని ఓటర్లకు చెందిన సమస్త వ్యక్తిగత సమా చారాన్ని సాఫ్ట్ వేర్‌లో నిక్షిప్తం చేసిన ఆధార్, పాన్, బ్యాంక్ అక్కౌంట్ నంబర్లు సహా ప్రయివేట్ కంపెనీ చేతికి ధారాదత్తం చేయడం ఒక ప్రహసనంగా మారింది.
ఇలా తమ అధికార దాహంతో పరుల చేతుల్లోకి ప్రతిపక్ష ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని బదలాయించడం ఎంత ప్రమాదకరమో ‘ఫేస్ బుక్’ అధినేత జుకర్‌బెర్గ్ సాంకేతిక పరిజ్ఞానం చాటున సృష్టించిన టెక్నాలజీ మాయాజాలం బహిర్గతం చేసింది. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ రకరకాల ‘యాప్స్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతమంది సాధా రణ పౌరులు వర్తక, వ్యాపార వర్గాల, ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోయిందో, ఆధార్‌వల్ల వ్యక్తిగత సమాచారానికి ‘గోప్యత’ దెబ్బతింటుందని, అందుకు తాము అంగీకరించబోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి మరచిపోరాదు. అయినప్పుడు చంద్రబాబుకు సాంకేతిక సమాచార గుప్త కేంద్రంగా మారిన ‘ఐటీ గ్రిడ్స్’, ‘బ్లూఫ్రాగ్’, ‘సాఫ్ట్ ల్యాబ్స్’ (బ్రిటన్) కార్యాలయాలను పోలీసు నిఘా వర్గాలు దాడిచేసి సోదాలు నిర్వహించాల్సి వచ్చింది.
అంతేగాదు, జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ద్వారా 20 కోట్ల మంది భారతీ యుల వ్యక్తిగత సమాచారాన్ని తాను దొంగిలించి అమెరికాలో నిక్షిప్తం చేసి అభాసుపాలైన తరువాత ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపు తున్నాడు. ‘వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా ‘స్నేహపూర్వకమైన ఫేస్‌బుక్’ సిద్ధం చేస్తున్నానని, ఇది ఎన్నికలలో ఓట్లను తారుమారు చేసే ప్రక్రియకు ఇక దూరంగా ఉంటుందన్న దొంగ హామీలతో (6.3.19) ముందుకొస్తున్నాడు. ఈ విషయమై ఫేస్‌బుక్, వాట్సప్ టెక్నాలజీ పని చేసే పద్ధతుల గురించి సాంకేతిక సమాచారం వివరాలు రాబట్టేందుకు ఇటీవలనే భారత పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందం (పానెల్ 6.3.19) ఏర్పడింది. అది ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మాధ్య మాలు దేశంలోని ఎన్నికల సందర్భంగా ఓటర్లలో అనుమానాలు రేకె త్తించి, ప్రజలలో అలజడిని హింసాకాండను ప్రజ్వరిల్ల చేయడానికి వేదికలు కారాదని హెచ్చరించవలసి వచ్చిందని మరవరాదు. పైన పేర్కొన్న మూడు టెక్నాలజీ నియోగిత మాధ్యమాలు మూడురకాల వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. ఫేస్‌బుక్ ఏకకాలంలో– అడ్వరై్టజింగ్ సంస్థగా, మీడియా సంస్థగా, మార్కెటింగ్ సంస్థగా ‘త్రిపాత్రాభినయం’ చేస్తోంది. కృత్రిమ వంగడాల ద్వారా వర్ధమాన దేశాల వ్యవసాయ పంట లను ఎలా దెబ్బతీస్తున్నారో అలాగే ఫేస్‌బుక్ సంస్థ కూడా ఓ కృత్రిమ (దొంగ) కంపెనీగానే పనిచేస్తున్నట్టు పార్లమెంటరీ పానెల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
పానెల్ సమావేశానికి గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు జోయెల్ కప్లాన్, వైస్– ప్రెసిడెంట్, ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్‌మోహన్, ఇండియా పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ అఖీదాస్ హాజరయ్యారు. అంతేగాదు, ఈ ఆన్‌లైన్ దుర్వినియోగం, డేటా చోరీలు నాయకుల నుంచి అన్ని స్థాయిల్లోనూ భారీగా ఎంత యథేచ్ఛగా సాగు తున్నాయో, భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కనీసం 16 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఎలా చోరీ అవుతున్నాయో వివరించాయని మరచి పోరాదు. ఫలితంగా భారత ప్రజల గోప్యతా ప్రయోజనాలకు ఏ మేరకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందో జాతీయ స్థాయి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రపంచ స్థాయి సైబర్ నేరాల నిఘా ఏజెన్సీలతో కలిసి ఇప్పటిదాకా ఎంత నష్టం వాటిల్లిందీ అంచనా కడుతున్నారు.
చంద్రబాబు నర్మగర్భంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ప్రతి పక్షం సహా తమకు ఓటు వేయరనుకున్న ఆయా పార్టీల కార్యకర్తల ఓట్లను పక్కకు తప్పించగల పోర్టల్స్ వెనక దాక్కుంటున్నారని కొందరు నిపుణుల రీడింగ్! డేటా చోరీకి గురైన ఆప్స్‌లో డబ్స్‌మాచ్/ఆర్మోర్ గేమ్స్/కాఫీమీట్స్ బాజెల్ ఉన్నాయి (6.3.19). వీటి వినియోగదార్ల వ్యక్తిగత వివరాలన్నీ ‘హుష్‌కాకి’ అయిపోయాయి. సైబర్ సంగ్రామ్ చతుర్ల నీతికి బలైపోయాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఇంతటి భారీ స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలను సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా రక్షించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ఎన్ని కల సంఘాలు నిర్వహిస్తున్న అరక్షిత ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, వారి ఓటు ప్రాథమిక విలువల్ని ఏ మేరకు రక్షించగలవన్నది రాను రాను మరింత ప్రశ్నార్థకంగా మారి పోయింది. ప్రజల్ని ఎదురు ప్రశ్నించే పాలకులు ఉన్నంతకాలం ప్రశ్నించే ప్రాథమిక హక్కును కూడా ప్రజలు కోల్పోక తప్పదు. పైగా ఓటర్ల యావత్ సమాచారం తమ పార్టీ (టీడీపీ) కార్యకర్తలవద్ద ఉంటే తప్పేం టనీ, ఎవరికి ఓటు వేస్తారని వివరాలు సేకరిస్తే తప్పెలా అవు తుందనీ ప్రశ్నించే ముఖ్యమంత్రిని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకుగాను శిక్షార్హ మైన పాలకుడిగా పరిగణించాల్సిన అవసరం లేదా అని లక్షలాదిమంది దగాపడిన ఓటర్లనుంచి, పలు పార్టీల నుంచీ అందిన సాధికార రుజుప త్రాల ఆధారంగా ఎన్నికల సంఘం/న్యాయస్థానం ప్రశ్నించవద్దా?!
ఇవన్నీ ఒక ఎత్తయితే మన దేశంలో రాజ్యాంగ సంస్థల తీరుతెన్నులు మరొక ఎత్తు. న్యాయవ్యవస్థ మొదలుకొని వివిధ రాజ్యాంగ సంస్థలు కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా యన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇందుకు ఆ సంస్థల బాధ్యత కూడా ఉంది. ప్రపంచంలో అత్యంత అధునాతమైన సాంకేతికతను వినియోగించే అమెరికా, జపాన్‌లు సైతం ఈవీఎంలు వాడనప్పుడు మన దేశంలో మాత్రం బ్యాలెట్ పత్రాలను తప్పించి, వాటిపైనే ఎందుకు ఆధారపడుతు న్నామన్న సంశయం చాలామందికి ఉంది. ఈ అంశంలో రాజ్యాంగ సంస్థలు తగినంతగా విచారణ జరిపాయా? ఇది ఆలోచించాల్సిన అంశమే. ప్రజాస్వామ్యం మనగలగాలంటే, కిందిస్థాయి వరకూ ప్రజాస్వామిక సంస్కృతి బలపడాలంటే అన్ని వ్యవస్థలూ సమష్టిగా కృషి చేయాలి.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment