రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ అనుకూల వైఖరిని తీసుకున్న దేశాలు కూడా రష్యాకు అనుకూలంగానో, తటస్థంగానో మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు వ్యవహరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు కూడా ఇందులో ప్రభావం చూపుతున్నాయి. అయితే, అలీన దేశాలకు మానవతా సాయం అందించాలన్న పాశ్చాత్య దేశాల నిబంధనల వెలుగులో ఈ తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. చాలాదేశాలు తటస్థతను ఎంచుకోవడమే దీనికి కారణం. కొన్ని ఆధారాల ప్రకారం, రష్యాను ఖండిస్తున్న దేశాల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఉక్రెయిన్ అనుకూల వైఖరి నుండి బోట్స్ వానా రష్యా పైవు మళ్లింది. దక్షిణాఫ్రికా, తటస్థత నుంచి రష్యా అనుకూల వైఖరి చూపుతోంది. రష్యా చర్యను ఖండించిన కొలంబియా ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అదే సమయంలో, చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నాయి.
ఆఫ్రికాను తీసుకుందాం. మాస్కో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆఫ్రికన్ యూనియన్ పిలుపునిస్తున్నప్పటికీ, అనేక ఆఫ్రికా ఖండ దేశాలు తటస్థంగానే ఉంటున్నాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి వామపక్ష అనుకూల ప్రభుత్వాల సంప్రదాయ ఫలితమేనని కొందరు పరిశీలకులు వాదిస్తు న్నారు. ఆఫ్రికా దేశాల అయిష్టతకు మూలం తమ అంతర్గత వ్యవహారాల్లో కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు బహిరంగంగా పాశ్చాత్య దేశాలు పాటించిన జోక్యందారీ చరిత్రలో ఉందని మరికొందరు చెబుతున్నారు.
రష్యాను ఖండించడానికి అయిష్టత చూపడం అనేది ఆఫ్రికాను దాటిపోయింది. రష్యా బేషరతుగా, తక్షణం ఉక్రెయిన్ నుంచి వెళ్లి పోవాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని 2023 ఫిబ్రవరిలో లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలావరకు బలపర్చాయి. ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలను బ్రెజిల్ బలపర్చినప్పటికీ, అది రష్యాను నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో బొలీవియా, క్యూబా, ఎల్ సాల్వడార్, వెనిజులా దేశాల వైఖరిని చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా తిప్పి కొట్టాలని అవి సూచించాయి. పైగా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాలు ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేయాలన్న పిలుపును తిరస్కరించాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించాలని జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మెక్సికో ప్రశ్నించింది.
ఆసియాలోనూ ఇదే రకమైన విభజనలు కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా బహిరంగంగానే రష్యాను ఖండించాయి. కానీ ఆగ్నే యాసియా దేశాల కూటమి సామూహికంగా ఈ ఖండన చేయలేదు. ఇక చైనా విషయానికొస్తే – రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరుపుతూనే, ఐక్యరాజ్యసమితిలో పెరుగుతున్న తన ప్రాభవం ద్వారా సమతుల్యత సాధించేలా వ్యవహరిస్తోంది. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉక్రెయిన్ ఘర్షణపై జరిగిన ఓటింగుకు గైర్హాజరైంది.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు ఘర్షణతో పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. అందువల్ల సోవియట్ యూనియన్, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధికి వెలుపల విదేశీ విధానంలో స్వయంప్రతిపత్తిని ఈ దేశాలు పొందగలిగాయి.
యూరోపియన్ యూనియన్ వైఖరిని బలపర్చడంలో ఇతర దేశాల అయిష్టత అనేది విదేశీ విధాన స్వతంత్ర కాక్షకూ, పొరుగు దేశంతో విరోధం పెట్టుకోవడానికి అయిష్టతకూ సంబంధించినదిగా ఉంటోందని యూరోపియన్ యూనియన్ ఆంక్షల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ దేశాలకూ, రష్యాకూ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి అలీన విధానం ఆయా దేశాలకు ఉపకరిస్తోంది. ఈ కారణం వల్లే, అనేక ప్రజాస్వామిక దేశాలు తటస్థ వైఖరికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ‘ఇరుపక్షాలతో మాట్లాడండి’ అనడంలో దీన్నే మనం చూడవచ్చు. రష్యాను ఖండించ డానికి వ్యతిరేకంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకోవడంలో నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు ప్రభావం చూపుతున్నాయి.
ఇండియాకు పెరిగిన రష్యా చమురు
ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రష్యా, భారత్ ఒకే విధమైన వ్యూహాత్మక, రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించాయని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 2000 సంవత్సరంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో బహుళ ధ్రువ గ్లోబల్ వ్యవస్థను నిర్మించాలన్నది రష్యా ఉద్దేశంగా ఉండింది. అమెరికాను భాగస్వామిగా చేసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతదేశాన్ని రష్యా అభ్యర్థించేది. అలాగే భారతీయ అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా మద్దతునిచ్చింది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా బలపరుస్తూ వచ్చింది.
భారత్ ఆయుధ వాణిజ్యంలో రష్యా కీలక భాగస్వామిగా ఉండ టాన్ని రష్యా కొనసాగించింది. 1992 నుంచి 2021 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 65 శాతం వరకు రష్యా సరఫరా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి, భారత్‌కు చౌక ధరకు చమురు అందించే కీలకమైన సరఫరాదారుగా రష్యా మారి పోయింది. 2021లో రష్యా నుంచి రోజుకు 50 వేల బ్యారెల్స్‌ను భారత్ కొనుగోలు చేయగా, 2022 జూన్ నాటికి అది రోజుకు పది లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది.
బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రయోజనాలు
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉన్న బ్రెజిల్ అత్యధిక ఎరువుల వినియోగదారు కూడా. 2021లో రష్యా నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకున్న దిగుమతుల విలువ 5.58 బిలియన్ డాలర్లు కాగా, వాటిలో 64 శాతం వాటా ఎరు వులదే. తమ రెండు దేశాల మధ్య ఇంధన సంబంధాలను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా గ్యాస్ సంస్థ గాజ్‌ప్రోమ్ బ్రెజిల్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుందని 2023 ఫిబ్రవరిలో బ్రెజిల్ ప్రక టించింది. 2023 మార్చి నాటికి బ్రెజిల్‌కు రష్యా డీజిల్ ఎగుమతులు కొత్త రికార్డులను చేరుకున్నాయి. అదే సమయంలో రష్యన్ చమురు ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు కూడా పతాక స్థాయిని చేరుకున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సంద ర్భంలో– రష్యా, చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నౌకా విన్యా సాలను చేపట్టింది. నౌకాదళ నిధుల లేమితో ఉన్న దక్షిణాఫ్రికా ఈ విన్యాసాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆఫ్రికా ఖండానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలుస్తోంది. అణుశక్తిని కూడా రష్యా సరఫరా చేస్తోంది. ఆఫ్రికా ఖండానికి 30 శాతం వరకు గోధుమ వంటి ధాన్యాలను కూడా రష్యా సరఫరా చేస్తోంది. రష్యా ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఆఫ్రికా ఖండానికి చేరుతున్నాయి.
మరొక ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, అలీన విధానం ఇప్పటికీ పాపులర్ ఎంపికగా కొనసాగుతోందని ఉక్రెయిన్ యుద్ధం ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ముఖ్యమైన రాజకీయ ఉనికిగా అలీన విధానం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇతర ఉదంతాలను చూస్తే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో హయాంలో ఇది మారినప్పటికీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బ్రెజిల్ వంటి దేశాల సంప్రదాయ విధానంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి అలీన దేశాల్లో చాలావాటికి ప్రత్యక్ష మదుపులు, అభివృద్ధి, మానవతా సహాయాన్ని అందించడం అనే పాశ్చాత్య నిబంధనల వెలుగులో చూస్తే ఇది విరుద్ధ ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది.
జోస్ కబల్లెరో
వ్యాసకర్త సీనియర్ ఆర్థికవేత్త
(‘ద కాన్వర్సేషన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment