చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య
ఏవి తల్లీ నిరుడు కురిసిన
హిమసమూహములు?
జగద్గురువులు, చక్రవర్తులు
సత్కవీశులు, సైన్యనాథులు
మానవతులగు మహారాజ్ఞులు
కానరారేమీ?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయిన జాడలేవీ,
ఏవి తల్లీ...?
కవి వాక్కులో, ఆ ప్రశ్నపరంపరలో ఎంతటి చారిత్రక పరిణామ క్రమం దాగి ఉందో అర్థం అవుతుంది. వర్తమాన ప్రపంచంలో, ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు తొలగకుండానే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశించి ఆవహించిన మనలాంటి సామాజిక రాజకీయ వ్యవస్థల్లో అనేక ఆటంకాల మధ్యనే సాధ్యం కాగల ప్రజాహిత సంస్కరణలకు నడుం కట్టగల యువనేతలు, యువ రాజ కీయవేత్తలు తలెత్తడం చరిత్రకు కొత్తేమీకాదు. అలాంటి వారు మనం ఊహించేంత విప్లవకారులో, రాడికల్సో కాకపోయినా పేద, మధ్య తరగతి ప్రజల ఈతిబాధల్ని అర్థం చేసుకుని తమ శక్తియుక్తులను ప్రజాహిత సంస్కరణలను అమలుపర్చడానికి నడుం కట్టినవారై ఉండొచ్చు. చీకటి ఉన్న చోట చిరుదీపాల్ని వెలిగించి మార్గనిర్దేశం చేసే వాళ్లు విప్లవకారులే కానక్కర్లేదు. సంస్కరణవాదులే కావచ్చు.
గత ఔన్నత్యాన్ని మర్చిపోయారా?
ఈ గుర్తింపునకు దూరమైనందువల్లనే ఎన్నో ఏళ్లుగా పోరాటాల అను భవంలో తలపండిన ఎంతోమంది వామపక్ష నాయకులున్నా, డెబ్బై, ఎనభైఏళ్ల త్యాగాల చరిత్ర ఉన్నా – నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి కొన్ని వామపక్షాలు, అందులోని కొందరు నాయకుల ప్రవర్తన మాత్రం ప్రజ లకు నిరాశ కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఆ పక్షాలకు చెందిన కొందరి ప్రవర్తన, వైఖరి చివరికి ప్రజాహిత సంస్కరణలకు కూడా వ్యతిరేకించినవిగా ప్రజల మనస్సుల్లో రిజిస్టర్ కావటం వామపక్షాల గత ఔన్నత్యానికి మంచిది కాదు. ఈమాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే–గతంలో ఆంధ్రరాష్ట్రంలో 1940వ దశకంలో కరువు పరి స్థితులు తాండవిస్తున్న రోజుల్లో కరువు కోరలనుంచి రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ చీలి కలు లేకుండా ఉమ్మడిగా ఒక్క త్రాటిపైన నడుస్తున్న శుభ ఘడియలో బందరు కాల్వలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరి ఆహ్వానం లేకుండానే భారీస్థాయిలో పూడికలు తీసిన మహోన్నత చరిత్రను మరవలేము.
ఈ ప్రజాహిత కార్యక్రమానికి ప్రత్యక్షంగా నడుం బిగించి, నిర్మాణ కార్యక్రమానికి నాయకత్వం వహించిన అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు ప్రభృతులు. ఆనాడు కాంగ్రెస్ వారు ఆ కాల్వల పూడికలు తీయడంలో పాలుపంచుకోవడా నికి నిరాకరించారని మరిచిపోరాదు. ఆ పూడికల కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీతో సంబంధం లేనివారు కూడా ఆ ఉమ్మడి ప్రజా హిత కృషిలో పాలుపంచుకున్నారు. చివరికి నాటి కమ్యూనిస్టు పార్టీలో కూడా ఈ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనే విషయంలో కొన్ని రకాల గొణుగుళ్లు, సణుగుళ్లు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని సుందరయ్య తన ఆత్మ కథలో కూడా రాసుకున్నారు. ఆ చరిత్రలో కరువు కాలంలో బందరు కాల్వలకు పూడికలు తీసి పేద రైతు, వ్యవసాయ కార్మికుల ఉసురు నిలిపేటట్టు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషిని సుందరయ్య ఇలా వివరించారు.
వలంటీర్ల సమీకరణ కోణంలో అతిపెద్ద విజయం
‘‘ఈ మధ్యకాలంలోనే (కరువుకాలం) మేము చేపట్టిన మరో కార్య క్రమం బందరు కాల్వ పూడికలు తీయడం.. కాలువ లోతట్టు పూడు కుపోయి లోతు తగ్గిపోయి, పొలాలకు నీళ్లుసరిగా పారని స్థితి ఏర్ప డింది. ఇంజనీర్లకు తగినంత మంది కూలీలు దొరక్క బందరు కాల్వ పూడిక తీత చేపట్టలేకపోయారు. ఆ పరిస్థితిలో మేము ముందు కొచ్చి, నామమాత్రపు వేతనాలకు ఆ పూడిక బాధ్యతను నిర్వర్తిస్తామని ఇంజ నీర్లకు చెప్పాం. ఆ మేరకు పనిచేయాలని పార్టీ సభ్యులకు పిలు పిచ్చాం. వాలంటీర్లకు భోజన వసతి సౌకర్యాలకు మాత్రమే మేము ఏర్పాటు కల్పించాం. ఇతరులకు వసతి సౌకర్యం కల్పించాం. అలా బందరు కాల్వ తూర్పు గట్టు కాల్వ తవ్వే పని నెలరోజుల్లోపు పూర్త యింది. శ్రామికుల పార్టీగా వలంటీర్ల సమీకరణ కోణం నుంచి చూస్తే అప్పటికిది చాలా పెద్ద విజయమే.
ఈ కృషి రైతాంగంపై గొప్ప ప్రభావాన్ని కలగచేసింది. ఈ విషయంలో మనం మరీ సంస్కరణ వాదులుగా మారిపోతున్నా మని విమర్శ కూడా కొంతమంది నుంచి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం నిర్వహించవలసిన పనులని వారన్నారు. మనం అంత పెద్ద బరువును మీద వేసుకుని ఉండాల్సిందా లేదా అన్నదానిపై ఆంధ్రకమ్యూనిస్టు పార్టీ కమిటీలో కూడా విభేదాలొచ్చాయి. ఏమైనప్పటికీ అత్యధికులు మాత్రం ఈ కార్యక్రమం (కాల్వ పూడికలు తీయడం) మంచిదని భావించారు. ఆ విధంగా నా వాదన సరైందని రుజువైంది. పార్టీ, కేంద్రకమిటీ కూడా కాల్వ పూడి కల తీత కార్యక్రమాన్ని కొనియాడింది. నిజానికి ఆ తర్వాత జరిగిన నేత్రకోన మహాసభలో ప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో అమలు చేయదగిన ఉదాహరణగా అందరి కార్యకర్తల అనుభవాన్ని పేర్కొన్నది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రలోని గ్రామాల్లో సాగునీటి కాల్వల తవ్వకం చెరువుల పూడిక తీతను చాలా విస్తృత స్థాయిలో చేప ట్టాము.’’
బాబు నీడలో కొందరు వామపక్ష నేతలు
ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, నాయకుల బాధ్యత, ప్రవర్తన ఎలా ఉండాలో, దానిపై ఆధారపడే కార్యకర్తల కార్యాచరణ కూడా ఉంటుం దని తమ జీవిత కాలంలో నిరూపించిన వారు సుందరయ్య, రాజేశ్వర రావులు. ఆనాడు ఎవరో బొట్టుపెట్టి పిలిస్తేనే పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు కదిలి వచ్చినవారు కారు. ఆ నిర్మాణ కార్య క్రమంలో గాంధీజీ స్ఫూర్తి కూడా నాటి ఆంధ్రా కాంగ్రెస్‌కు లేదు. కాగా, అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం, పదవీ స్వీకార సభ లగాయతు ఈరోజు దాకా, అతని దీర్ఘ పాదయాత్ర స్ఫూర్తి ద్వారా కదిలివచ్చిన తెలుగు ప్రజా బాహుళ్యం, ‘నవరత్నాల’ హామీని ఆచరణలో అక్షరాల అనుభవిస్తున్నారన్నది నగ్న సత్యం, పచ్చి నిజం!
గోపీచంద్ నవలలోని ‘అసమర్థుడి జీవయాత్ర’ కొనసాగించ వలసి వచ్చి, అవినీతి మినహా మరొక యావత్తు లేకుండా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి అభాసుపాలైన నేటి ప్రతిపక్ష నాయ కుడు చంద్రబాబు నీడలోనే రకరకాల వేషాలలో వామపక్షాలలోని కొందరు నాయకులు కాలక్షేపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజనకు, ఆ సాకు చాటున పదవిని ఆంధ్రలో కాపాడుకోవడానికి తనకు తానై రహస్యంగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముందు విభ జనపై సంతకంచేసి ముక్కుముఖంలేని రాజధానిని ఎంపిక చేశాడు. అదీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు, ఆ పేరిట తనకూ, వంది మాగధులకు ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కాబోయే రాజధాని భూములపై స్పెక్యులేషన్ వ్యాపారానికి గజ్జెకట్టినవాడు బాబు. అమరావతి పేద రైతుల్ని మభ్యపెట్టి, వారి భూముల సరిహద్దులు చెరిపి, వారిని బికారులు చేయడానికి సన్నద్ధమయ్యాడు, వంది మాగధులందరికీ ‘తిలా పాపం తలా పిడికెడు’ వంతున భూముల్ని దోచిబెట్టి అందులో ఒక వామపక్షంలో తనకు కొమ్ముకాస్తున్న ఒక రిద్దరు మిత్రులకు కూడా అవినీతిలో భాగం చేశాడని, అందుకే బాబు అక్రమ ధర్మాలన్నింటికి ‘తలూపి’నట్టు లోకం కోడై కూస్తోంది. ఆ అపవాదు నుంచి కొందరు వామపక్షీయులు తక్షణం బయటపడాల్సి ఉంటుంది.
నెగటివ్ ధోరణి ప్రజావ్యతిరేకం!
అలాగే రాష్ట్రాధికారానికి వచ్చిన నాటి నుంచి యువనేత జగన్‌ను ముప్పెరగొన్న సమస్యలు అసాధారణమైనవి. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, మహిళాభ్యుదయా నికి అనేక కనీస ప్రజాహిత సంస్కరణలను దేశంలో ఒక్క కేరళ మినహా అనితరసాధ్యంగా అమలు జరుపుతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు వచ్చింది. దానికితోడు కరోనా వైరస్ మహమ్మారి ఎదురైనా, దాన్ని తట్టుకుని ఒకవైపున ప్రజల ఆరోగ్య భాగ్యాన్ని రక్షించి కాపాడుకొనే ప్రయత్నంలో వైఎస్ జగన్ తీసుకున్న ప్రజా వైద్య రక్షణ చర్యలూ దేశ ప్రజల, వివిధ రాష్ట్రాల ప్రశంసలూ అందు కుంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో జగన్‌కు అంతో ఇంతో అండగా, చేదోడు వాదో డుగా వామపక్షాలు ఆచరణలో పూర్తిగా నిలవకపోయినా– ‘దీవులు’ మాదిరిగా అనంతపూర్‌లో రాంభూపాల్ సీపీఎం జిల్లా కార్యదర్శి, కడపలో ఈశ్వరయ్య (సీపీఐ) ప్రభృతులు మాత్రం క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా, సంక్లిష్ట సమయాల్లో తమ క్యాడర్‌ను కాపాడుకోవాలన్నా, కష్టకాలంలో ప్రజలకు ఆచ రణలో అండగా నిలవాలన్నా ‘నెగెటివ్ ధోరణులు’ మానుకోవాలి. ఈ ఇరువురు స్థానిక వామపక్ష నాయకులు మినహా ప్రస్తుత కాలంలో ఆచరణలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న వామపక్షీయులు ‘కలికాని కైనా’ కనిపించకపోవడం విచారకరం. కనీసం ఆనాటి ‘బందరు కాల్వల పూడికతీత’ పనుల్లో పాల్గొన్న కార్యకర్తల కృషినుంచైనా స్ఫూర్తిని చేరుకోవాలి. తెలంగాణలో కూర్చుని ఆంధ్ర రాజకీయాలు నడపగోరే చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోకండి. జోగి, జోగి రాసు కుంటే రాలేది బూడిదే!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment